పాల్ పార్టీలో చేరిన ప్రముఖ నటుడు!
ప్రముఖ నటుడు, మాజీ మంత్రి బాబూమోహన్.. ప్రజాశాంతి పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. పార్టీ అధినేత కేఏ పాల్ ఆయనకు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
తెలంగాణలో పార్లమెంటు ఎన్నికల ముంగిట కేఎల్ పాల్ నేతృత్వంలోని ప్రజాశాంతి పార్టీలోనూ చేరికలు మొదలయ్యాయి. ప్రముఖ నటుడు, మాజీ మంత్రి బాబూమోహన్.. ప్రజాశాంతి పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. పార్టీ అధినేత కేఏ పాల్ ఆయనకు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఇటీవల ఆందోల్ నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన బాబూమోహన్ ఓటమి పాలైన సంగతి తెలిసిందే. ఆయనపై కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి దామోదర రాజనర్సింహ విజయం సాధించారు. ఈ నేపథ్యంలో బీజేపీ తరఫున లోక్ సభ కు పోటీ చేయాలని బాబూమోహన్ ఆశించారు. ఈ క్రమంలో వరంగల్ టికెట్ ను ఆశించారు. అయితే వరంగల్ టికెట్ ను బాబూమోహన్ కు ఇవ్వడానికి బీజేపీ అధిష్టానం నిరాకరించింది. దీంతో బాబూమోహన్ ప్రజాశాంతి పార్టీలో చేరారు. ఆ పార్టీ తరఫున వరంగల్ ఎంపీగా బరిలోకి దిగుతారని సమాచారం.
కాగా బాబూమోహన్ తొలిసారి 1999 ఎన్నికల్లో టీడీపీ తరఫున బరిలోకి దిగి ఆందోల్ నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. నాటి చంద్రబాబు ప్రభుత్వంలో కార్మిక శాఖ మంత్రిగా పనిచేశారు. ఈ క్రమంలో 2004, 2009 ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. 2014లో టీఆర్‌ఎస్ తరఫున బరిలోకి దిగి విజయం సాధించారు. 2018లో ఆయనకు కేసీఆర్ సీటు ఇవ్వలేదు. దీంతో బీజేపీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. 2023 ఎన్నికల్లోనూ బీజేపీ తరఫున బరిలోకి దిగి పరాజయం పాలయ్యారు.
వాస్తవానికి ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోల ఆందోల్ టికెట్‌ను బాబుమోహన్ కుమారుడు ఉదయ్ మోహన్ కు ఇవ్వాలని బీజేపీ భావించింది. అయితే తమ కుటుంబంలో బీజేపీ చిచ్చు పెడుతోందని బాబూమోహన్ విమర్శలు చేశారు. దీంతో బీజేపీ చివరి నిమిషంలో ఆందోల్ టికెట్ ను బాబూమోహన్ కే కేటాయించింది. అయితే ఆ ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు.
ఈ నేపథ్యంలో కొద్ది రోజుల క్రితం బీజేపీకి బాబూమోహన్ రాజీనామా చేశారు. ఈ సందర్భంగా తాను ప్రజాశాంతి పార్టీ తరపున వరంగల్ నుంచి ఎంపీగా పోటీ చేస్తున్నట్టు ఆయన ప్రకటించారు. త్వరలోనే ప్రచారం ప్రారంభిస్తానన్నారు. కచ్చితంగా విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు.