కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ కు బిగ్ రిలీఫ్!

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పై కేసు నమోదు చేయాలని బెంగళూరులోని తిలక్ నగర్ పోలీసులను చట్టసభ ప్రతినిధుల కోర్టు ఆదేశించింది.

Update: 2024-09-30 15:18 GMT

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పై కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఎలక్టోరల్ బాండ్లకు సంబంధించి ఓ వ్యక్తి నిర్మలా సీతారామన్ పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే కేసు నమోదు చేసేందుకు పోలీసులు నిరాకరించారు! దీంతో... ఆ వ్యక్తి కోర్టును ఆశ్రయించగా.. కేసు నమోదు చేయాలని కోర్టు పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది.

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పై కేసు నమోదు చేయాలని బెంగళూరులోని తిలక్ నగర్ పోలీసులను చట్టసభ ప్రతినిధుల కోర్టు ఆదేశించింది. ఎలక్టోరల్ బాండ్ల పేరుతో కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్.. కొంతమంది బిజినెస్ మేన్ లను బెదిరించారని.. ఫలితంగా బీజేపీకి విరాళాలు అందేలా చేశారని చేసిన ఆరోపణలపై కేసు నమోదైంది.

నిర్మలా సీతారామన్.. పలువురు పారిశ్రామికవేత్తలను బెదిరించారని, బీజేపీకి నిధులు వచ్చేలా చేశారని.. జనాధికార సంఘర్ష పరిషత్ కు చెందిన ఆదర్శ్ అయ్యర్ అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. దీంతో... ఈ వ్యవహారం బీజేపీ – కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధానికీ తెరలేపింది. ఈ సమయంలో సీఎం సిద్ధరామయ్య ఘాటుగా స్పందించారు.

ఇందులో భాగంగా... బిజినెస్ మేన్ లను బెదిరించి బీజేపీకి ఎన్నికల బాండ్ల ద్వారా విరాళాలు తెప్పించేందుకు ప్రయత్నాలు చేసిన నిర్మాలా సీతారామన్ కేంద్రమంత్రి పదవిలో ఉండటానికి వీలు లేదని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అన్నారు. ఆమె వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమయంలో నిర్మలమ్మకు బిగ్ రిలీఫ్ దక్కింది.

అవును... వ్యాపారస్తులను బెదిరించి బీజేపీకి ఎలక్టోరల్ బాండ్ల పేరుతో భారీగా నిధులు వచ్చేలా చేశారనే ఆరోపణలపై కేసు నమొదైన నేపథ్యంలో... నిర్మలా సీతారామన్ కు కర్ణాటక హైకోర్టు ఊరటనిచ్చింది. ఇందులో భాగంగా... ఆమెపై నమోదైన ఎలక్టోరల్ బాండ్స్ కేసులో విచారణపై స్టే విధించింది.

తదుపరి విచారణను అక్టోబరు 22కి వాయిదా వేసింది. ఇదే సమయంలో... అప్పటివరకూ ఇన్వెస్టిగేషన్ పై స్టే విధించింది. దీంతో... ఈ కేసులో నిర్మలా సీతారామన్ కు ప్రస్తుతానికి ఊరట లభించిందని అంటున్నారు పరిశీలకులు.

Tags:    

Similar News