నేనూ డీప్ ఫేక్ బాధితుడినే: మోడీ
మన వ్యవస్థకు ఇటువంటి వీడియోలు పెనుముప్పుగా పరిణమించాయని, సమాజంలో ఇవి గందరగోళానికి దారితీస్తాయని మోడీ ఆందోళన వ్యక్తం చేశారు.
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన్నతో పాటు బాలీవుడ్ నటి కాజోల్ డీప్ ఫేక్ వీడియోల వ్యవహారం పెను దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించుకొని ఇటువంటి తప్పుడు పనులకు పాల్పడుతున్న వైనంపై సినీ నటులు, సెలబ్రిటీలు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ వ్యవహారంపై భారత ప్రధాని నరేంద్ర మోడీ కూడా స్పందించారు. డీప్ ఫేక్ వీడియోకు తాను కూడా బాధితుడినేనని మోడీ అన్నారు.
తాను ఓ పాట పాడినట్టుగా డీప్ ఫేక్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో దర్శనం ఇచ్చిందని అన్నారు. ఆ వీడియోను తన సన్నిహితులు తనకు పంపించారని మోడీ చెప్పారు. మన వ్యవస్థకు ఇటువంటి వీడియోలు పెనుముప్పుగా పరిణమించాయని, సమాజంలో ఇవి గందరగోళానికి దారితీస్తాయని మోడీ ఆందోళన వ్యక్తం చేశారు. సాంకేతిక విజ్ఞానాన్ని దుర్వినియోగం చేస్తున్నారని, ఇది సమస్యాత్మకమైన అంశం అని మోడీ అభిప్రాయపడ్డారు. ఇటువంటి వీడియోలపై అప్రమత్తంగా ఉండాలని, వాటిపై ప్రజలకు మీడియా అవగాహన కల్పించేందుకు ప్రయత్నించాలని అన్నారు.
కొత్త టెక్నాలజీతో ఎదురయ్యే సమస్యలను ఎదుర్కోవడంపై ప్రజలను అప్రమత్తం చేయాలని కోరారు. వైరల్ అవుతున్న డీప్ ఫేక్ వీడియోలను గుర్తించాలని, ఫ్లాగ్ ఇచ్చేలాగా హెచ్చరికలు జారీ చేయాలని చాట్ జీపీటీ బృందాన్ని కోరినట్లుగా మోడీ చెప్పారు.