అమరావతితో పాటుగా విశాఖ...బాబు సూపర్ స్ట్రాటజీ
దాంతో ఇటు ఉత్తరాంధ్రా వాసులకు అటు రాయలసీమ జనాలకు అసంతృప్తి ఏర్పడింది.
ఏపీ సీఎం చంద్రబాబు గతంలో చేసిన తప్పులను ఈసారి అసలు చేయదలచుకోవడం లేదు. గతంలో ఆయన అన్నీ అమరావతిలోనే అన్నట్లుగానే మాట్లాడేవారు. దాంతో ఇటు ఉత్తరాంధ్రా వాసులకు అటు రాయలసీమ జనాలకు అసంతృప్తి ఏర్పడింది. దాంతో వారు 2019లో టీడీపీని ఓడించారు.
ఇక అమరావతి రాజధాని ఉన్న చోట కూడా పెద్దగా ఏమీ జరగలేదు అని వారూ ఓడించారు. అలా మూడిందాలుగా బాబు పార్టీ చెడిపోయి 23 సీట్లకు పడిపోయింది. అయితే ఈసారి అలాంటి ఆలోచనలు బాబు చేయడం లేదు. అమరావతి ఏపీకి ఏకైక రాజధాని అంటూనే రాయలసీమ అభివృద్ధికి ప్రణాళికలు రచిస్తున్నారు.
అంతే కాదు ఏపీలో ఈ రోజుకీ మెగాసిటీగా ఉన్న విశాఖ సహా ఉత్తరాంధ్రా అభివృద్ధికి యాక్షన్ ప్లాన్ ని సిద్ధం చేస్తున్నారు. ఐటీ సర్వీస్ సెక్టార్ తో పాటు సినీ పరిశ్రమ టూరిజం ప్రాజెక్టులు విశాఖతో పాటు ఉత్తరాంధ్రాకు వచ్చేలా చర్యలు తీసుకుంటున్నారు.
విశాఖలో ఇప్పటికే ఒక అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం ఉండగా మరో స్టేడియం ని నిర్మించేందుకు ప్రభుత్వం ప్రతిపాదిస్తోంది. దానికి భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుకి దగ్గరలోనే నిర్మిస్తున్నారు. తాజాగా ఈ ప్రాంతాన్ని ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని పరిశీలించారు. అన్ని హంగులతో క్రికెట్ స్టేడియం ని నిర్మిస్తామని చెప్పారు.
అమరావతితో పాటుగా విశాఖను అభివృద్ధి చేయడానికి తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని అన్నారు.మరో వైపు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా విశాఖ నుంచి విజయవాడకు రెండు విమానాలను ఆదివారం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ విశాఖ ఏపీలో కీలకమైన నగరం అని దానిని తమ ప్రభుత్వం బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తుందని చెప్పారు.
ఇక విశాఖలో అభివృద్ధి చూస్తే ఇప్పటికే టీసీఎస్ వచ్చేసింది. లూలూ గ్రూపు విశాఖలో మాల్స్ నిర్మాణానికి రెడీ అవుతోంది. ఇపుడు భోగాపురంలో 300 ఎకరాలలో అంతర్జాతీయ స్టేడియం ని అన్ని హంగులతో నిర్మిస్తే కనుక ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు దగ్గరలో ఉండడంతో అంతర్జాతీయ క్రీడాకారులు ఇక్కడికే వస్తారు. దాంతో అభివృద్ధి కూడా బాగా జరుగుతుందని అంటున్నారు.
రానున్న రోజులలో మరిన్ని పరిశ్రమలతో పాటు రైల్వే జోన్ కూడా వస్తే విశాఖ సహా ఉత్తరాంధ్రా దశ తిరుగుతుందని అంటున్నారు. చిత్ర పరిశ్రమని కూడా విశాఖకు ఆహ్వానిస్తున్నట్లుగా ప్రభుత్వం చెబుతోంది. రుషికొండ ప్యాలెస్ ని కూడా వారి షూటింగులకు ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నారు. మొత్తానికి విశాఖను కూడా అమరావతికి ధీటుగా అభివృద్ధి చెందుతుందని కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది.