`ఒంటరులు కాదు.. తుంటరులు`.. బీజేపీ నయా ప్లాన్!
బీజేపీకి అంత సీన్ లేదన్న విశ్లేషణలు కూడా వస్తున్నాయి. ఈ క్రమంలోనే అనూహ్య పరిణామాలు తెరమీదికి వస్తున్నాయి.
రాజకీయాల్లో ఏదైనా జరగొచ్చు. ప్రత్యర్థిని ఓడించేందుకు.. ప్రత్యర్థి పక్షాన్ని గద్దె దింపేందుకు.. పార్టీలు వేసే వ్యూహాలు చిత్రంగా ఉంటాయి. వాటిని అర్థం చేసుకునే తీరిక ప్రజలకు ఉండడం లేదు. తాజాగా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ వేసిన నయా ప్లాన్.. అక్కడి అధికార పార్టీ ఆమ్ ఆద్మీకి ముచ్చెమటలు పట్టిస్తోంది. ప్రస్తుతం మూడు పార్టీల మధ్య ప్రధాన పోరు సాగుతోంది. అధికార ఆమ్ ఆద్మీ పార్టీ, ప్రతిపక్షాలైన కాంగ్రెస్, బీజేపీలు ఇక్కడ అధికారాన్ని దక్కించుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. అయితే.. ప్రస్తుతం ఉన్న ట్రెండ్‌లో ఆప్ దూకుడుగా ఉందన్న సంకేతాలు వస్తున్నాయి.
ఆప్, కాంగ్రెస్ , బీజేపీలు ఎవరికి వారుగా పోటీ చేస్తున్నా.. బీజేపీకి అంత సీన్ లేదన్న విశ్లేషణలు కూడా వస్తున్నాయి. ఈ క్రమంలోనే అనూహ్య పరిణామాలు తెరమీదికి వస్తున్నాయి. `ఒంటరి పోరు` అంటూ.. అరడజను పార్టీలు రంగంలోకి దిగుతు న్నాయి. వీటికి ఘన చరిత్ర కూడా ఉంది. గత పదేళ్లలో చాలా వ్యూహాత్మకంగా ఈ ఒంటరి పోరు బోర్డు పెట్టుకున్న పార్టీ బీజేపీకి బీ పార్టీలు వ్యవహరిస్తున్నాయన్న విమర్శలు వస్తున్నాయి. మాజీసీఎం మాయావతి నేతృత్వంలోని బీఎస్పీ.. ఎస్సీ ఓటు బ్యాంకును చీల్చడంలో ఘనా పాటి. గత ఏడాది జరిగిన హరియాణ ఎన్నికల్లో ఇదే దెబ్బ కాంగ్రెస్‌కు ఘనంగా తగిలింది.
ఇక, హైదరాబాద్‌కు చెందిన ఎంఐఎం కూడా ముస్లిం ఓటు బ్యాంకును చీల్చి .. పరోక్షంగా పెద్ద పార్టీలకు మేలు చేస్తోందన్న విమర్శలు మూటగట్టుకుంటున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ రెండు పార్టీలకు తోడు భారతీయ లిబరల్ పార్టీ(బీఎల్‌పీ) కూడా ఢిల్లీ ఎన్నికల్లో బరిలో నిలుస్తోంది. చిత్రం ఏంటంటే.. వీటిలో బీఎస్పీ, బీఎల్పీలకు బూత్ స్థాయి కార్యకర్తలు కూడా ఢిల్లీలో లేకపోవడం. కానీ, ఉన్న 70 నియోజకవర్గాల్లోనూ.. ఈ పార్టీలు పోటీకి సై అంటున్నాయి. అభ్యర్థులను నిలబెట్టేందుకు ఉత్సాహంగా అడుగులు వేస్తున్నాయి. ఇక, ఎంఐఎం మాత్రం తమ ముస్లిం వర్గం ఎక్కువగా ఉన్న చోట అభ్యర్థులకు ఛాన్స్ ఇవ్వనున్నట్టు చెబుతోంది.
తాజాగా మహారాష్ట్రలో అధికారం పంచుకున్న నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ(ఎన్‌సీపీ) కూడా ఢిల్లీలో 30 స్థానాల్లో పోటీ చేయనున్న ట్టు తెలిపింది. తమ మహారాష్ట్ర ప్రజలు ఎక్కువగా ఉన్న చోట తమ అభ్యర్థులు పోటీ పడతారని ఎన్సీపీ నేత, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ చెబుతున్నారు. అయితే.. ఆయా పార్టీలు అన్నీ కూడా.. ఒంటరిగానే బరిలో దిగనున్నాయి తద్వారా.. సామాజిక వర్గాలు, మతపరమైన ఓటు బ్యాంకును చీల్చాలనేది వ్యూహంగా ఉందని.. ఇవన్నీ ఒంటరి పోరాటానికి దిగడం లేదని.. బీజేపీ సారథ్యంలో అప్రటిత తుంటరి పోరాటానికి దిగుతున్నాయని అధికార పార్టీ ఆమ్ ఆద్మీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ పార్టీలన్నీ బీజేపీకి అనుబంధ ముక్కలేనని వారు దుయ్యబడుతుండడం గమనార్హం.