ఘర్ వాపసీ : నెలతిరక్క ముందే కారణమేంటీ ?!

రేవంత్ సొంత జిల్లాకు చెందిన గద్వాల ఎమ్మెల్యే బండ్ల క్రిష్ణమోహన్ రెడ్డి ఈ నెల 6న రేవంత్ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నాడు.

Update: 2024-07-30 12:53 GMT

తెలంగాణ రాజకీయాల్లో ఒక కీలక సంఘటన చోటు చేసుకుంది. బీఆర్ఎస్ పార్టీ నుండి 26 మంది ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుని బీఆర్ఎస్ ఎల్పీని విలీనం చేసుకోవాలన్న కాంగ్రెస్ ప్రయత్నాలకు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. బీఆర్ఎస్ నుండి ఇప్పటి వరకు చేరిన పది మంది ఎమ్మెల్యేలలో ఒకరు తిరిగి తాను బీఆర్ఎస్ పార్టీతోనే కొనసాగుతానంటూ ఈ రోజు బీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను కలిశాడు. ఈ సంఘటన కాంగ్రెస్ లో కలకలం రేపింది.

రేవంత్ సొంత జిల్లాకు చెందిన గద్వాల ఎమ్మెల్యే బండ్ల క్రిష్ణమోహన్ రెడ్డి ఈ నెల 6న రేవంత్ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నాడు. సరిగ్గా 26 రోజులకే ఆ పార్టీని వీడి తిరిగి బీఆర్ఎస్ లోకి వెళ్లిపోయాడు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఉన్న మరో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీని పార్టీలో చేర్చుకుని రేవంత్ సొంత జిల్లా ఉమ్మడి పాలమూరు అంతా ఆయన వెనకే ఉందని చాటుకోవాలని భావిస్తున్న సమయంలో ఇది ఒక ఊహించని సంఘటనే. అసలు దీనికి కారణం ఏంటి ? అన్న చర్చ రాజకీయ వర్గాలలో మొదలయింది.

ఒకటి కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్న వారికి ఇచ్చిన హామీల అమలులో ప్రోగ్రెస్ కనిపించడం లేదని, కండువా కప్పిన తరువాత వారి వైపు కన్నెత్తి చూడడం లేదని పొలిటికల్ సర్కిల్ లో చర్చ నడుస్తుంది. ఇక బీఆర్ఎస్ నుండి ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ మొదట కాంగ్రెస్ లో చేరాడు. ఆయనకు మంత్రి పదవి ఖాయం అని అన్నారు. కానీ ఇటీవల ఆయనకు కనీసం రేవంత్ రెడ్డి అపాయింట్ మెంట్ కూడా ఇవ్వడం లేదని సమాచారం. ఏదైనా ఉంటే తామే పిలుస్తామని, తరచూ ఇక్కడికి రావద్దని సీఎం సన్నిహితులు నేరుగా దానంకు చెప్పినట్లు తెలుస్తుంది.

ఈ పరిస్థితులలో బండ్ల వ్యవహారం కూడా బెడిసికొట్టినట్లు ఒక ప్రచారం జరుగుతుంది. బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లోకి ఆహ్వానించిన మంత్రితో తన అనుచరుల మీద ఉన్న కొన్ని కేసులు తప్పించాలన్న ఒప్పందంతో కాంగ్రెస్ చేరినట్లు తెలుస్తుంది. అయితే 26 రోజులైనా ఆ విషయంలో పురోగతి లేకపోవడంతో రెండు రోజుల క్రితం సదరు మంత్రితో ఎమ్మెల్యే బండ్ల తీవ్రంగానే వాగ్వివాదానికి దిగి నిన్ను నమ్మి వచ్చినందుకు ఏం లాభం. 24 గంటల గడువు ఇస్తున్నా .. లేదంటే నాదారి నేను చూసుకుంటా అని చెప్పినట్లు తెలుస్తుంది.

దాని ప్రకారమే ఈ రోజు ఘర్ వాపసీ కార్యక్రమం అని అంటున్నారు. అయితే పార్టీలో కొనసాగుతున్నట్లు చెప్పిన ఎమ్మెల్యే బండ్ల ఎక్కడా మీడియాతో ఏ విషయం మాట్లాడలేదు. మరి ఆయన నోరు తెరిస్తే గానీ అసలు కాంగ్రెస్ ఇచ్చిన హామీలు ఏంటి ? ఆయన ఏ విషయంలో విభేధించాడు అన్నది తేలుతుంది.

Tags:    

Similar News