సీనియర్లకు బిగ్ హ్యాండ్ ఇవ్వబోతున్న బాబు ?

ఎన్నో లెక్కలు వేసి మరీ చాలా మంది సీనియర్లను సార్వత్రిక ఎన్నికల ముందే పక్కన పెట్టేసింది.

Update: 2024-08-15 07:30 GMT

తెలుగుదేశం పార్టీకి సీనియర్లు ఒక నాడు పట్టుకొమ్మలు. వారే పార్టీని మోశారు. భారాలు భరించారు. దశాబ్దాలుగా ఒంటి చేత్తో నడిపించారు. కానీ ఇపుడు కూడా వారే హవా చలాయిస్తామంటే కుదరదు అని అధినాయకత్వం సంకేతాలు ఇస్తోంది. ఎన్నో లెక్కలు వేసి మరీ చాలా మంది సీనియర్లను సార్వత్రిక ఎన్నికల ముందే పక్కన పెట్టేసింది.

ఇక తప్పదు అనుకున్న వారిని తెచ్చి కొందరికి టికెట్లు ఇచ్చి గెలిపించుకున్నా మంత్రి పదవులకు దూరం పెట్టేసింది. సీనియర్ ఎమ్మెల్యేలుగా ఉండడమే చాలు అన్నట్లుగా చెప్పకనే చెప్పేసింది. ఇపుడు సీనియర్లలో త్యాగమూర్తులుగా ఉన్న వారు టికెట్లు రాని వారు నామినేటెడ్ పదవులు ఆశిస్తున్నారు.

అయితే అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించిన ఫార్ములానే టీడీపీ మళ్లీ అనుసరిస్తోంది అని అంటున్నారు. ఈసారి పదవులలో అత్యధిక శాతం జూనియర్లకు కొత్తవారికి యువతకు ఇవ్వాలని దాదాపుగా డిసైడ్ అయింది అని అంటున్నారు. యువతకు పెద్ద పీట వేయాలని కూడా సీరియస్ డెసిషన్ తీసుకుంది అని అంటున్నారు.

వీరంతా రానున్న అయిదేళ్లలో నామినేటెడ్ పదవులల్లో రాణిస్తే ఇందులో చాలా మందికి 2029 ఎన్నికల్లో పోటీ చేసే చాన్స్ ఇవ్వవచ్చు అని కూడా అంటున్నారు. అంటే 2029 నాటికి పూర్తిగా యూత్ పార్టీగా టీడీపీని మార్చాలి అన్న కసరత్తు చేస్తున్నారు. దాంతోనే ఎన్నడూ లేని విధంగా నిర్మొహమాటంగా సీనియర్లను పక్కన పెట్టేస్తున్నారు.

సీనియర్ నేతలకు పదవులు ఇస్తే పార్టీ ఓల్డేజ్ లుక్ తో ఉంటుందని అదే యంగర్ జనరేషన్ ని ముందుకు తెస్తే న్యూ లుక్ తో జనాలకు కనెక్ట్ అవుతుందని ఇది పార్టీకి ఎంతో ప్లస్ గా ఉంటుందని ఊహిస్తున్నారుట. దాంతోనే సీనియర్లకు చెక్ పెట్టక తప్పదని సంకేతాలు ఇచ్చారు.

అతి త్వరలో నామినేటెడ్ పదవుల పందేరం మొదలు కాబోతున్న వేళ ఈ రకమైన ప్రచారం సాగడంతో సీనియర్లు కలవరపడుతున్నారు. పోనీ తమకు కాకపోతే తమ వారసులకు అయినా పదవులు ఇప్పించుకుందామని కొంతమంది చూస్తున్నారు. వారు ఎటూ యూతే కదా అని కొత్త వాదన వినిపిస్తున్నారుట. అయితే టీడీపీ మాత్రం ఈ వాదనలను అసలు పట్టించుకోవడం లేదు ట. సీనియర్ల వారసులకు అవకాశం ఇచ్చినా అదే ఇల్లు అదే రాజకీయం అదే ముద్రతో పార్టీ ఎదగకుండా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉంటుందని భావిస్తున్నారుట.

గతంలోనే సీనియర్లను పక్కన పెట్టాలని పలు మార్లు ఆలోచించినా దానికి తగినంత వెసులుబాటు లభించలేదని ఈసారి ల్యాండ్ స్లైడ్ విక్టరీ దక్కడంతో ఏ మాత్రం సంకోచించకుండా అనుకున్నది అమలు చేయడమే తమ పని అన్నట్లుగా అధినాయకత్వం ఉందని అంటున్నారు. ఇపుడు కాకపోతే మరెపుడు అన్న తీరున టీడీపీ అధినాయకత్వం వ్యూహాలు ఉన్నాయట.

టీడీపీ మరో నలభై నుంచి యాభై ఏళ్ల పాటు ఇంత దూకుడుగానూ నడవాలీ అంటే కనుక కొత్త రక్తాన్ని ఎక్కించడం తప్ప మరో మార్గం లేదని అంటున్నారు. ఈ పరిణామాల నేపధ్యంలో నామినేటెడ్ పదవుల మీద ఆశలు పెట్టుకున్న సీనియర్లకు ఇక హుళక్కే అని అంటున్నారు.

Tags:    

Similar News