భట్టీనే కీలకమా ?
రాబోయే తెలంగాణా ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కూడా కీలక పాత్రే పోషించబోతున్నారు
రాబోయే తెలంగాణా ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కూడా కీలక పాత్రే పోషించబోతున్నారు. ఎలాగంటే కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకునేందుకు కమ్యూనిస్టు పార్టీలు చాలా ఆసక్తిగా ఉన్నాయి. నిజానికి కమ్యూనిస్టుల ప్రభావం చాలావరకు తగ్గిపోయింది. ఏదో అవశేషాలు ఇంకా మిగిలే ఉన్నాయి. ఆ అవశేషాలు కూడా ఖమ్మం, నల్గొండ జిల్లాల్లోనే ఉన్నాయి. భట్టీది ఎలాగూ ఖమ్మం జిల్లాలోని మధిర నియోజకవర్గమే. ఉభయకమ్యూనిస్టు పార్టీల రాష్ట్ర కార్యదర్శులు తమ్మినేని వీరభద్రం, కూనంనేని సాంబశివరావు ఖమ్మం జిల్లా వాళ్ళే.
కాబట్టి రాబోయే ఎన్నికల్లో కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకోవాలా వద్దా ? పెట్టుకుంటే ఎన్నిసీట్లు కేటాయించాల్సుంటుంది అనే విషయాలను భట్టీని డిసైడ్ చేయమని ఏఐసీసీ అగ్రనేతలు భట్టీకి బాధ్యతలు అప్పగించారు. చర్చల సారంశాన్ని పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డికి ఎప్పటికప్పుడు అప్ డేట్ చేస్తుండాలని భట్టిని పార్టీ అగ్రనేతలు ఆదేశించారు. ఇప్పటికే వామపక్షాల కీలకనేతలు ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్, తెలంగాణా ఇన్చార్జి మాణిక్ రావు థాక్రేతో సమావేశమయ్యారు.
ఇక్కడ విషయం ఏమిటంటే కమ్యూనిస్టులు సొంతంగా ఏ అసెంబ్లీ సీటును కూడా గెలుచుకునేంత స్ధాయిలో లేవు. అయితే ఇతరులను ఓడించేందుకు సరిపడా బలమైతే ఉంది. అదికూడా ఖమ్మం, నల్గొండ జిల్లాల్లోని 24 నియోజకవర్గాల్లోని సుమారు 14 నియోజకవర్గాల్లో ఓడించే బలమైతే ఉంది. అందుకనే కమ్యూనిస్టులతో పొత్తుకు కాంగ్రెస్ మొగ్గుచూపుతున్నది. రాబోయే ఎన్నికల్లో గెలుపోటములు పదుల ఓట్లతో కూడా డిసైడ్ అయ్యే అవకాశముంది.
గెలుపోటముల మధ్య తేడా ఇంత తక్కువగా ఉంటుందని అనుకుంటున్నపుడు కొన్ని చోట్ల కమ్యూనిస్టులకు ఉన్న ఐదారువేల ఓట్లు కూడా చాలా కీలకమవుతుంది. అందుకనే వేరేదారిలేక పొత్తుకు రెడీ అవుతున్నది. ఇక్కడే కమ్యూనిస్టులు కొండెక్కి కూర్చుంటున్నారు. తమ రెండుపార్టీలకు కలిపి ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలను కేటాయించాలని పట్టుబడుతున్నారు. ఖమ్మం, కొత్తగూడెం, పాలేరు, వైరా, మిర్యాలగూడ, మంచిర్యాలను అడుగుతున్నాయి. కాంగ్రెస్ మాత్రం చెరో సీటును కేటాయించేందుకు రెడీ అవుతోంది. అలాగే ఎస్సీ ఓట్ల కోసం బీఎస్పీతో పొత్తుకు రెడీ అవుతోంది. మరి చివరకు ఏమవుతుందో చూడాలి.