గర్భగుడికి చేరిన అయోధ్య రాముడు... తొలి ఫోటో ఇదే!

మరో నాలుగు రోజుల్లో జరగనున్న అయోధ్య రాముడి ప్రాణప్రతిష్ఠ వేడుక సందర్భంగా నగరం మొత్తం ఆధ్యాత్మిక కళను సంతరించుకొంది

Update: 2024-01-19 06:37 GMT

మరో నాలుగు రోజుల్లో జరగనున్న అయోధ్య రాముడి ప్రాణప్రతిష్ఠ వేడుక సందర్భంగా నగరం మొత్తం ఆధ్యాత్మిక కళను సంతరించుకొంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న శ్రీరాముని భక్తులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్న ఈ కార్యక్రమానికి సంబంధించి మరో కీలక ఘట్టం ముగిసింది. ఇందులో భాగంగా తాజాగా బాల రాముడు అయోధ్యలోని గర్భగుడికి చేరుకున్నాడు. ప్రస్తుతం ఈ విగ్రహం ముఖం, పైభాగాన్ని పసుపు, తెలుపు వస్త్రాలతో కప్పి ఉంచారు.


అవును... జనవరి 22న 2024 మధ్యాహ్నం 12:29:08 గంటలకు అయోధ్య మందిరంలో బాల రాముడి ప్రాణ ప్రతిష్ట ప్రధానమంత్రి నరేంద్రమోడీ చేతుల మీదుగా జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో... బుధవారం రాత్రి ఏటీఎస్‌ కమాండోల భద్రత మధ్య రామ జన్మభూమి ఆవరణకు తరలించిన శ్రీరాముని విగ్రహాలను.. గురువారం ప్రత్యేక క్రేను సహాయంతో గర్భగుడి లోనికి తీసుకువచ్చారు.

ఈ క్రమంలో తొలిసారిగా గర్భ గుడిలోకి ప్రవేశించిన బాల రాముడి విగ్రహ ఫోటోలను భారతీయ జనతాపార్టీ సీనియర్ నేత ప్రకాశ్‌ జావడేకర్‌ ఎక్స్‌ లో పంచుకున్నారు. 51 అంగుళాల పొడవు ఉన్న ఈ బాల రాముడి విగ్రహానికి ముసుగు వేయబడి ఉంది. రాముడు ఐదేళ్ల వయసులో ఉన్నప్పుడు నిలుచున్న రూపంలో ఈ విగ్రహంలో దర్శనమిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. నెట్టింట శ్రీరామ నామస్మరణ మారుమ్రోగుతుంది.

ఈ ప్రాణప్రతిష్ట కార్యక్రమం కోసం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న శ్రీరామ భక్తులు ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో... ఈ నెల 22న ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం ప్రధాని మోడీ చేతుల మీదుగా అత్యంత వైభవంగా జరగనుంది. ఇందులో భాగంగా... ముందుగా ప్రధాని నరేంద్ర మోడీ.. బాల రాముడి విగ్రహానికి ఉన్న ముసుగు తీసి దర్శనం చేసుకోని.. హారతి ఇవ్వనున్నారు.

కాగా... కర్ణాటకలోని మైసూరుకు చెందిన ప్రఖ్యాత శిల్పి అరుణ్‌ యోగిరాజ్‌ ఈ బాల రాముడి విగ్రహాన్ని మలిచిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన చేపట్టిన దీక్షను ట్రస్టు అభినందించింది. ఈ విగ్రహం ఎత్తు 51 అంగుళాలు కాగా... 150 నుంచి 170 కిలోల బరువు ఉంటుందని తెలుస్తోంది. నల్లరాతితో బాల రాముడి విగ్రహాన్ని మలిచారు.

Tags:    

Similar News