జగన్ సొంత గడ్డ మీద రీసౌండ్ చేసిన బాబు !
ఈ సందర్భంగా ఆయన అయిదేళ్ల క్రితం నాటి వివేకా హత్య కేసుని తెర మీదకు తెచ్చారు.
ముఖ్యమంత్రి జగన్ సొంత జిల్లా కడప గడ్డ మీద టీడీపీ అధినేత చంద్రబాబు రీసౌండ్ చేశారు. హూ కిల్డ్ బాబాయ్ అంటూ ఆయన ప్రశ్నించారు. దీనికి ముఖ్యమంత్రి జగన్ జవాబు చెప్పాలని డిమాండ్ చేశారు. రా కదలిరా పేరిట జిల్లాల వారీగా వరసగా నిర్వహిస్తున్న బహిరంగ సభలలో భాగంగా కడపకు చేరుకున్న చంద్రబాబు శుక్రవారం సాయంత్రం అక్కడ భారీ మీటింగ్ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన అయిదేళ్ల క్రితం నాటి వివేకా హత్య కేసుని తెర మీదకు తెచ్చారు. వివేకాను 2019 మార్చి 15న దారుణంగా హత్య చేశారని ఆయన గుర్తు చేశారు. మొదట దాన్ని వైసీపీ సొంత మీడియాలో గుండెపోటుగా ప్రకటించారని ఆ తరువాత రక్తపు పోటుగా మార్చారని చంద్రబాబు ఆరోపించారు.
పోస్ట్ మార్టం కూడా జరగకుండా అడ్డుకునే ప్రయత్నం జరిగిందని, వివేక కుమార్తె వత్తిడితో దాన్ని జరిపిస్తే హత్య అని తేలిందని అన్నారు. అపుడు సొంత మీడియాలో వైసీపీ హై కమాండ్ రాయించింది ఏంటి తమ్ముళ్ళూ అని ప్రశ్నించారు. నారాసుర చరిత్ర అని రాయించి ఆ హత్య కేసుని తన మీదకు రుద్దాలని చూసారని బాబు అన్నారు.
తనకు తండ్రి లేరు, చిన్నాన్నను కూడా హత్య చేశారు అని నాడు జగన్ జనాల వద్దకు వచ్చారని ఆయన మండిపడ్డారు. వివేకా హత్య కేసు హాలీవుడ్ సినిమా మాదిరిగా ఆనేక మలుపులు తిరిగిందని చివరికి అది ఎవరు చేశారో కూడా కడప జనాలకు తెలుసు అని బాబు చెప్పుకొచ్చారు.
తాను కడప గడ్డ మీద నుంచి అడుగుతున్నానని, ఎవరు హత్య చేశారో జగన్ ఇప్పటికైనా చెప్పాలని డిమాండ్ చేశారు. రక్త చరిత్ర చేసిన వారు తన మీద విమర్శలు చేస్తున్నారు అని ఆయన మండిపడ్డారు. ఈ రోజున దానికి వారు జవాబు చెప్పి తీరాల్సిందే అని బాబు స్పష్టం చేశారు.
మొత్తానికి చూస్తే సరైన సమయంలో బాబు వివేకా హత్య కేసును సరైన ప్లేస్ లోనే తెర మీదకు తెచ్చారని అంటున్నారు. ఆయన గతంలో ఈ హత్య గురించి ప్రశ్నిచినా ఇంత ధాటీగా సూటిగా బాబు అడిగిన దాఖలాలు లేవు అని అంటున్నారు ఇపుడు మాత్రం బాబు జగన్ సొంత ఇలాకాలోనే రీ సౌండ్ చేశారు అని అంటున్నారు.
ఇదంతా వ్యూహాత్మకంగానే చేశారు అని అంటున్నారు. ఇక రానున్న రోజులలో కడప నుంచి కాంగ్రెస్ తరఫున వైఎస్ వివేకా కుటుంబ సభ్యులు పోటీకి దిగుతారు అని వార్తలు వస్తున్న నేపధ్యంలో బాబు చేసిన ఈ హాట్ కామెంట్స్ జనంలో చర్చకు తావిచ్చాయి. నా పైన హత్యా నేరం మోపారు, మీకు బాధ అనిపిస్తే గట్టిగా నిరసన తెలియజేయాలని సభికులను బాబు కోరడం విశేషం.