లంక, బంగ్లాలా.. సిరియా అధ్యక్షుడు పరారీ.. కూలిపోయిన విమానం?

అయితే, అసద్ ను పదవి నుంచి దించేసిన తిరుగుబాటుదారులు ఆయన విమానాన్నీ కూల్చివేసినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.

Update: 2024-12-08 10:34 GMT

-దాదాపు రెండున్నరేళ్ల కిందట శ్రీలంకలో ఏం జరిగిందో అందరూ చూశారు. అధ్యక్షుడు గొటబాయ రాజపక్స్ కుటుంబం దోపిడీని, దేశంలో అధిక ధరలు, అవినీతి భరించలేని ప్రజలు తిరుగుబాటు చేశారు. దీంతో గొటబాయ ఏకంగా విమానంలో పారిపోయారు. ఆ తర్వాత ఆయన నివాసంలోకి చొరబడి నానా హంగామా చేశారు.

-సరిగ్గా నాలుగు నెలల కిందట బంగ్లాదేశ్ లో ఏం జరిగింది..? ప్రధాని షేక్ హసీనా పాలనకు వ్యతిరేకంగా విద్యార్థులు ఉద్యమించారు. దీంతో ఆమె కూడా దేశాన్ని వీడారు. అప్పటినుంచి భారత్ లోనే తలదాచుకుంటున్నారు.

-అచ్చం ఇప్పుడు సిరియాలో కూడా ఇలానే జరిగింది. అయితే, హసీనా, గొటబాయ ప్రాణాలు దక్కించుకోగా.. సిరియా అధ్యక్షుడు బషర్ అల్ అసద్ మాత్రం ప్రాణాలతో ఉన్నారా? లేదా? అనే అనుమానం కలుగుతోంది.

సిరియా రాజధాని డమాస్కస్ ను సైతం హయాత్‌ తహరీర్‌ అల్‌-షామ్‌(హెచ్‌టీఎస్‌) సారథ్యంలోని తిరుగుబాటుదారులు ఆధీనంలోకి తీసుకోవడంతో అసద్ దేశాన్ని వీడి వెళ్లిపోయారన్న కథనాలు వస్తున్నాయి. అయితే, అసద్ ను పదవి నుంచి దించేసిన తిరుగుబాటుదారులు ఆయన విమానాన్నీ కూల్చివేసినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.

అసద్ కుటుంబంతో పాటు దేశం వీడి పారిపోతున్నారని.. అయితే ఆయన ప్రయాణిస్తున్న ఐఎల్‌-76 విమానం ఎత్తు ఒక్కసారిగా 3,650 మీటర్ల నుంచి 1,070 మీటర్లకు పడిపోయిందని ఫ్లైట్‌ ట్రాకింగ్‌ వెబ్‌ సైట్లు చూపుతున్నాయి. ఒక్కసారిగా అంత ఎత్తు నుంచి ప్రముఖులు పర్యటిస్తున్న విమానం కిందకు పడిపోవడం అంటే.. ఎవరైనా దీనిని కూల్చి వేసి ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

చిరకాల మిత్రదేశం విమానంలో..

అసద్ కు రష్యా అధ్యక్షుడు పుతిన్ పెద్ద అండ. ఆ దేశ దళాలు ఉన్నంత కాలం అసద్ పదవి భద్రంగా ఉంది. అయితే, ఉక్రెయిన్ లో యుద్ధం తీవ్రత పెంచేందుకు పుతిన్ సిరియాపై ఫోకస్ తగ్గించారు. దీంతోనే తిరుగుబాటుదారులు బలం పుంజుకుని దేశాన్నే వశం చేసుకున్నారు. డమాస్కస్‌ లోకి రెబల్స్‌ రావడంతో అసద్‌ ‘ఎస్‌వైఆర్‌9218’ అనే ఐఎల్‌-76 విమానంలో పరారయ్యారు. ఇది రష్యా తయారీ విమానం.

తొలుత ఈ విమానం సిరియా సముద్ర తీరం వైపు ప్రయాణించింది. అసద్‌ కు చెందిన అలవైట్‌ వర్గానికి బలమైన పట్టున్న ప్రాంతం ఇది. కానీ, మధ్యలో హఠాత్తుగా వ్యతిరేక దిశలోకి తిరిగింది. ఆ తర్వాత ఫ్లైట్‌ రాడార్‌ మ్యాప్‌ నుంచి అదృశ్యమైపోయిందట. అసద్ పరిస్థితి ఏమిటో అధికారిక సమాచారం రాలేదు.

Tags:    

Similar News