ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి బాబు నో.. ఏపీలో కొత్త రాజకీయం షురూ!
విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా బొత్స సత్యనారాయణ నామినేషన్ వేయటం తెలిసిందే.
విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ విషయంలో ఒక నిర్ణయానికి ఏపీ ముఖ్యమంత్రి.. టీడీపీ అధినేత చంద్రబాబు ఒక నిర్ణయానికి వచ్చేసినట్లుగా తెలుస్తోంది. విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం బలం లేని ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి దిగే కంటే.. దూరంగా ఉండాలని.. ఏపీ ప్రజలకు సరికొత్త రాజకీయాన్ని పరిచయం చేయాలని.. ఇప్పటివరకు సాగిన తీరుకు భిన్నంగా ఉండాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది.
విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా బొత్స సత్యనారాయణ నామినేషన్ వేయటం తెలిసిందే. ఈ ఎన్నికల్లో మొత్తం 838 ఓట్లు ఉంటే.. అత్యధికంగా (500లకు పైగా ఓట్లు) వైసీపీకే ఉన్నాయి. అలాంటి వేళలో ఏపీ అధికారపక్షంగా ఉన్న కూటమిలోని ప్రధాన భాగస్వామి అయిన టీడీపీ బరిలోకి దిగుతుందన్న అభిప్రాయం జోరుగా సాగుతోంది. అయితే.. ఈ అంశంపై చంద్రబాబు ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. విలువల గురించి అదే పనిగా మాట్లాడుతున్న వేళలో.. ఏపీ ప్రజలకు సరికొత్త రాజకీయాన్ని చూపిస్తామని చెప్పి.. బలం లేని చోట బరిలోకి దిగటం మంచి సంకేతాలు ఇవ్వదన్న భావనకు చంద్రబాబు వచ్చినట్లుగా తెలుస్తోంది.
అదే సమయంలో కూటమి భాగస్వామి అయిన పవన్ కల్యాణ్ సైతం అలాంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లుగా సమాచారం. అసెంబ్లీ ఎన్నికల్లో చారిత్రక గెలుపును అందించిన ప్రజలకు.. ఒక్క సీటు కోసం కక్కుర్తి పడినట్లుగా కనిపించటంలో అర్థం లేదన్నట్లు తెలిసింది. దీనికి తోడు ఒక్క ఎమ్మెల్సీని అదనంగా పొందటం వల్ల వచ్చే లాభం కంటే కూడా.. ఒక్క ఎమ్మెల్సీ కోసం అడ్డదారులు తొక్కిన అపప్రధను మూటకట్టుకోవటం ఏ మాత్రం సరికాదన్న విషయాన్ని స్పష్టం చేసినట్లుగా సమాచారం. ఇదే విషయాన్ని తెలుగు తమ్ముళ్లకు చెప్పగా.. కొందరు పోటీ చేసి.. అధికార బలాన్ని చూపించాలన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లు సమాచారం.
ఈ సందర్భంగా వారి మాటల్నిసీఎం చంద్రబాబు సున్నితంగా తిరస్కరించినట్లు చెబుతున్నారు. ఐదేళ్ల వైసీపీ సర్కారు గురించి తరచూ మాట్లాడటం.. అందుకు భిన్నంగా వ్యవహరించే కన్నా.. పోటీకి దూరంగా ఉండటం ద్వారా బలం లేని చోట బలాన్ని ప్రదర్శించాలన్న తీరు తమకు లేదన్న విషయాన్ని ప్రజలకు అర్థమయ్యేలా చేయాలన్నది చంద్రబాబు ఆలోచన. తన నిర్ణయంతో వైసీపీకి.. తనకు మధ్యనున్న తేడాను తెలిపేందుకు వీలుగా బరిలో ఉండకూడదని డిసైడ్ చేసినట్లుగా తెలుస్తోంది.