బండి నోట షాకింగ్ మాట.. కేటీఆర్ ను రేవంత్ జైల్లో వేస్తాడట
ఈ సందర్భంగా ఆయన నోట సంచలన వ్యాఖ్యలు వచ్చాయి. మాజీ మంత్రి కేటీఆర్ ను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జైల్లో వేస్తారని చెప్పటం
సంచలన వ్యాఖ్యలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తూ.. అందరినోట నానే బండి సంజయ్ ఈ మధ్యన తన తీరుకు కాస్తంత గ్యాప్ ఇచ్చినట్లుగా చెప్పాలి. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా వ్యవహరిస్తున్న ఆయన..తాజాగా మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన నోట సంచలన వ్యాఖ్యలు వచ్చాయి. మాజీ మంత్రి కేటీఆర్ ను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జైల్లో వేస్తారని చెప్పటం.. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రిగా ఉన్న బండి నోటి నుంచి వచ్చిన ఈ మాట ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
బీఆర్ఎస్ కాలం చెల్లిన పార్టీ అని.. ఆ పార్టీ నాయకులతో చర్చలు జరపాల్సిన అవసరం తమకు లేదన్న బండి.. ‘‘తమ ఎమ్మెల్యేల్ని కాపాడుకోవటానికే ఇలాంటి విలీన ప్రచారం చేసుకుంటోంది. ఇతర పార్టీలను చీల్చి లాభం పొందాలన్న ఆలోచన బీజేపీకి లేదు. కేటీఆర్ ను ముఖ్యమంత్రి రేవంత్ జైల్లో వేస్తారనే నమ్మకం నాకుంది. కేటీఆర్ చేసిన అరాచకాలు.. అవినీతి అందరికీ తెలుసు. నాతో సహా బీజేపీ కార్యకర్తలను కేటీఆర్ హింసించి.. జైల్లో వేసిన తీరును ఎవరూ మర్చిపోలేరు. తమ్ముడి కోసమే రేవంత్ అమెరికాకు వెళ్లారనటం సరికాదు. రాజకీయాల్లో విమర్శలు చేసేటప్పుడు హుందాగా వ్యవహరించాలి. నిజాయితీగా పని చేసిన ఐఏఎస్ అధికారులకు నేటికీ పోస్టింగ్ ఇవ్వలేదు. గతంలో బీఆర్ఎస్ కు కొమ్ము కాసిన ఐఏఎస్ లకే మళ్లీ మంచి పోస్టింగులు ఇస్తున్నారు’’ అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేవారు.
అధికారంలోకి వచ్చిన అతి కొద్ది సమయంలోనే ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకున్న ఏకైక పార్టీ కాంగ్రెస్సేనని వ్యాఖ్యానించిన బండి సంజయ్.. ఇతర పార్టీలను చీల్చి లబ్థి పొందాలన్న ఆలోచన తమకు లేదన్నారు. ప్రజలకు సీఎం రేవంత్ పై నమ్మకం పోయిన రోజు నుంచి కాంగ్రెస్ తో జరిగేది యుద్ధమేనన్న బండి..‘‘రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ కాంగ్రెస్.. బీజేపీల మధ్యే ఉంటుంది’’ అని వ్యాఖ్యానించారు.
పాతబస్తీలో రోహింగ్యాలున్న మాట వాస్తవమేనన్న బండి సంజయ్.. గతంలో వక్ఫ్ బోర్డు భూములను కాంగ్రెస్.. మజ్లిస్ నేతలు చాలా చోట్ల కబ్జా చేశారన్నారు. అసదుద్దీన్ ఓవైసీ ఎన్ని వక్ఫ్ బోర్డు భూములను కాపాడారో సమాధానం చెప్పాలన్నారు. ప్రైవేటు భూములు కూడా చాలా చోట్ల వక్ఫ్ బోర్డులో ఉన్నాయన్నారు. వాటిని విచారణ చేస్తేచాలా వివరాలు వెలుగు చూస్తాయన్నారు. తాను అందరి మనిషినని.. కొందరు కాదనుకుంటే తాను మాత్రం ఏమి చేస్తానంటూ పార్టీలోని కొందరి తీరుపై పరోక్షంగా వ్యాఖ్యానించిన బండి మాటలు ఆసక్తికరంగా మారాయి.