కమల పవనాలు... ఎన్నెన్నో అనుమానాలు
ఏపీలో టీడీపీని కూడా పొత్తులో కలుపుకుని పోవాలని పవన్ ఆలోచనగా ఉంది. బీజేపీకి ఆ విషయం తెలిసినా ఎందుకో టీడీపీతో కలసి వెళ్లేందుకు అంతకా ఆసక్తిని చూపించడంలేదు అని అంటారు.
బీజేపీతో పొత్తు అంటూ 2019 ఎన్నికలు అయిన కేవలం ఆరు నెలల లోపే జనసేన తానుగా ముందుకు వచ్చింది. దాంతో బీజేపీ పెద్దలు కూడా సరేనని అన్నారు. అప్పటికి టీడీపీ మీద సైతం వ్యతిరేకత వ్యక్తం చేస్తూ జనసేన 2019లో పోటీ చేసిన నేపధ్యం ఉంది. దాంతో చంద్రబాబు అటు జనసేనకు ఇటు బీజేపీకి కామన్ రాజకీయ ప్రత్యర్ధి కాబట్టి మిత్రుడుగా పవన్ని స్వీకరించింది.
ఈ మిత్ర బంధం అప్పటి బీజేపీ ప్రెసిడెంట్ కన్నా లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో జరిగింది. చిత్రమేంటి అంటే కన్నా లక్ష్మీనారాయణ కాంగ్రెస్ నుంచి వచ్చి బీజేపీలో చేరిన వారు. ఆయన ఇటీవల టీడీపీలోకి వచ్చేశారు. దీనికి ముందు జనసేనలోకి చేరుతారు అని ప్రచారమూ ఉంటూ వచ్చింది.
ఇవన్నీ పక్కన పెడితే అసలు పవన్ ఆనాడు ఆదరాబాదరాగా బీజేపీతో పొత్తు ఎందుకు పెట్టుకున్నారు అన్నది ఇప్పటికీ ఆశ్చర్యమే అంటారు. ఎవరైనా ఎన్నికలకు ముందు పొత్తులు పెట్టుకుంటారు. కానీ ఎన్నికలు ఇంకా నాలుగున్నరేళ్ళ టైం ఉండగానే ఈ పొత్తులు అంటే అవి ఈ పాటికి ఎంతో బలపడి ఎన్నికల ముందు మూడవ ఫోర్స్ గా స్ట్రాంగ్ గా దూసుకుని రావాలి.
కానీ అలా ఎక్కడా జరగలేదు. పేరుకు పొత్తులే తప్ప ఎక్కడా రెండు పార్టీలు కలసి పనిచేసినది లేదని అంటున్నారు. ఇక బీజేపీ ఎపుడూ జనసేన మా మిత్రపక్షం అంటూ వచ్చినా కూడా పవన్ కళ్యాణ్ మాత్రం కేంద్ర బీజేపీ నేతలతో టచ్ లో ఉన్నాను అని అంటూంటారు. ఇక గత ఏడాది విశాఖ వచ్చిన ప్రధాని మోడీ పవన్ని ప్రత్యేకంగా పిలిపించుకుని ఏకాంతంగా చర్చించారు మరి దీని వివరాలు ఏమిటో తెలియదు కానీ బీజేపీ జనసేన పొత్తు అలాగే కంటిన్యూ అవుతూ వచ్చింది.
ఈ మధ్యన ఢిల్లీలో జరిగిన ఎండీయే మీట్ కి తెలుగు రాష్ట్రాల నుంచి జనసేనను మాత్రమే పిలిచి మా మిత్రపక్షం అని జాతీయ స్థాయిలో పరిచయం చేసింది బీజేపీ. ఈ క్రమంలో చూస్తే మళ్లీ జనసేన బీజేపీ కలసికట్టుగా సాగుతాని అనుకున్నారు కానీ అది కూడా జరగలేదు. ఇక టీడీపీతో జనసేన పొత్తుకు లోకల్ బాడీస్ ఎన్నికల్లో బీజం పడింది అని అంటారు. అది కాస్తా ముందుకెళ్ళి బాబు ఇంటికి పవన్ పవన్ కోసం బాబు అన్నట్లుగా భేటీలు వేశారు.
