కొత్త ఆందోళన... బాలయ్య పై బాబు అసహనం?

ఈ సమయంలో చంద్రబాబు రియాక్ట్ అయ్యారని.. బాలకృష్ణ వ్యవహార శైలిపై అసహనం వ్యక్తం చేశారని అంటున్నారు.

Update: 2024-01-19 12:10 GMT

టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షులు, దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు 28వ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్ లోని "ఎన్టీఆర్ ఘాట్" వద్ద జరిగిన రచ్చ సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా బాలయ్య ఓవర్ యాక్షన్ చేశారని కొందరంటే.. కాదు అవి పిల్ల చేష్టలని మరికొందరు చెప్పుకొచ్చారు! ఏది ఏమైనా... అక్కడ జరిగిన సంఘటనలో అన్ని వేళ్లూ బాలయ్య వైపే చూపించాయనేది మాత్రం స్పష్టమవుతుందని తెలుస్తుంది. ఈ సమయంలో చంద్రబాబు రియాక్ట్ అయ్యారని తెలుస్తుంది.

అవును... తాజాగా ఎన్టీఆర్ ఘాట్ వద్ద... జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు తొలగించాలంటూ బాలయ్య హుకుం జారీచేశారంటూ ఫ్యాన్స్ ఆవేదన, ఆగ్రహం వ్యక్తం చేయడం.. ఈ వ్యవహారం రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ హాట్ టాపిక్ గా మారడం.. ఈ విషయంలో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు, న్యూట్రల్ సినీ అభిమానులు సైతం బాలయ్య తీరును తప్పుబట్టడం.. ఈ సందర్భంగా టీడీపీకి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో ప్రచారం ఊపందుకోవడం తెలిసింది.

ఈ సమయంలో చంద్రబాబు రియాక్ట్ అయ్యారని.. బాలకృష్ణ వ్యవహార శైలిపై అసహనం వ్యక్తం చేశారని అంటున్నారు. ఇందులో భాగంగా ఎన్నికల సమయంలో ఇలాంటి చేష్టల వల్ల ఎవరికి ఉపయోగం అని ప్రశ్నించారని చర్చ నడుస్తుంది! ప్రతీ ఓటూ కీలకంగా మారుతున్న ఈ ఎన్నికల్లో... జూనియర్ అభిమానులను హర్ట్ చేయడం వల్ల కలిగే నష్టాన్ని ఎందుకు అంచనా వేయలేకపోతున్నారని ఫైర్ అయినట్లు సోషల్ మీడియాలో ఇష్యూ వైరల్ అవుతుంది.

అలా అని చంద్రబాబుకి జూనియర్ పై ఏదో ప్రేమ ఉందని కాదు కానీ... ఎన్నికల సమయంలో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులంతా గంపగుత్తగా టీడీపీని వ్యతిరేకిస్తే జరిగే పరిణామాలు గతంకంటే దారుణంగా ఉంటాయని.. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోకుండా ఇలాంటి పనులు చేయడం వల్ల పార్టీకి డ్యామేజ్ చాలా ఎక్కువగా ఉంటుందని బాబు అసహనం, ఆగ్రహం వ్యక్తం చేశారని నెట్టింట చర్చ నడుస్తుంది.

కాగా... చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు పార్టీ ఆఫీసులో అధ్యక్షుడి ఛైర్ లో కూర్చుని.. తాను ఓదార్పు యాత్ర చేయబోతున్నట్లు బాలయ్య ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇదే సమయంలో అసెంబ్లీలోనూ చంద్రబాబు సీట్లోకి ఎక్కి హల్ చల్ చేశారు. దీంతో మరింత నష్టం జరగకుండా ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా బాలయ్యను కంట్రోల్ చేశారని చెబుతుంటారు. అందులో భాగంగానే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో టీడీపీ తరుపున బాలయ్య ప్రచారం చేస్తారనే చర్చ కూడా నడిచిన సంగతి తెలిసిందే.

ఏది ఏమైనా... తాజాగా ఎన్టీఆర్ ఘాట్ వద్ద జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీల విషయంలో బాలయ్య ప్రవర్తనపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వెళ్లివెత్తుతున్న నేపథ్యంలో... ఇది టీడీపీకి పడే ఓట్లకు భారీ గండికొట్టే అవకాశం ఉందనే చర్చ మొదలైంది. ఇదే సమయంలో ఎన్నికల వరకూ ఈ విషయం సజీవంగా ఉండే అవకాశం లేకపోలేదని అంటున్నారు పరిశీలకులు. ఈ నేపథ్యంలోనే బాలయ్య పై బాబు అసహనం ప్రదర్శించారని నెట్టింట ఒక చర్చ వైరల్ అవుతుంది.

Tags:    

Similar News