జనవరి 1 నుంచే కొత్త ఆర్ధిక సంవత్సరంగా ?
ప్రతీ ఏటా మార్చి నెలలో బడ్జెట్ ని చట్ట సభలలో పెట్టి ఆ నెలాఖరుకు ఆమోదించుకుంటే ఏప్రిల్ 1 నుంచి కొత్త ఆర్ధిక సంవత్సరం మొదలవుతుంది.
కొత్త ఆర్ధిక సంవత్సరం అంటే అందరికీ తెలిసింది అమలులో ఉన్నది ఏమిటంటే ఏప్రిల్ 1 నుంచి మార్చి 31 వరకూ ఉంటుంది. ఇది మొదటి నుంచి అమలులో ఉన్నది. ప్రతీ ఏటా మార్చి నెలలో బడ్జెట్ ని చట్ట సభలలో పెట్టి ఆ నెలాఖరుకు ఆమోదించుకుంటే ఏప్రిల్ 1 నుంచి కొత్త ఆర్ధిక సంవత్సరం మొదలవుతుంది.
ఇది శతాబ్దాలుగా సాగుతూ వస్తోంది. అయితే ఏప్రిల్ 1 నుంచి మార్చి 31 అన్న ఆర్ధిక సంవత్సర విధానం బ్రిటిష్ ప్రభుత్వం 1867లో తీసుకుని వచ్చింది అది నేటి వరకూ అంతా అనుసరిస్తూ వస్తున్నారు. మార్చి నెల వచ్చేసరికి భారత దేశం లాంటి దేశాలలో పగలు కాలం పెరుగుతుంది. అలాగే పూర్వకాలంలో అయితే పని గంటలు బాగా పెరుగుతూ వచ్చేవి. దాంతో ఆదాయం కూడా పెరుగుతుంది కాబట్టి దానికి కొలమానంగా తీసుకుని అన్ని లెక్కలూ బేరీజు వేసుకుని కొత్త ఆర్ధిక సంవత్సరంలో ప్రణాళిలను తయారు చేయడం ఒక ఆనవాయితీగా ఉందని కూడా చెబుతారు.
అయితే బీజేపీ ఎపుడూ తనదైన విధానాలతో ముందుకు సాగుతూ ఉంటుంది అన్నది తెలిసిందే. ఒక దేశం ఒక ఎన్నిక ఒకే రేషన్ ఇలా అనేక నిర్ణయాల మీద భారీ కసరత్తు చేస్తున్న బీజేపీ ఇపుడు కొత్త ఆర్ధిక సంవత్సరం విషయంలో కూడా కొత్త నిర్ణయం తీసుకోవాలని అనుకుంటోంది అంటున్నారు.
దాని ప్రకారం ప్రతీ ఏటా జనవరి 1తో కొత్త ఆర్ధిక సంవత్సరం మొదలెట్టి డిసెంబర్ 31తో దానికి ముగించేలా పూర్తి స్థాయిలో మార్పులు తీసుకుని రావాలని అనుకుంటోంది. ఇలా ఎందుకు అంటే దానికి బీజేపీ కారణాలు చాలానే ఉన్నాయి. తమ మార్క్ పాలన మీద ప్రభుత్వం మీద ఉండాలని అది చరిత్రలో నిలిచేలా ఉండాలని బీజేపీ ఎపుడూ ఆలోచిస్తూ ఉంటుంది.
అంతే కాదు ఈ రోజు ప్రపంచం ఒక కుగ్రామంగా మారింది. పైగా ప్రతీ దేశం పోటీతో పరుగులు తీస్తూ భారీ ఒత్తిడిని ఎదుర్కొంటోంది. ఏ నిర్ణయం అయినా సకాలంలో తీసుకోకపోతే వెనకబడిపోయే ప్రమాదం ఉంది. అదే సమయంలో ఆ లేట్ మరొకరికి చాన్స్ ఇచ్చేదిగా ఉంటోంది.
ఇక ప్రపంచలో చూస్తే అనేక దేశాలు జనవరి 1 నుంచి డిసెంబర్ 31 దాకా కొత్త ఆర్ధిక సంవత్సరం అన్న దానినే అనుసరిస్తున్నారు. భారత్ లో మాత్రమే ఏప్రిల్ లో కొత్త ఆర్ధిక సంవత్సరం మొదలవుతోంది. దీని వల్ల కూడా కేంద్ర ప్రభుత్వం ఈ కొత్త ఆలోచన చేస్తోంది అని అంటున్నారు.
ఇంకో వైపు చూస్తే ఈ ఆలోచన బీజేపీకి ఈనాటిది కాదు, గతంలోనూ ఈ తరహా ప్రతిపాదనలు బీజేపీ చేస్తుందని ప్రచారం పెద్ద ఎత్తున సాగింది. కానీ చివరికి ఏమీ సాగలేదు. అయితే ఇపుడు బీజేపీ ఈ వినూత్న ఆలోచనను ముందుకు తీసుకుని రావాలని అనుకుంటోంది అని చెబుతున్నారు. ఇక బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం ఫిబ్రవరి 1న పార్లమెంట్ లో బడ్జెట్ ని ప్రవేశపెడుతోంది. ఆ బడ్జెట్ లోనే దీని మీద ఒక నిర్ణయం తీసుకుని ప్రకటించే అవకాశాలు మెండుగా ఉనాయని అంటున్నారు.
అయితే ఈ విధంగా ఆర్ధిక సంవత్సరాన్ని మూడు నెలల ముందుకు తీసుకుని వస్తూ కీలక మార్పులు చేస్తే అది పన్నులు చెల్లించే వారికి కానీ వ్యాపార వర్గాలకు కానీ ఇబ్బందిగా మారుతుంది అన్న మాట ఉంది. ఎందుకంటే వారు అంతా దశాబ్దాలుగా ఒక ప్రణాళిక ప్రకారం అంతా చేసుకుంటూ వస్తున్నారు. ఇపుడు ఈ విధంగా అయితే సర్దుబాట్లు చేసుకోవడం కష్టం అవుతుందని అంటున్నారు.
అయితే కేంద్ర ప్రభుత్వం తలచుకుంటే అమలు చేస్తుంది కాబట్టి దానికి అనుగుణంగా ఎవరైనా తమ ప్రణాళికలను మార్చుకోవాల్సిందే అని అంటున్నారు. ఇపుడు దానిని మార్చాలని బీజేపీ చూస్తోంది అన్న ప్రచారంలో వాస్తవం ఎంత అన్నది బడ్జెట్ లో తెలుస్తుందని అంటున్నారు