ఏపీలో టీడీపీని కూడా పొత్తులో కలుపుకుని పోవాలని పవన్ ఆలోచనగా ఉంది. బీజేపీకి ఆ విషయం తెలిసినా ఎందుకో టీడీపీతో కలసి వెళ్లేందుకు అంతకా ఆసక్తిని చూపించడంలేదు అని అంటారు. ఈ పరిణామాల క్రమంలో పవన్ చంద్రబాబు అరెస్ట్ నేపధ్యంలో మద్దతు ప్రకటించారు. టీడీపీ బంద్ కి జనసేన సపోర్ట్ ఇచ్చి పాలుపంచుకుంది.
లోకేష్ తో పవన్ నేరుగా ఫోన్ లో మాట్లడారు. పవన్ కి లోకేష్ ధన్యవాదాలు తెలిపోఅరు. ఈ రోజు చూస్తే రాజమండ్రిలో బస చేసిన లోకేష్ వద్దకు జనసేన ప్రతినిధులు వెళ్లి తమ సంఘీభావం తెలిపారు. ఇలా చకచకా పరిణామాలు సాగిపోతున్న వేళ జనసేన విషయంలో చాలా డౌట్లు బీజేపీకి ఉన్నాయని అంటున్నారు. అదే టైం లో బీజేపీ విషయంలో జనసేనకూ డౌట్లు ఉన్నాయని అంటున్నారు.
ఏపీ వరకూ చూస్తే బీజేపీది 2029 ప్లాన్ అని అంటారు. పవన్ ది 2024లోనే వైసీపీని దించే ప్లాన్ అంటారు. అక్కడే రెండు పార్టీలకు మధ్య గ్యాప్ వస్తోందని చెబుతారు. టీడీపీ ఓట్లే జనసేనకు బీజేపీకి కలుస్తాయని, ఆ ఓటు బ్యాంకే ఇటు టర్న్ అవుతుందన్నది బీజేపీ వాదనగా ఉందని అంటున్నారు. అయితే ముందు జగన్ని గద్దె దించితే చాలు ఆ తరువాత మిగిలిన విషయాలు అన్నది పవన్ స్ట్రాటజీ అని కూడా అంటారు.
దీంతో పవన్ బీజేపీకి మిత్రపక్షమా కాదా అన్న చింత బెంగా బీజేపీ పెద్దలకు ఏర్పడ్డాయా అన్నది ఒక చర్చగా ఉంది. ఇక బీజేపీ తనకు మిత్రుడా లేక వైసీపీకా అన్నది జనసేనలోనూ డౌట్లను రేకెత్తిస్తోంది అని కూడా అంటున్నారు. ఇలా రెండు పార్టీల మధ్య అనుమానాల మేఘాలు చాలానే ఉన్నాయి. వీటిని తొలగించుకునేందుకు తొందరలోనే రెండు పార్టీల పెద్దలు కలుస్తారు అని అంటున్నారు.
ఇక పవన్ ఢిల్లీ పెద్దల అపాయింట్మెంట్ తీసుకుని ఏపీలో యాంటీ వైసీపీ కూటమిలో ఉందామని చెబుతారని అంటున్నారు. బీజేపీ ఏపీలో తన వ్యూహం ఏంటో పవన్ కి చెబుతుందా అన్నది కూడా తేలాల్సి ఉంది. ఒకవేళ పవన్ దారిలోకి బీజేపీ వచ్చినా రావచ్చు అని అంటున్నారు. అయితే బీజేపీ దారిలోకి పవన్ మాత్రం టీడీపీని విడిచి వస్తారా అన్నది మాత్రం ఇప్పటికి మిలియన్ డాలర్ల ప్రశ్నగానే ఉంది.