జనసేనతో సంబంధం లేకుండా బాబు దూకుడు...!
ఈ నేపధ్యంలో నుంచి చూసినపుడు రెండు పార్టీలు చర్చించుకుని అభ్యర్ధుల ప్రకటన చేయాల్సి ఉంటుంది.
ఏపీలో టీడీపీ జనసేన కూటమిగా ముందుకు వస్తున్నాయి. అయితే అభ్యర్ధుల ప్రకటన రెండు పార్టీలు కలసి చేస్తాయని అంతా భావిస్తున్నారు. దాని కంటే ముందు ఉమ్మడి ఎన్నికల ప్రణాళికను కూడా సిద్ధం చేస్తాయని పేర్కొంటున్నారు. ఈ నేపధ్యంలో నుంచి చూసినపుడు రెండు పార్టీలు చర్చించుకుని అభ్యర్ధుల ప్రకటన చేయాల్సి ఉంటుంది.
కానీ తాజాగా ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పర్యటనలో భాగంగా జరిగిన రా కదలిరా సభలో చంద్రబాబు సడెన్ గా మండపేట టీడీపీ అభ్యర్ధిని ప్రకటించారు. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న వేగుళ్ళ జోగేశ్వరరావుని మరోసారి అభ్యర్ధిగా నిలబెడుతున్నట్లుగా బహిరంగ సభలో చంద్రబాబు ప్రకటించారు.
ఆ విధంగా చంద్రబాబు అధికారికంగా ఏపీలో ప్రకటించిన తొలి అభ్యర్ధి వేగుళ్ళ కావడం విశేషం. ఆయన 2009 నుంచి వరసగా మండపేట నుంచి గెలుచుకుని వస్తున్నారు. ఆయన హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇపుడు మరోసారి ఆయనకే చాన్స్ ఇస్తూ చంద్రబాబు అనౌన్స్ చేశారు.
ఇదిలా ఉంటే మండపేటలో జనసేన కూడా బలంగా ఉంది. ఆ పార్టీ కూడా సీటు ఆశిస్తోంది. వేగుళ్ళ లీలాక్రిష్ణ టికెట్ ఆశిస్తున్నారు. మూడు సార్లు చేసిన జోగేశ్వరరావుని ఈసారి పక్కన పెడతారు అని భావించారు. పొత్తు పార్టీ అయిన జనసేనకు అవకాశం ఇస్తారని అనుకున్నారు
అయితే చంద్రబాబు మాత్రం తన పార్టీ డెసిషన్ అయితే ప్రకటించారు. అయితే ఇది బాబు జనసేనతో పొత్తు లేనపుడే తీసుకున్నారు. సిట్టింగులు అందరికీ ఈసారి టికెట్లు ఇస్తామని చంద్రబాబు చాలా కాలం క్రితమే విధానపరమైన నిర్ణయం తీసుకున్నారు. ఆయా సీట్ల కోసం పొత్తు పార్టీ జనసేన పోటీ పడినా చేసేది ఏమీ ఉండదు నిర్ణయం మారదని అంటున్నారు.
అందుకే చంద్రబాబు మండపేట అభ్యర్ధిని ప్రకటించారు అని అంటున్నారు. ఏది ఏమైనా రానున్న రోజుల్లో టీడీపీ కూడా తన అభ్యర్ధులను వరసబెట్టి ప్రకటిస్తుంది అని అంటున్నారు. ఎన్నికలు దగ్గరకు వచ్చిన వేళ ఇప్పటి నుంచే అభ్యర్ధులను ప్రకటించకపోతే మాత్రం ప్రచారం జోరు అందుకోదని టీడీపీ అధినాయకత్వం భావిస్తోంది.