బాబు జగన్ ఒకే రకమైన స్టేట్మెంట్లు ?

కానీ 2024లో ఫలితాలు బోల్తా కొట్టి 11 సీట్లకే వైసీపీ పరిమితం అయితే మాత్రం ఈవీఎంలను పట్టుకుని విమర్శిస్తున్నారు.

Update: 2024-06-15 11:49 GMT

రాజకీయాల్లో గెలుపు ఓటములు సాధారణంగా జరుగుతూ ఉంటాయి. భారీ విజయాలు దక్కినపుడు ఏవీ కనిపించవు అంతా మన కోసమే అని అనుకుంటారు. అదే పరాజయాలు ఎదురైతే సాకులు లెక్కలేనన్ని కనిపిస్తాయి. వాటినే ఈజీగా నమ్ముతూ ఉంటారు. 151 సీట్లు 2019లో వైసీపీకి దక్కినపుడు ఈవీఎంలను కళ్ళకు అద్దుకున్నారు. ముద్దాడారు. భేషుగ్గా ఎన్నికలు జరిగాయని అన్నారు.

కానీ 2024లో ఫలితాలు బోల్తా కొట్టి 11 సీట్లకే వైసీపీ పరిమితం అయితే మాత్రం ఈవీఎంలను పట్టుకుని విమర్శిస్తున్నారు. టాంపరింగ్ అంటున్నారు. ఇంకా ఏవేవో అంటున్నారు. గెలిస్తే మన క్రెడిట్ ఓడితే మాత్రం ఈవీఎంల తప్పు. ఇదెక్కడి న్యాయం సార్ అని జనాలు అంటున్నారు.

ఇది వైసీపీ మాట మాత్రమే కాదు టీడీపీది కూడా. 2019లో భారీ ఓటమిని చవిచూసిన టీడీపీ ఇదే విధంగా అంటూ ఉండేది. చంద్రబాబు ఆనాడు అయితే తమ ఓటమికి ఈవీఎంలే కారణం అని విమర్శించారు. ఈవీఎంలను ఎలా టాంపరింగ్ చేయవచ్చో కూడా ఆయన చెబుతూ వచ్చారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న ఈవీఎంలు అని కూడా ఆయన గట్టిగా మాట్లాడుతూ వచ్చారు.

ఇపుడు సరిగ్గా అవే మాటలను జగన్ అంటున్నారు. ఆయన నేరుగా ఈవీఎంల టాంపరింగ్ అని అనడం లేదు కానీ శకుని పాచికలు అంటున్నారు. మాయ జరిగింది అంటున్నారు ఇలా ఇండైరెక్ట్ గా ఎన్నికలు సాఫీగా సాగలేదు అని మాత్రం అంటున్నారు. అదే సమయంలో ఆయన పార్టీ వారు ఈవీఎంల టాంపరింగ్ అని గట్టిగానే మాట్లాడుతున్నారు.

పవర్ పాయింట్ ప్రజంటేషన్ కూడా ఇస్తున్నారు. ఈవీఎంల వల్లనే ఇన్ని సీట్లు లక్షలలో ఓట్లు అని కూడా వెటకరిస్తున్నారు. మా పాలన అంతా బాగుంటే ఎందుకు మేము ఓడిపోతామని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. ఈవీఎంలదే తప్పు అయితే ఆనాడు జగన్ ఎందుకు గెలుస్తారు ఈనాడు బాబు ఎందుకు గెలుస్తారు. మరి ఒకరే కంటిన్యూ కావాలి కదా అన్న చర్చ అయితే సాగుతోంది.

ల్యాండ్ స్లైడ్ విక్టరీ ఏపీ ప్రజలకు కొత్త కాదు బ్యాలెట్ పేపర్లు ఉన్న రోజులలో సైతం ఎన్టీఆర్ కి 1994లో ఇలాంటి తీర్పే ఇచ్చి ఉమ్మడి ఏపీ అసెంబ్లీ అంతా టీడీపీ మిత్ర పక్షాలనే కూర్చోబెట్టారు. అపుడు కాంగ్రెస్ కి దక్కినవి కేవలం 26 సీట్లు మాత్రమే. మరి బ్యాలెట్ పేపర్ ని నాడు తారు మారు చేశారు అని అనగలిగారా అన్నదే ఇక్కడ పాయింట్.

ఈవీఎంలనో మరోటనో సాకులు వెతుక్కుంటూ పోవడం తప్పు అనే అంటున్నారు. ప్రజలు అయిదేళ్ళ పాలన పట్ల తేల్చుకుని ఇచ్చిన తీర్పుగా భావించాలి. పాజిటివ్ గానే తీర్పు తీసుకోవాలి. చంద్రబాబు బయటకు ఈవీంల టాంపరింగ్ వంటి మాటలు అన్నా ఆయనకు పాలనలో జరిగిన లోపాలు తెలుసు. అలాగే రాజకీయంగా వ్యూహాలు ఎక్కడ తప్పో చూసారు. తెలుసుకున్నారు. దాని ఫలితమే ఇపుడు భారీ విజయాన్ని అందుకున్నారు.

కానీ వైసీపీ మాత్రం ఈవీఎంలనే విమర్శిస్తూ కూర్చుంటే చీకటిని తిట్టుకున్నట్లే అని అంటున్నారు. అయిదేళ్ళ పాలనలో సంక్షేమం పేరిట మంచి జరిగితే జరిగి ఉండవచ్చు కానీ దానితో పాటుగా చాలా పొరపాట్లు జరిగాయి. వాటిని సమీక్షించుకోవాలి. నిజయాతీగా ఆత్మ పరిశీలన చేసుకోవాలి. జనాలకు మేము ఎందుకు నచ్చలేదు అని ఆలోచిస్తే వాస్తవాలు అన్నీ బోధపడతాయి అని అంటున్నారు.

ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎవరూ ఎపుడూ ఒకే పార్టీకి ఫేవర్ గా ఉండరు. గతంలో అలా నడిచేదేమో కానీ ఇపుడు చైతన్యవంతమైన సమాజం ఆవిర్భవించింది. ఈ సోషల్ మీడియా యుగంలో అయిదేళ్ళ మొత్తం పాలనను చూసే తీర్పు ఇస్తున్నారు. ఏదీ మరచిపోనీవడం లేదు టెక్నాలజీ కూడా.

దాంతో ఎవరైనా సవ్యంగా పాలిస్తేనే జనాలు ఆదరించేది. అందువల్ల తప్పులు ఏమి చేశామన్నది నిబద్ధతతో పరిశీలించుకోవాలని అంటున్నారు. అలా కాకుండా ఈవీఎంలదే తప్పు ప్రజలు కోరి ఓడించారు అనే మాటలు విన సొంపుగానే ఉంటాయి కానీ ఆయా పార్టీల భవితకు మాత్రం అవి ఏ మాత్రం బాటలు వేయలేవు. చిత్రంగా జగన్ అయినా చంద్రబాబు అయినా ఓటమి మీద రొటీన్ విమర్శలు చేయడమే విశేషమని అంతా చర్చించుకుంటున్నారు.

Tags:    

Similar News