బయట వరదలు.. ఇంట్లోనేమో ‘సరిపోదా శనివారం’.. బీఆర్ఎస్ నేత వ్యాఖ్యలు వైరల్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలను భారీ స్థాయిలో వరదలు ముంచెత్తాయి.

Update: 2024-09-04 06:34 GMT

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలను భారీ స్థాయిలో వరదలు ముంచెత్తాయి. నగరాలు, పట్టణాలు, గ్రామాలు వరదల్లో చిక్కుకున్నాయి. ముఖ్యంగా తెలంగాణలో మేజర్ సిటీలైన ఖమ్మం, వరంగల్, సూర్యపేట తదితర నగరాలు వరద బారిన పడ్డాయి. మునుపెన్నడూ లేని విధంగా జలప్రళయం సృష్టించడంతో ప్రజలంతా బిక్కుబిక్కుమంటూ గడిపారు. మరోవైపు.. వరదలు తీవ్ర నష్టాన్ని తెచ్చిపెట్టాయి. ప్రజలు సైతం నిరాశ్రయులుగా మారారు. పదుల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. అటు ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు నష్టం నుంచి ప్రజలను బయటపడేసేందుకు అన్నివిధాలా ప్రయత్నాలు చేస్తున్నారు.

తెలంగాణలో వరద తెచ్చిన నష్టాన్ని స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెళ్లి పరిశీలించారు. ప్రభుత్వంలోని మంత్రులు, ఇతర పెద్దలు వరద సహాయక చర్యలకు దిగారు. ప్రజలతోపాటు వివిధ శాఖలకు జరిగిన నష్టం నుంచి బయటపడే మార్గాలను అన్వేషిస్తున్నారు. ఇప్పటికే కేంద్ర సహాయాన్ని సైతం కోరారు. తెలంగాణలో వచ్చిన వరదలను జాతీయ విపత్తుగా ప్రకటించాలని ముఖ్యమంత్రి స్వయంగా కోరారు. సుమారు పది వేల కోట్లకు పైగా నష్టం వాటిల్లినట్లు వెల్లడించారు.

ఇంతవరకు బాగానే ఉన్నా.. వరదలు కాస్త తెలంగాణలో రాజకీయ దుమారం రేపాయి. ఇంత పెద్ద ఎత్తున వరదలు వచ్చి ప్రజలు ఇబ్బందులు పడుతుంటే ప్రతిపక్ష నేత ఎక్కడ అని ప్రభుత్వ పెద్దలు ప్రశ్నిస్తున్నారు. వరద సాయంలో బీఆర్ఎస్ నేతలు కనిపించకుండా పోయారని రేవంత్, మంత్రులు, ఇతర నేతలు నిలదీస్తున్నారు. అటు బీఆర్ఎస్ నేతలు కూడా కౌంటర్ అటాక్ చేస్తూ ప్రకటనలు ఇస్తున్నారు. ప్రజలను ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని దుమ్మెత్తిపోస్తున్నారు. అయితే.. వీరి వార్‌లో కొత్తగా ‘సరిపోదా శనివారం’ సినిమా ఇప్పుడు హాట్ టాపిక్ అయింది.

అదేంటి వరదలు వచ్చి ప్రజలు ఇబ్బందులు పడుతుంటే.. ఈ సినిమా ప్రస్తావన ఎందుకు వచ్చిందని అనుకుంటున్నారా..!! కేసీఆర్, కేటీఆర్‌లకు ఎంతో నమ్మకస్తుడైన, చెన్నూర్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఈ సినిమా ప్రస్తావన తీసుకొస్తూ విమర్శలు చేశారు. ‘శనివారం, ఆదివారాల్లో తెలంగాణను వరదలు ముంచెత్తాయి. వరదతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. ఆ సమయంలో సీఎం ఎక్కడ ఉన్నారు..? మా అంచనా ప్రకారం అయితే ఆయన తన కుటుంబ సభ్యులతో ఇంట్లో సరిపోదా శనివారం సినిమా చూస్తున్నాడు. ప్రజల కష్టాలను పట్టించుకోకుండా ఇంట్లో నింపాదిగా సినిమా చూసే పనిలో నిమగ్నం అయ్యారు’ అంటూ వ్యాఖ్యలు చేశారు.

అయితే.. వరదలు వచ్చిన వారంలోనే సరిపోదా శనివారం సినిమా రిలీజ్ అయింది. ఇంకా అది ఓటీటీ ప్లాట్ ఫాంలోకి రానూ లేదు. కానీ.. రేవంత్ రెడ్డి మాత్రం తన ఇంట్లో సినిమా చూస్తూ ఉండిపోయారని బాల్క సుమన్ ఆరోపించడంపై నెటిజన్లు పలు కామెంట్స్ చేస్తున్నారు. కొత్తగా రిలీజ్ అయిన సినిమాను అప్పుడే ఇంట్లో కూర్చుండి ఎలా చూస్తారని ప్రశ్నిస్తున్నారు. చివరగా ఈ మాజీ ఎమ్మెల్యే కేవలం నాని చిత్రాన్ని ఉపయోగించి బ్లఫ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారని కామెంట్స్ వచ్చిపడుతున్నాయి. రాజకీయ లబ్ధికోసమే ఇలాంటి చౌకబారు ఆరోపణలు చేస్తున్నారని రేవంత్ రెడ్డి, ఆయన టీమ్ ఫైర్ అవుతున్నారు.

Tags:    

Similar News