ఇక... బడ్జెట్ లేనట్టే.. తేల్చేసిన కూటమి ప్రభుత్వం..!
అదేవిధంగా ఏపీతోపాటు అసెంబ్లీ ఎన్నికలు జరిగిన ఒడిశాలోనూ పూర్తిస్థాయి బడ్జెట్‌ను జూన్-జూలై మధ్య ప్రవేశ పెట్టారు.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి వార్షిక బడ్జెట్ ను ప్రవేశ పెట్టడం లేదని తెలిసింది. వాస్తవానికి ఈ ఏడాది జూన్‌లో ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత.. ఏర్పడిన నూతన ప్రభుత్వం ఏదైనా కూడా పూర్తిస్థాయి వార్షిక బడ్జెట్‌ను ప్రవేశ పెట్టాల్సి ఉంటుంది. కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారు కూడా.. మూడోసారి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ఇదే పనిచేసింది. అదేవిధంగా ఏపీతోపాటు అసెంబ్లీ ఎన్నికలు జరిగిన ఒడిశాలోనూ పూర్తిస్థాయి బడ్జెట్‌ను జూన్-జూలై మధ్య ప్రవేశ పెట్టారు.
కానీ,ఏపీ విషయానికి వస్తే మాత్రం జూలైలోనే వార్షిక బడ్జెట్‌ను ప్రవేశ పెడతామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఈ క్రమంలోనే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు అంకురార్పణ కూడా చేశారు. అయితే.. ఆ సమావేశాలు కేవలం గత వైసీపీ ప్రభుత్వ లోపాలను ఎత్తి చూపడం, శ్వేతపత్రాల రూపంలో కొన్ని లోపాలను ఎండగట్టడం వరకే పరిమితం అయ్యారు. ఇదేసమయంలో `రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చూస్తే భయం వేస్తోంది` అని సీఎం చంద్రబాబు సాక్షాత్తూ అసెంబ్లీలోనే వ్యాఖ్యానించారు.
ఈ పరిణామాల నేపథ్యంలో ఆర్థిక పరిస్థితిని గాడిలో పెట్టి అక్టోబరు తొలివారంలో వార్షిక బడ్జెట్‌ను ప్రవేశ పెట్టనున్నట్టు అప్పట్లో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ చెప్పుకొచ్చారు. దీంతో కొంత సమయం తీసుకు న్నా.. బడ్జెట్ను ప్రవేశ పెడతారని అందరూ భావించారు. కానీ, అక్టోబరు వచ్చింది. తొలి వారం కూడా రేపో మాపో గడిచిపోతోంది. అయినప్పటికీ.. బడ్జట్‌కు సంబంధించిన ప్రక్రియ మాత్రం ఎక్కడా ప్రారంభం కాలేదు. ప్రభుత్వం నుంచి ఉలుకు పలుకు కూడా లేకుండా పోయింది.
ఈ విషయంపై ఆర్థిక శాఖ అధికారి ఒకరు మీడియాతో ఆఫ్ దిరికార్డుగా మాట్లాడుతూ.. తమకు ఎలాంటి ప్రతిపాదనలు రాలేదన్నారు. ఈ సారికి మళ్లీ ఓటాన్ అకౌంట్ వైపే మొగ్గు చూపుతున్నట్టు ఆయన తెలిపా రు. ఓటాన్ అకౌంట్ అనేది వైసీపీ హయాంలో ఏప్రిల్-జూన్ వరకు మాత్రమే ప్రవేశ పెట్టారు. దీని తర్వాత.. రాష్ట్ర సర్కారు బడ్జెట్ను వచ్చే మార్చి 31వ తేదీ వరకు ప్రవేశ పెట్టాల్సి ఉన్నా.. ఇప్పుడు ఆ ఊసు లేకపోవడంతో ఈ దఫా ఇక, ఏపీకి బడ్జెట్‌లేదన్న విషయం స్పష్టమవుతోంది. అయితే.. అధికారికంగా మంత్రులు కానీ, ముఖ్యమంత్రి కానీ.. దీనిపై స్పందించకపోవడం గమనార్హం.