బాబు రాముడు.. మీరు సీత..లక్ష్మణుడు లాంటి పవన్.. భువనేశ్వరి జవాబు ఇదే
దీన్ని మీరెలా తట్టుకున్నారు’ అని ఎమ్మెల్సీ అనురాధ ప్రశ్నించగా.. భువనేశ్వరి సమాధానమిస్తూ.. ‘‘వారి ఆలోచనలు అంత హీనంగా ఉంటాయి.
‘నిజం గెలవాలి’ పేరుతో నారా భువనేశ్వరి నిర్వహిస్తున్న యాత్ర ఉమ్మడి చిత్తూరు జిల్లాలో సాగుతున్న సంగతి తెలిసిందే. ఈ యాత్రలో భాగంగా తెలుగుదేశం.. జనసేన పార్టీలతో కలిసి ఆమె ఒక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇరుపార్టీల నేతలు.. కార్యకర్తలతో కలిపి ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఓపెన్ క్వశ్చన్ అవర్ వేళ.. ఎవరికి వారు వారు తోచిన ప్రశ్నలు వేయగా.. వాటికి నారా భువనేశ్వరి ఇచ్చిన సమాధానాలు ఆసక్తికకరంగా మారాయి.
ఒకే సందర్భంలో పలువురు వేసిన ప్రశ్నలకు ఏ మాత్రం త్రోటుపాటుకు గురి కాకుండా సమాధానాలు ఇవ్వటంఒక ఎత్తు అయితే.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ గురించి ఆమె వ్యాఖ్యలు అందరి చూపు పడేలా మారాయి. జనసేనకు చెందిన పసుపులేని హరిప్రసాద్ వేసిన ఒక ప్రశ్నకు భువనేశ్వరి ఇచ్చిన సమాధానం రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. ఆయన వేసిన ప్రశ్నను చూస్తే.. ‘‘చంద్రబాబు రాముడైతే.. మీరు సీత. లక్ష్మణుడు లాంటి పవన్ కల్యాణ్ వస్తుంటే దుర్మార్గులు మధ్యలో ఆపేశారు. మిమ్మల్ని.. లోకేశ్ ను పవన్ కలవటం మీకు ఎలా అనిపించింది’’ అని ప్రశ్నను సంధించారు.
దీనికి సమాధానమిచ్చిన భువనేశ్వరి.. ‘‘పవన్ కల్యాణ్ నా గురించి అడుగుతూనే ఉన్నారు. ఆయన కూడా మాలాగే ఆలోచిస్తున్నారు. రాష్ట్రంలోని గంజాయి సరఫరా.. పెరిగిన అత్యాచారాల గురించి చాలా బాధపడ్డారు. ఆయన మాటలు నాకు స్పూర్తిని ఇచ్చాయి. ఆయన మాలానే ఆలోచిస్తుననారు. రెండుపార్టీలు కలిసి ముందుకు వెళ్లాలని కోరుకుంటున్నారు’’ అని వ్యాఖ్యానించారు. మరికొన్ని ఆసక్తికర ప్రశ్నలు.. సమాధానాల్ని చూస్తే.. ‘చంద్రబాబు 45 ఏళ్లుగా ప్రజలతో ఉన్నారు. అలాంటి వ్యక్తిని 48రోజులుగా జైల్లో ఉంచారు. ఆయన ఆరోగ్యం ఎలా ఉంది?’ అని ప్రశ్నించగా.. ‘‘ములాఖత్ అరగంటలో 25 నిమిషాలు పార్టీ.. ప్రజలు.. టీడీపీ బిడ్డల గురించి అడుగుతున్నారు. ఐదు నిమిషాలు నా వంక చూస్తారు. ఆ సమయంలో ఆయన బాధలో ఉంటారని నేనేమీ అడగను. ఏం చెప్పను’’ అని సమాధానం ఇచ్చారు.
‘చంద్రబాబుకు ఇంటి నుంచి పంపించే భోజనం విషయంలోనూ ఎవరూ వినలేని ఆరోపణలు చేశారు. దీన్ని మీరెలా తట్టుకున్నారు’ అని ఎమ్మెల్సీ అనురాధ ప్రశ్నించగా.. భువనేశ్వరి సమాధానమిస్తూ.. ‘‘వారి ఆలోచనలు అంత హీనంగా ఉంటాయి. అందరికీ బిడ్డలు ఉన్నారు కదా? మీ బిడ్డలు మీకు విషం కలిపి ఆహారం పంపిస్తారా?’ అని వ్యాఖ్యానించారు. మరో టీడీపీ కార్యకర్త భువన ప్రశ్నిస్తూ.. ‘ఒక ఎంపీ హత్య చేసినట్లు రుజువులు ఉన్నా అరెస్టు చేయలేదు. చంద్రబాబుపై ఎలాంటి సాక్ష్యాలు లేకున్నా అరెస్టు చేశారు. దీనిపై మీరేమనుకుంటున్నారు?’ అని ప్రశ్నించారు. ‘న్యాయం.. నిజం తప్పకుండా గెలుస్తాయన్న నమ్మకం నాకుంది. అయితే.. అందుకు కొంత సమయం పడుతుంది’ అని పేర్కొన్నారు.