ఆళ్ళగడ్డలో అఖిలప్రియ సీటుకు ఎర్త్ పెడుతున్నారా...?

మాజీ మంత్రి భూమా నాగిరెడ్డి రాజకీయ వారసురాలు అయిన భూమా అఖిలప్రియ నంద్యాల మీద పట్టుబట్టి ఉన్నారు

Update: 2023-08-07 04:54 GMT

మాజీ మంత్రి భూమా నాగిరెడ్డి రాజకీయ వారసురాలు అయిన భూమా అఖిలప్రియ నంద్యాల మీద పట్టుబట్టి ఉన్నారు. నంద్యాల సీటు కూడా తమదే అంటున్నారు. తన తండ్రి నాగిరెడ్డి ప్రాతినిధ్యం వహించిన సీటుగా చెప్పుకుంటున్నారు. మొత్తంగా అఖిలప్రియ కోరుతున్నది ఏంటి అంటే నంద్యాలలో తన తమ్ముడు జగన్ విఖ్యాత్ రెడ్డికి, ఆళ్ళగడ్డలో తనకూ రెండు సీట్లూ కన్ ఫర్మ్ చేయాలని.

అలా కనుక జరిగితే మరిన్ని దశాబ్దాల పాటు భూమా నాగిరెడ్డి భూమా శోభా నాగిరెడ్డి మాదిరిగా తాను తమ్ముడూ రెండు సీట్లలో రాజకీయ చేసుకోవచ్చు అన్నది అఖిలప్రియ దూరాలోచన. మంచి వ్యూహం కూడా. అయితే టీడీపీలో సీనియర్లు ఊరుకుంటారా అందునా ప్రతీ విషయంలో వివాదాలలోకి వెళ్తున్న అఖిలప్రియకు సొంత పార్టీలోనే ప్రత్యర్ధులు ఎక్కువ. అంత దాకా ఎందుకు సొంత కుటుంబీకుడు కజిన్ అయిన భూమా బ్రహ్మానందరెడ్డితోనే ఆమెకు పొసగడంలేదు. దాంతో వీలు చూసుకుని మరీ ఇపుడు ఏకంగా అఖిలప్రియ ఆళ్లగడ్డ సీటుకు సొంత అడ్డాలోనే ఎర్త్ పెట్టే పనిలో పడ్డారని టాక్.

అక్కడికి ఆళ్ళగడ్డ సీటు ఏదో తనకు కన్ ఫర్మ్ అయినట్లుగా అఖిలప్రియ నంద్యాల కూడా కావాలని అంటున్నారు. కానీ టీడీపీలో సీనియర్లను చూస్తూంటే ఆళ్ళగడ్డలోనే ఆమెకు టికెట్ లేకుండా చేయాలనుకుంటున్నారుట. ఇంతకీ మ్యాటర్ ఏంటి అంటే నంద్యాలలో భూమా బ్రహ్మానందరెడ్డికే టికెట్ కన్ ఫర్మ్ చేయించి అక్కడితో భూమా ఫ్యామిలీకి ఒక టికెట్ అని ముగించేస్తారుట.

ఆళ్ళగడ్డ నుంచి ఏవీ సుబ్బారెడ్డికి టికెట్ ఇవ్వాలని ఆయన వియ్యంకుడు అయిన బోండా ఉమా మహేశ్వరరావు రంగంలోకి దిగుతున్నారు. ఆయన సీనియర్ నేత కావడమే కాదు, బాబుకు అత్యంత సన్నిహితుడు, పొలిట్ బ్యూరో మెంబర్ కూడా. అలా తన వియ్యంకుడు సుబ్బారెడ్డిని ఆళ్ళగడ్డ బరిలోకి దింపాలని చూస్తున్నారు.

తన వియ్యంకుడి గెలుపునకు తాను హామీ అని ప్రచారం అంతా తాను చూసుకుంటాను అని చంద్రబాబుకు చెప్పబోతున్నారుట. ఇక ఇప్పటికే ఏవీ సుబ్బారెడ్డికి అఖిలప్రియకు ఒక రేంజిలో గొడవలు జరుగుతున్నాయన్నది తెలిసిందే.

ఇపుడు ఏకంగా ఆమె సీటుకే ఎర్త్ పెట్టేలా వియ్యంకుడిని మధ్యలో పెట్టి సుబ్బారెడ్డి చేస్తున్న ఈ ప్రయత్నం ఫలిస్తే మాత్రం అఖిలమ్మకు ఆళ్ళగడ్డ సీటు గల్లంతే అంటున్నారు. మొత్తంగా చూసుకుంటే భూమా ఫ్యామిలీని పక్కన పెట్టేసే కార్యక్రమం జరుగుతోందా అని కూడా అంటున్నారు. దానికి టీడీపీలోని సీనియర్లే కంకణం కట్టుకున్నారా అన్నది కూడా చర్చకు వస్తోంది.

అయితే చేసుకున్న వారికి చేసుకున్నంత అని అఖిలప్రియ దూకుడుతోనే ఇలా జరుగుతోంది అని కూడా అంటున్నారు. మరి చంద్రబాబు కనుక భూమా ఫ్యామిలీ నుంచి ఒకే టికెట్ అని అది కాస్తా బ్రహ్మానందరెడ్డికి ఇచ్చేసి ఆళ్ళగడ్డలో సుబ్బారెడ్డికి గ్రీన్ సిగ్నల్ ఇస్తే మాత్రం అఖిలప్రియ పాలిటిక్స్ డేంజర్ లో పడుతుందనే అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.

Tags:    

Similar News