నా వైపు జనం... నీ వైపు ఎవరున్నారు జగన్...?
అనంతపురం జిల్లా గుత్తిలో ఆయన ఇచ్చిన స్పీచ్ కొంత వెరైటీగా ఉంది. అందులో ఆయన జనం బలం తనకే అని చాలా ధీమాగా చెప్పుకున్నారు.
టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నికలు దగ్గరపడుతూంటే మాటల తూటాలను పేల్చుతున్నారు. తన వేడి వాడి ప్రసంగాలతో జనాలను తిప్పుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఈసారి చాన్స్ తానే తీసుకోవాలని చూస్తున్నారు. ఎక్కడా తగ్గకూడదు అని కూడా భావిస్తున్నారు.
ఈ నేపధ్యంలో చంద్రబాబు జిల్లా టూర్లు వరసబెట్టి చేస్తున్నారు. గతంలో ఏ ప్రతిపక్ష నేత తిరగన్ని సార్లు చంద్రబాబు తిరుగుతున్నారు. వెళ్ళిన చోటనే మళ్లీ వెళ్తున్నారు చెప్పిన మాటనే చెబుతున్నారు. ఒకసారి కాకపోతే మరోసారి అయినా వారి చెవికి ఎక్కుతుందని ఆయన కంఠశోష పెడుతున్నారు.
ప్రజలు ఆలోచించాలని కోరుతున్నారు. మీలో ఐక్యత రావాలని కూడా పిలుపు ఇస్తున్నారు. ఈ జగన్ మీకు ఏమి చేశారో ఒక్క మాట చెప్పండి నేను నా ప్రసంగం ఆపేస్తాను మౌనం వహిస్తాను అని జనాలనే నేరుగా ప్రశ్నిస్తున్నారు.
ఏపీని కాపాడుకోవడానికి తానొక్కడినే కాదు అంతా కలిసి రావాలని ఆయన కోరుతున్నారు. మొత్తానికి ఎమోషనల్ స్పీచ్ ఇస్తున్నారు. అంతలోనే సింపతీ కార్డు తీస్తున్నారు. అదే టైం లో ఫైర్ బ్రాండ్ అవుతున్నారు. మొత్తానికి చంద్రబాబు జనాలను అట్రాక్ట్ చేయడానికి తన మాట వినేలా చేసుకోవడానికి చాలానే చేస్తున్నారు.
చేయాల్సింది అంతా చేస్తున్నారు. అనంతపురం జిల్లా గుత్తిలో ఆయన ఇచ్చిన స్పీచ్ కొంత వెరైటీగా ఉంది. అందులో ఆయన జనం బలం తనకే అని చాలా ధీమాగా చెప్పుకున్నారు. ఏపీలో ప్రజలు అందరూ తనకే మద్దతుగా నిలుస్తారు అని నిబ్బరం ప్రదర్శించారు.
వైసీపీ ప్రభుత్వం ఏమి చేసిందో చూసిన మీదటనే ప్రజలు తన వైపు వచ్చారని కూడా సమర్ధించుకున్నారు. జగన్ నీకు ఉన్న బలం ఏంటి అని నిగ్గదీశారు. జగన్‌కు పోలీసు బలగాలు, ఆర్థిక వనరులు ఉండవచ్చని, అయితే తనకు మాత్రం ప్రజల నుంచి అపారమైన మద్దతు ఉందని అదే తన బలమని బిగ్ సౌండ్ చేశారు బాబు.
వైఎస్ జగన్ వెనక ఎవరున్నారని కూడా ప్రశ్నించారు. ఈసారి ప్రజలు సరైన తీర్పు ఇస్తారని అన్నారు. అంతా కలసి వైసీపీ ప్రభుత్వాన్ని ఓడించి తీరుతారు అన్నారు. ప్రజలు వైసీపీ పాలనలో నరకం చూసారని బాబు ఆరోపించడం విశేషం.
నాలుగున్నరేళ్లుగా అధికారంలో ఉన్న జగన్ నేతృత్వంలోని ప్రభుత్వం ప్రజలకు ఒక్క మంచి పని అయినా చేసిందా అంటూ బాబు తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రాన్ని, పౌరులను కాపాడడమే తన ముందున్న లక్ష్యమని చంద్రబాబు పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు ప్రజల్లో ఐక్యత అవసరమని బాబు అంటున్నారు.
రాష్ట్ర ప్రజలే తనకు బలం, మద్దతు అని పేర్కొన్నారు. ఏపీ ప్రజలు ఎదుర్కొంటున్న విపత్కర పరిస్థితులను చూసి తాను బాదుడే బాదుడు అన్న ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టానని బాబు చెప్పుకున్నారు. ఇక ఇదే సభలో జగన్ని పట్టుకుని సైకో అంటూ బాబు మాట్లాడడం విశేషం. మొత్తానికి జనం మద్దతు తనకే అంటున్న బాబుకు పొత్తులతో పనేంటి అన్న వైసీపీ ప్రశ్నలకు జవాబు ఇస్తారా అన్నదే చూడాల్సి ఉంది మరి.