మళ్లీ బండి చేతికి బీజేపీ పగ్గాలు.. ఈ ఇండికేషన్ల అర్థం అదేనా!!

బండి సంజయ్ కుమార్ తెలంగాణ రాష్ట్రంలో ఆయన యూత్ ఐకాన్.

Update: 2024-09-06 15:30 GMT

బండి సంజయ్ కుమార్ తెలంగాణ రాష్ట్రంలో ఆయన యూత్ ఐకాన్. యూత్‌లో ఆయన అంటే అంత క్రేజ్ మరి. ఒకప్పుడు కరీంనగర్ జిల్లా వరకే తెలిసిన నేత ఇప్పుడు ఆయనకు రాష్ట్రవ్యాప్తంగా అభిమానులు తయారయ్యారు. ఎన్నిక ఏదైనా ఆయన వచ్చి ప్రచారం చేయాలని పార్టీలోని నేతలు, అభిమానులు కోరుతున్నారంటే ఆయన స్టామినా అర్థం చేసుకోవచ్చు. బీజేపీకి ఆయనో టానిక్‌లాంటోడు.

2020 మార్చిలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా సంజయ్ బాధ్యతలు తీసుకున్నారు. అధ్యక్షుడిగా కొనసాగినన్ని రోజులు రాష్ట్రంలో పార్టీకి వచ్చిన, తెచ్చిన ఊపు అంతాఇంతా కాదు. ఒకవిధంగా చెప్పాలంటే.. రాష్ట్రంలో బీజేపీ పరిస్థితి సంజయ్ అధ్యక్షుడికి ముందు.. ఆ తరువాత అన్నట్లుగా ఎవరైనా అంటుంటారు. అందుకే.. బీజేపీ అభిమానులు ఇప్పుడు మళ్లీ సంజయ్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారు. పార్టీకి ఆయన అయితేనే వంద శాతం న్యాయం చేస్తారని అంటున్నారు. బీజేపీ ఇప్పుడు క్షేత్రస్థాయి వరకూ వెళ్లిందంటే అది ఆయన చలువేనని.. ప్రతి గడపకు కమలం పువ్వు పరిచయం అయిందంటే ఆయనే కారణమని చెప్తున్నారు. ఒకప్పుడు బీజేపీని కేవలం జాతీయ పార్టీగానే పరిగణించిన రాష్ట్రంలో.. ఆయన రాష్ట్ర అధ్యక్షుడు అయ్యాక మహాశక్తిలా మార్చాడని పలువురు సీనియర్లు సైతం పలు సందర్భాల్లో కొనియాడిన దాఖలాలు ఉన్నాయి.

బీఆర్ఎస్ అధికారంలో ఉండగా.. సంజయ్ అధ్యక్షుడిగా కొనసాగినన్ని రోజులు.. కేసీఆర్‌కు, ఆ పార్టీకి చుక్కలు చూపించారు. తెలంగాణ భవిష్యత్ ఇక బీజేపీనే అనే అనేంతగా టాక్ తెచ్చారు. ఈసారి టర్మ్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీజేపీదే అధికారం అన్నట్లుగా మూమెంట్ తీసుకొచ్చారు. ప్రజలు సైతం ఆ పార్టీని ప్రత్యామ్నాయంగా ఎంచుకున్నారని రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరిగింది. కానీ.. అనూహ్యంగా గత ఎన్నికలకు కొన్ని నెలల ముందు అధిష్టానం ఆయనను పార్టీ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పించింది. 2023 జూలైలో ఆయనను తప్పించి మరోసారి కిషన్ రెడ్డికి పార్టీ బాధ్యతలు అప్పగించారు. ఆ సమయంలో పార్టీ అధిష్టానంపై పెద్ద ఎత్తున విమర్శలు సైతం వచ్చాయి. కేవలం బీఆర్ఎస్‌ను మరోసారి అధికారంలోకి తీసుకురావడానికి బీజేపీ అధిష్టానం ఈ నిర్ణయం తీసుకుందని కార్యకర్తలు సైతం భగ్గుమన్నారు.

అయినప్పటికీ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ తరఫున రాష్ట్రం మొత్తం తిరుగుతూ ప్రచారం నిర్వహించారు. పార్టీ ఉనికిని ఎక్కడా కోల్పోకుండా తన వంతు కృషి చేశారు. ఇక ఇప్పుడు పార్టీ పరిస్థితి ఏ మాత్రం బాగోలేదని, అప్పటి ఊపు లేదని కార్యకర్తలు బాహాటంగానే వాపోతున్నారు.

ఇక ఎంపీ ఎన్నికల్లో మరోసారి గెలిచిన ఆయనను.. మోడీ ప్రభుత్వం కేబినెట్‌లోకి తీసుకుంది. కేంద్ర సహాయ మంత్రిని చేసింది. మళ్లీ పార్టీ పగ్గాలు అప్పగించాలనే డిమాండ్ ప్రధానంగా వినిపిస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగుతోంది. దశాబ్దకాలం తరువాత కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టడంతో మంచి దూకుడు మీద ఉంది. అయితే.. ఆ దూకుడుకు అడ్డుకట్ట పడాలంటే.. ప్రభుత్వంపై ఫైటింగ్ చేయాలంటే మళ్లీ సంజయ్ అధ్యక్షుడు అయితేనే కరెక్ట్ అనే అభిప్రాయాలు పార్టీ కార్యకర్తల నుంచి వినిపిస్తున్నాయి.

అయితే.. పార్టీ కార్యకర్తల నుంచి వస్తున్న డిమాండ్ మేరకు అధిష్టానం సైతం ఆలోచనలో పడినట్లుగా తెలుస్తోంది. ఆయన అధ్యక్షుడిగా ఉన్నప్పుడు పార్టీ గ్రాఫ్‌ను, ప్రస్తుత పరిస్థితిని సమీక్షించినట్లు సమాచారం. అందుకే.. తన నిర్ణయాన్ని మార్చుకున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. మరోసారి బండి సంజయ్‌కే పార్టీ పగ్గాలు అప్పగిస్తే భవిష్యత్తులో జరగబోయే ఎన్నికల్లో కమలానికి ఛాన్స్ ఉంటుందని అనుకుంటున్నారట. అందుకే త్వరలోనే సంజయ్‌ని అధ్యక్షుడిగా ప్రకటిస్తారని టాక్ నడుస్తోంది.

మరోవైపు హైకమాండ్ నిర్ణయానికి బలం చేకూర్చేలా.. ఈ రోజు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఖమ్మం జిల్లా పర్యటనకు వచ్చారు. వరద నష్టం అంచనా వేసేందుకు ఏరియల్ సర్వే నిర్వహించారు. అయితే.. ఆయనతో పాటు బండి సంజయ్‌కి ఆ బాధ్యతలను అప్పగించారు. చౌహాన్‌తో కలిసి సంజయ్ ఏరియల్ సర్వేలో పాల్గొనడం విశేషం. వీటన్నింటినీ చూస్తూ మళ్లీ కమలం సారథిగా సంజయ్ కాబోతున్నాడని ఆయన అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Tags:    

Similar News