బెంగళూరు రేవ్‌ పార్టీలో తెలుగు సినీ నటులు!

పోలీసులు ఎంత గట్టిగా వ్యవహరిస్తున్నా, ఇప్పటికే హైదరాబాద్‌ పలుమార్లు డ్రగ్స్‌ ఆనవాళ్లు కలకలం రేపినా రేవ్‌ పార్టీలకు అడ్డుకట్ట పడటం లేదు

Update: 2024-05-20 08:14 GMT

పోలీసులు ఎంత గట్టిగా వ్యవహరిస్తున్నా, ఇప్పటికే హైదరాబాద్‌ పలుమార్లు డ్రగ్స్‌ ఆనవాళ్లు కలకలం రేపినా రేవ్‌ పార్టీలకు అడ్డుకట్ట పడటం లేదు. తాజాగా కర్ణాటక రాజధాని బెంగళూరులో నిర్వహించిన రేవ్‌ పార్టీలో తెలుగు సినీ, టీవీ నటీనటులు, మోడళ్లు కూడా ఉన్నారని ప్రచారం జరుగుతోంది.

హైదరాబాద్‌ కు చెందిన ఒక ప్రముఖ పారిశ్రామికవేత్తకు బెంగళూరు శివారల్లో ఫామ్‌ హౌస్‌ ఉందని చెబుతున్నారు. ఇక్కడ మే 19 ఆదివారం అర్ధరాత్రి బర్త్‌ డే పార్టీ జరిగింది. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున కొకైన్, పలు రకాల డ్రగ్స్‌ ను వినియోగిస్తున్నట్టు పోలీసులకు సమాచారం అందడంతో పోలీసులు రైడ్‌ చేశారు.

ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్‌ కు చెందిన వైసీపీ మంత్రి కాకాణి గోవర్థన్‌ రెడ్డికి సంబంధించిన స్టిక్కర్‌ కూడా దొరకడం గమనార్హం. ఈ పార్టీకి హాజరైన ఒక వ్యక్తి తన కారుకు మంత్రి కాకాణి స్టిక్కర్‌ అంటించినట్టు చెబుతున్నారు. ఈ రేవ్‌ పార్టీకి 100 మందికి పైగా హాజరయ్యారని తెలుస్తోంది. వీరందరినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

కాగా ఈ రేవ్‌ పార్టీలో పెద్ద ఎత్తున డ్రగ్స్‌ వాడినట్టు తెలుస్తోంది. 17 గ్రాముల ఎండీఎంఏ పిల్స్‌ తోపాటు కొకైన్‌ ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఈ పార్టీకి హాజరైనవారి జాగ్వార్, బెంజ్‌ సహా ఖరీదైన 15 ఖరీదైన కార్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఐదుగురిని అరెస్టు చేసిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

కాగా రేవ్‌ పార్టీలో తన స్టిక్కర్‌ లభించడంపై మంత్రి కాకాణి గోవర్థన్‌ రెడ్డి మాట్లాడారు. అసలు ఆ కారుతో తనకు ఎలాంటి సంబంధం లేదని తేల్చిచెప్పారు. కారుపై ఉన్న స్టిక్కర్‌ ఒరిజినలా? లేదా ఫొటో కాపీనా? అనే విషయాన్ని పోలీసులు తేల్చాలన్నారు. 2023తోనే ఆ స్టిక్కర్‌ కాలపరిమితి ముగిసిందని ఆయన స్పష్టం చేశారు.

కాగా తెల్లవారుజాము వరకు జరిగిన రేవ్‌ పార్టీలో పాల్గొన్నవారి పేర్లు ఇంతవరకు బయటకు రాలేదు. కాగా ఆ ఫామ్‌ హౌస్‌ హైదరాబాద్‌ కు చెందిన పారిశ్రామికవేత్త దని పోలీసులు చెప్పినట్టు సమాచారం. బర్త్‌ డే పార్టీ పేరుతో రేవ్‌ పార్టీ నిర్వహించారని తెలుస్తోంది. ఈ క్రమంలో పెద్ద ఎత్తున డ్రగ్స్‌ వినియోగించారని అంటున్నారు.

Tags:    

Similar News