సినీ ట్రిక్కులతో మరిన్ని చిక్కులు.. లాజిక్కు తెలుసుకో పోసాని

అయితే తనకు అనారోగ్యం ఉందని పోసాని, ఆయన ఆరోగ్యం బాగుందని పోలీసులు భిన్నవాదనలు వినిపిస్తుండటమే ఆసక్తిరేపుతోంది.

Update: 2025-03-02 08:31 GMT

సినీ నటుడు, వైసీపీ నేత పోసాని క్రిష్ణమురళి కేసులో సినీ ట్విస్టులు రాజకీయంగా ఆసక్తికరంగా మారుతున్నాయి. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం రఘురామ కేసులో ఆయన సినీ డ్రామాలు ఆడుతున్నారని పోలీసులు చెబుతుండటంతో పోసాని మరిన్ని చిక్కులను ఎదుర్కొంటున్నారా? అనే చర్చ మొదలైంది. ప్రస్తుతం 14 రోజుల రిమాండులో ఉన్న పోసానిపై రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 17 కేసులు ఉన్నాయి. ప్రస్తుత కేసులో ఆయనకు బెయిల్ వచ్చినా మరో కేసులో అరెస్టు చేసే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. అయితే తనకు అనారోగ్యం ఉందని పోసాని, ఆయన ఆరోగ్యం బాగుందని పోలీసులు భిన్నవాదనలు వినిపిస్తుండటమే ఆసక్తి రేపుతోంది.

సినీ నటుడు పోసాని క్రిష్ణమురళిని ఎట్టిపరిస్థితుల్లో క్షమించే పరిస్థితి కనిపించడం లేదని తాజా అప్డేట్స్ ధ్రువీకరిస్తున్నాయి. ఆయనపై ప్రభుత్వ వర్గాల్లో ఏ మాత్రం కనికరం ఉన్నా, శనివారం ఆయనను ఆస్పత్రిలో ఉంచేవారని, ఆయన చెప్పే కారణాలను అంగీకరించేవారని అంటున్నారు. గతంలో ప్రభుత్వ పెద్దలపై పోసాని చేసిన వ్యాఖ్యల కారణంగా ఆయనను ఎట్టిపరిస్థితుల్లోనూ వదిలిపెట్టొద్దనే ఒత్తడి ప్రభుత్వంపై వస్తోందని చెబుతున్నారు. అటు సినీ రంగం నుంచి కూడా పోసానికి మద్దతుగా ఎవరూ మాట్లాడకపోవడంతో ఆయనకు మరిన్ని కష్టాలు ఎక్కువయ్యాయని అంటున్నారు.

వైసీపీ నుంచి ఆయనకు అన్నిరకాల న్యాయ సహాయం అందుతున్నా, ప్రభుత్వం, పోలీసుల బలమైన వాదనలతో అవన్నీ వీగిపోతున్నట్లు ప్రస్తుత పరిస్థితుల బట్టి అర్థమవుతోందని అంటున్నారు. అందుకే ఆయన తనకు తెలిసినా సినిమా ట్రిక్స్ ను వాడుకోవాలని డిసైడ్ అయ్యారా? అనే చర్చ జరుగుతోంది. దీనివల్ల ఆయనకు మంచి జరగకపోగా, మరిన్ని సమస్యలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయని న్యాయవర్గాలు చెబుతున్నాయి. అనారోగ్యం లేకపోయినా కుంటి సాకులతో ఆస్పత్రికి వెళితే.. భవిష్యత్తులో బెయిల్ విచారణ సందర్భంగా పోలీసులు ఆ విషయాన్ని ప్రస్తావించి బెయిల్ ప్రయత్నాలకు గండి కొట్టే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది.

ప్రస్తుతం రాజంపేట జైలులో ఉన్న పోసాని తొలి నుంచి గుండె సంబంధిత అనారోగ్యంతో బాధపడుతున్నారని, ఆయనకు సంబంధిత మందులు ఇస్తున్నామని పోలీసులు చెబుతున్నారు. అయితే శనివారం తనకు కడపునొప్పిగా ఉందని, అనంతరం గుండెనొప్పి అంటూ చెప్పిన పోసాని మాటలను డాక్టర్లు ధ్రువీకరించలేదు. ఆయనకు అంతా బాగుందని సర్టిఫికెట్ ఇవ్వడంతో పోసాని మళ్లీ జైలుకు వెళ్లాల్సివచ్చింది. తన సినిమా ట్రిక్కు పనిచేయకపోవడంతో ఇప్పుడు పోసాని ఏం చేస్తారనేది ఆసక్తి రేపుతోంది.

Tags:    

Similar News