టీటీడీ చైర్మన్ గా భూమన...జగన్ స్కెచ్ అదేనా...?
సరిగ్గా 17 ఏళ్ల తరువాత చిన్నాయన జగన్ కూడా భూమనకు ఇదే పదవి ఇచ్చి గౌరవించడం విశేషం.
మొత్తానికి టీడీపీ కొత్త చైర్మన్ ఎవరో తెలిసిపోయింది. తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డిని జగన్ ఎంపిక చేశారు. ఆయనకు ఈ పదవి కొత్త కాదు, ఆయన 2006 నుంచి 2008 దాకా టీటీడీ చైర్మన్ గా పనిచేశారు. వైఎస్సార్ కి నమ్మిన బంటుగా ఉన్న భూమనకు ఈ పదవికి ఇచ్చి అప్పట్లో పెద్దాయన గౌరవించారు. సరిగ్గా 17 ఏళ్ల తరువాత చిన్నాయన జగన్ కూడా భూమనకు ఇదే పదవి ఇచ్చి గౌరవించడం విశేషం.
టీటీడీ చైర్మన్ పదవి విషయంలో చాలా పోటీ ఉంది. బీసీకి ఈ పదవి ఇస్తారని అనుకున్నారు. దాంతో గుంటూరుకు చెందిన బీసీ నేత, ఎమ్మెల్సీ జంగా క్రిష్ణ మూర్తి పేరు ప్రముఖంగా వినిపించింది. ఆ తరువాత చూస్తే నెల్లూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి వైశ్య సామాజికవర్గానికి చెందిన సిద్ధా రాఘవరావుకు ఈ పదవి ఇస్తారని అనుకున్నారు ఆయన కూడా అనూహ్యంగా రేసులోకి వచ్చారు.
వైశ్య సామాజిక వర్గానికి మంత్రివర్గంలో స్థానంలో లేనందువల్ల దానికి సమానంతరంగా ఈ పదవి ఉంటుందని న్యాయం చేసినట్లు అవుతుందని లెక్కలు వేశారని అనుకున్నారు. కానీ అదీ జరగలేదు. ఇక భూమన కరుణాకరరెడ్డి, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి చివరిదాకా పోటీ పడ్డారు.
మొత్తానికి జగన్ భూమన వైపు మొగ్గు చూపడం విశేషం. భూమన ఈ పదవిని రెండేళ్ల పాటు గతంలో ఎలాంటి వివాదాలకు తావు లేకుండా నిర్వహించారు. ఆయన హయాంలో కొన్ని సంస్కరణలను చేపట్టారు. దాంతో పాటుగా ఎన్నికల ఏడాదిలో టీటీడీ వంటి ప్రతిష్టాత్మక సంస్థకు సరైన వారు చైర్మన్ గా ఉండాలని ప్రభుత్వం భావించింది. ఇంకో వైపు చూస్తే భూమనకు వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇవ్వరని ప్రచారంలో ఉంది.
అంటే ఆయనకు ఈ నామినేటెడ్ పదవిని ఇచ్చి న్యాయం చేసారని అంటున్నారు. అదే విధంగా భూమన వైఎస్సార్ ఫ్యామిలీకి కావాల్సిన వారు. నిజానికి ఆయనకు మంత్రి పదవి దక్కుతుందని అంతా అనుకున్నారు కానీ ఏదీ కలసిరాలేదు. ఇక వైవీ సుబ్బారెడ్డికి ఒక చాన్స్ ఇచ్చిన తరువాత అయినా భూమనకు ఇస్తారని అనుకుంటే ఆయన్నే కంటిన్యూ చేశారు. చివరికి ఎన్నికల ఏడాదిలో ఆయనకు ఈ ప్రతిష్టాత్మక పదవిని ఇవ్వడం ద్వారా జగన్ తన సన్నిహితులకు కూడా న్యాయం చేశాను అనిపించుకున్నారు అని అంటున్నారు.
మరో వైపు చూస్తే వచ్చే ఎన్నికల్లో తిరుపతి సీటుని మరోసారి గెలవాలని వైసీపీ చూస్తోంది. దాని కోసం భూమన అంగబలం అర్ధబలం కలసివస్తాయన్న అంచనాతో ఈ పదవిని అప్పగించారు అని అంటున్నారు. మొత్తానికి చూస్తే ఓసీకే ఈ పదవి దక్కింది అని చెప్పుకోవాలి భూమన హయాంలో టీటీడీపీ మరింతగా వెలిగి ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందన్న ఆలోచన కూడా ఉంది అని అంటున్నారు.