నందమూరి బాలకృష్ణ ఆస్తులు, అప్పుల వివరాలు నెట్టింట వైరల్!

ఇదే సమయంలో తన భార్య వసుంధర కలిగి ఉన్న ఆస్తుల విలువ రూ.140.38 కోట్లు కాగా.. తన కుమారుడు మోక్షజ్ఞ పేరిట రూ.58.63 కోట్ల ఆస్తులు ఉన్నట్లు వెల్లడించారు.

Update: 2024-04-19 13:24 GMT

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల సందడి మొదలైపోయింది. నామినేషన్ల పర్వం మొదలవ్వగానే అసలు సిసలు ఎన్నికల సీజన్ వచ్చేసిందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో గురువారం నుంచి నేతలు ఒక్కొక్కరుగా నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. ఈ క్రమంలో గురువారం లోకేష్ నామినేషన్ వేయగా.. ఈరోజు చంద్రబాబు తరుపున భువనేశ్వరి నామినేషన్ వేశారు. ఇదే సమయంలో హిందూపురంలో బాలయ్య నామినేషన్ దాఖలు చేశారు.

అవును... ఏపీలో నామినేషన్ల సందడి మొదలైంది. తమ కార్యకర్తలు, అనుచరులు, అభిమానులు వేలాదిగా తరలిరాగా.. పలువురు నేతలు రెండో రోజు నామినేషన్లు దాఖలు చేశారు. ఈ సందర్భంగా హిందూపురం నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే, టీడీపీ అభ్యర్థి నందమూరి బాలకృష్ణ నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆయన ఆస్తులు, కుటుంబ ఆస్తులు, అప్పుల వివరాలు వెల్లడించారు.

తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నందమూరి బాలకృష్ణ హిందూపురం నియోజకవర్గం నుంచి మూడోసారి నామినేషన్‌ వేశారు. తన సతీమణి వసుంధరతో కలిసి హిందూపురం ఆర్వో కార్యాలయంలో రిటర్నింగ్‌ అధికారికి నామినేషన్‌ పత్రాలు అందజేశారు. హిందూపురంలో ఇప్పటికే వరుసగా రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన బాలయ్య.. రానున్న ఎన్నికల్లోనూ గెలిచి హ్యాట్రిక్‌ కొట్టాలని భావిస్తున్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, బీజేపీ, జనసేన శ్రేణులు తరలివచ్చారు.

ఈ సందర్భంగా... తన పేరిట రూ.81.63 కోట్ల ఆస్తులు ఉన్నాయని బాలయ్య తన అఫిడవిట్‌ లో పేర్కొన్నారు. ఇదే సమయంలో తన భార్య వసుంధర కలిగి ఉన్న ఆస్తుల విలువ రూ.140.38 కోట్లు కాగా.. తన కుమారుడు మోక్షజ్ఞ పేరిట రూ.58.63 కోట్ల ఆస్తులు ఉన్నట్లు వెల్లడించారు. ఇదే క్రమంలో తనకు అప్పులు కూడా ఉన్నాయని తెలిపిన బాలయ్య... తనకు రూ.9.9 కోట్లు, తన భార్యకు రూ.3.83 కోట్ల అప్పులు ఉన్నాయని పేర్కొన్నారు.

ఇలా నామినేషన్ వేసిన అనంతరం మాట్లాడిన బాలయ్య... ఎన్టీఆర్‌ ను ఆదర్శంగా తీసుకుని ముందుకెళ్తున్నామని చెప్పడం గమనార్హం. ఇదే క్రమంలో... హిందూపురం ప్రజలు తనను రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిపించారని.. తమ కుటుంబమంటే ఇక్కడి ప్రజలకు ఎంతో అభిమానమని తెలిపారు. ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ పట్టణంలో తాగునీటి సమస్యను పరిష్కరించినట్లు చెప్పుకొచ్చారు.

కాగా, నందమూరి తారక రామారావు కుమారుడిగా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన బాలయ్య 2014లో తొలిసారి హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత 2019లోనూ రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచారు బాలయ్య. ఈ క్రమంలో మూడోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు!

Tags:    

Similar News