హత్య కేసులో పవన్ ‘విలన్’ అరెస్ట్
హిందీ టీవీ ప్రేక్షకులకు సుపరిచితుడు అయిన భూపీందర్ సింగ్ హత్య కేసులో అరెస్ట్ అవ్వడం చర్చనీయాంశంగా మారింది.
హిందీ టీవీ ప్రేక్షకులకు సుపరిచితుడు అయిన భూపీందర్ సింగ్ హత్య కేసులో అరెస్ట్ అవ్వడం చర్చనీయాంశంగా మారింది. పవన్ కళ్యాణ్ నటించిన తమ్ముడు సినిమాలో భూపీందర్ విలన్ గా నటించి అప్పట్లో మంచి పేరు దక్కించుకున్నాడు. 54 ఏళ్ల భూపీందర్ తన లైసెన్స్ రివాల్వర్ తో కాల్పులు జరిపినట్లుగా ప్రత్యక్ష సాక్ష్యులు చెప్పడంతో పోలీసులు అరెస్ట్ చేసినట్లుగా జాతీయ మీడియాలో ప్రధానంగా వార్తా కథనాలు వస్తున్నాయి.
భూపీందర్ సింగ్ కి తన పక్కింటి వ్యక్తి అయిన గురుదీప్ సింగ్ తో విభేదాలు ఉన్నాయి. ఆ విభేదాలు తారా స్థాయికి చేరుకోవడంతో ఏకంగా కాల్పులు జరిపే వరకు వెళ్లిందని పోలీసులు పేర్కొన్నారు. భూపీందర్ సింగ్ తో పాటు ఆయన సన్నిహితుడు అనుమతి లేని తుపాకీతో ఏకంగా 10 రౌండ్లు కాల్పులు జరిగినట్లు పోలీసులు పేర్కొన్నారు.
బిజ్నూర్ లో ఈ సంఘటన జరిగింది. భూపీందర్ జరిపిన కాల్పుల్లో గురుదీప్ సింగ్ తనయుడు అక్కడికి అక్కడే మృతి చెందాడు. మరో తనయుడు మరియు కొంత మంది కుటుంబ సభ్యులు బుల్లెట్లు తగిలి గాయాల పాలు కావడంతో స్థానిక జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు పోలీసులు తెలియజేశారు.
యూకలిప్టస్ చెట్లు నరికిన విషయంలో వివాదం తలెత్తిందని వార్తలు వస్తున్నాయి. ఇప్పటివరకు పోలీసులు మీడియా కు పూర్తి వివరాలు వెళ్లడించ లేదు. అయితే భూపీందర్ సింగ్ ను అరెస్ట్ చేసినట్లుగా మాత్రం పోలీసులు అధికారికంగా ప్రకటించారు.
భూపీందర్ సింగ్ తో పాటు మరో ఇద్దరిని కూడా పోలీసులు ఈ కేసులో అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. నటుడిగా ఎన్నో పాత్రలతో అలరించిన భూపీందర్ ఇలా హత్య కేసులో అరెస్ట్ అవ్వడం చర్చనీయాంశంగా మారింది.