విమానాల్లో నోట్ల కట్టలు కుక్కి.. ‘సిరి’యా రష్యా పాలు
బహుశా.. దీనిని గమనించేనేమో..? ఎప్పటికైనా తనకు ఇబ్బంది తప్పదనుకున్నాడు బషర్. మూడో కంటికి తెలియకుండా కట్టలకు కట్టలు డబ్బును రష్యాకు తరలించారట.
రాజుల సొమ్ము రాళ్ల పాలు అనేది ప్రముఖ తెలుగు సామెత.. అంటే.. ప్రజల పళ్లూడగొట్టి వసూలు చేసిన పన్నులు దొంగలు ఎత్తుకెళ్లడం అన్నమాట. అయితే, ఇక్కడ ప్రజల సొమ్ము నియంత పాలు.. లేదా రష్యా పాలు అని చెప్పుకోవాలేమో..? ఎందుకంటే.. పశ్చిమాసియాలో ఒకప్పుడు అందమైన దేశంగా.. అటు యూరప్, ఇటు సంప్రదాయ పద్ధతులతో పేరుతెచ్చుకున్న సిరియా 55 ఏళ్లుగా నియంత అసద్ కుటుంబ పాలనలో మగ్గిపోయింది. చమురు సిరి సంపదలకు కొదువ లేని సిరియా ఇప్పుడు ఇతర దేశాల సాయంతోనే బయటపడే పరిస్థితిలో చిక్కుకుంది.
ఎక్కడుందీ సిరియా?
ఒకవైపు ఇజ్రాయెల్.. మిగతావైపు గల్ఫ్ దేశాలు.. నిత్యం ఉద్రిక్త వాతావరణం నెలకొనే పశ్చిమాసియాలో ఉందీ సిరియా. తిరుగుబాటుదారుల ఆధిపత్యంతో ఇటీవల ఇక్కడి పాలకుడు బషర్ అల్‌అసద్ దేశం విడిచి పోయిన సంగతి తెలిసిందే. అతడు రష్యాకు చేరినట్లు తర్వాత తేలింది. అయితే, 2011 నుంచే సిరియాలో అంతర్యుద్ధం నెలకొంది. 60 శాతం భూభాగమే బషర్ పాలనలో ఉంది. బహుశా.. దీనిని గమనించేనేమో..? ఎప్పటికైనా తనకు ఇబ్బంది తప్పదనుకున్నాడు బషర్. మూడో కంటికి తెలియకుండా కట్టలకు కట్టలు డబ్బును రష్యాకు తరలించారట.
ఆరేళ్ల కిందటే..
అసద్.. 2018-19 మధ్య ఏకంగా 2 టన్నుల బరువైన 100 డాలర్ల బిల్లులు, 500 యూరో నోట్లను విమానాల్లో మాస్కో పంపాడట. వాస్తవానికి అంతర్యుద్ధం తర్వాత సిరియాపై పశ్చిమ దేశాలు ఆంక్షలు విధించాయి. దీంతో డబ్బు కటకట నుంచి తప్పించుకోవాలని భావించి ఇలా చేశారు. అప్పట్లోనే ఈ డబ్బు విలువ 250 మిలియన్ డాలర్లు (రూ.2 వేల కోట్లు)గా ఉంటుందని పేర్కొంటున్నారు.
రష్యా బ్యాంకుల్లో మూలుగుతూ..
సిరియా సెంట్రల్ బ్యాంక్ విమానాలు రష్యా రాజధాని మాస్కోలోని వ్యూంకోవ్ ఎయిర్ పోర్టులో ల్యాండ్ అయి.. అక్కడి బ్యాంకుల్లో డబ్బు వేసేవట. 2018 మార్చి నుంచి 2019 సెప్టెంబరు మధ్య ఇలా జోరుగా డిపాజిట్లు చేశారట. ఒక్క బ 2019 మే నెలలోనే 10 మిలియన్ డాలర్ల నగదు పంపారట. వాస్తవానికి సిరియా అంత్యరుద్ధంలో బషర్ కు రష్యా బాగా సాయం చేసింది. పాశ్చాత్య దేశాల ఆంక్షల నుంచి సిరియా ఆర్థిక వ్యవస్థను ఓ రకంగా కాపాడింది. 2018లో గ్లోబల్ ఫైనాన్షియల్ వ్యవస్థల నుంచి సిరియాను పక్కకు పెట్టారు. విదేశాలతో వ్యాపారానికి నగదు రూపంలో లావాదేవీలు జరపాలి. అంతర్జాతీయ ఆంక్షలను తప్పించుకోవడానికి ఇది బాగా ఉపయోగపడింది. ఆర్థిక, సైనిక సాయాలను రష్యా అందించేది. కిరాయి సైన్యం వాగ్నర్ గ్రూప్ అసద్ కు అండగా నిలిచింది.
ఆ డబ్బు ఏం చేశాడో?
అసద్ ప్రభుత్వం రష్యాకు తరలించిన డబ్బును ఆయన ప్రభుత్వంలోని వారు విలాస జీవితానికి అవసరమైన కొనుగోళ్లను చేసేవారట. అసద్ సంపద నిర్వహణకు ప్రముఖ ఆర్థిక సేవల సంస్థ జేపీ మోర్గాన్ లో పనిచేసిన మాజీ ఉద్యోగి సాయం చేశాడట. రష్యా ఫైనాన్షియల్ కార్పొరేషన్ బ్యాంక్, టీఎస్ ఎంఆర్ బ్యాంక్ లు ఇందుకు తోడ్పాటు అందించాయట. సిరియా డబ్బును ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ కోర్, హెజ్‌బొల్లా నిర్వహించే కంపెనీల్లో పెట్టినట్లు తెలుస్తోంది. అసద్ ఆర్థిక సలహాదారు యాసిర్ ఇబ్రహీం
మొత్తం పర్యవేక్షణ చేసేవాడట.
అసద్ కు 200 టన్నుల బంగారం, 16 బిలియన్ డాలర్లు (రూ.1.35 లక్షల కోట్లు), 5 బిలియన్ యూరోలు (రూ.44 వేల కోట్లు) ఉన్నట్లు పేర్కొంది. మూడేళ్ల కిందటే అమెరికా సంస్థ ఒకటి అసద్ కు 2 బిలియన్ డాలర్లు (రూ.16 వేల కోట్లు) వరకు సంపద ఉందని పేర్కొంది. సిరియాలో శక్తిమంతమైన వ్యాపారి రామీ మఖ్ లౌఫ్ 2020లో అసద్ కుటుంబంతో విభేదిండంతో అతడి సంపదను స్వాధీనం చేసుకున్నారు. అందులో అసద్ కుటుంబానికి 5 బిలియన్ డాలర్లు చేరాయట.