ఆ నియోజకవర్గంపై టికెట్‌ పై గవర్నర్‌ కుమార్తె సంచలన వ్యాఖ్యలు!

తాను ఏదీ కోరుకోవడం లేదని విజయలక్ష్మి తేల్చిచెప్పారు. బీజేపీ అధిష్టానం పోటీ చేయాలని ఆదేశిస్తే పోటీ చేస్తానన్నారు

Update: 2023-09-04 11:23 GMT

హరియాణా గవర్నర్‌ బండారు దత్తాత్రేయ కుమార్తె బండారు విజయలక్ష్మి సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో ఆమె హైదరాబాద్‌ నగర పరిధిలోని ముషీరాబాద్‌ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. బీజేపీ నుంచి ఈ సీటు కోసం ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు కె.లక్ష్మణ్, దత్తాత్రేయ కుమార్తె విజయలక్ష్మి పోటీ పడుతున్నారు. ఈ నేపథ్యంలో మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చిన ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు.

తాను ఏదీ కోరుకోవడం లేదని విజయలక్ష్మి తేల్చిచెప్పారు. బీజేపీ అధిష్టానం పోటీ చేయాలని ఆదేశిస్తే పోటీ చేస్తానన్నారు. బీజేపీలో పనిచేసుకుంటూ పోవాలని.. అప్పుడు పార్టీ ఆటోమేటిగ్గా గుర్తిస్తుందని వెల్లడించారు. అంతేకానీ ముందుగానే పదవుల కోసం ఆశించడం బీజేపీలో ఉండదన్నారు. సామాజిక సేవ కార్యక్రమాలతో పాటు బీజేపీ సిద్ధాంతాలు అంటే ఇష్టమని.. అందుకే ఆ పార్టీలో ఎన్నో ఏళ్ల నుంచి కార్యక్రమాలు నిర్వహిస్తున్నానని తెలిపారు.

2014, 2019, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో, బీజేపీ కార్యక్రమాల్లో చురుకుగానే పాల్గొంటున్నానని విజయలక్ష్మి గుర్తు చేశారు. తన తండ్రి బండారు దత్తాత్రేయ సికింద్రాబాద్‌ పార్లమెంట్‌ పరిధిలో గత 35-40 ఏళ్లుగా రాజకీయాలు చేస్తున్నారని తెలిపారు. ఆయనకు నియోజకవర్గం పరిధిలో ప్రతి కార్యకర్త, నేతలతో పరిచయాలు ఉన్నాయన్నారు. వారి ఇళ్లు, తమ ఇళ్లు వేర్వేరు కాదని తాము అనుకుంటున్నామన్నారు.

కేవలం తమ కుటుంబమే కాకుండా అత్తగారి కుటుంబం కూడా రాజకీయాలతో ముడిపడిన కుటుంబమేనని గుర్తు చేశారు. తన మామయ్య చేవెళ్ల పార్లమెంట్‌ నుంచి బీజేపీ అభ్యర్థిగా కూడా పోటీ చేశారని విజయలక్ష్మి ఈ సందర్భంగా గుర్తు చేశారు.

తాను ఎక్కడైనా సరిపోతానని పార్టీ అనుకుంటే అక్కడ నిలబెడుతుందని విజయలక్ష్మి అభిప్రాయపడ్డారు. తన వరకు తాను ఇప్పటి వరకు ప్రత్యక్షంగా టికెట్‌ కావాలని అడగలేదని తేల్చిచెప్పారు. ఫలానా చోట తాను పోటీ చేస్తానని చెప్పడం తాము నేర్చుకున్న సిద్ధాంతానికి వ్యతిరేకమని చెప్పారు. అలా అడగడం తమ పార్టీ లైన్‌ కాదన్నారు.

ప్రజలు ఖచ్ఛితంగా బీఆర్‌ఎస్‌ నుంచి వేరే ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారని విజయలక్ష్మి తెలిపారు. తనను కోరుకుంటున్నారని తాను అనుకోవడం లేదన్నారు. బీజేపీ అభ్యర్థిగా విజయలక్ష్మి సరిపోతుందని పార్టీ అనుకుంటే అప్పుడు ఆలోచిస్తానని స్పష్టం చేశారు.

Tags:    

Similar News