పవన్ పై బీజేపీ ఆశలు పెట్టుకున్నా
తెలంగాణ ఎన్నికల రేసులో వెనుకబడ్డ బీజేపీ తిరిగి పుంజుకోవాలని చూస్తోంది. 88 నియోజకవర్గాలకు ఆ పార్టీ అభ్యర్థులను ప్రకటించేసింది.
తెలంగాణ ఎన్నికల రేసులో వెనుకబడ్డ బీజేపీ తిరిగి పుంజుకోవాలని చూస్తోంది. 88 నియోజకవర్గాలకు ఆ పార్టీ అభ్యర్థులను ప్రకటించేసింది. మరోవైపు త్వరలోనే మేనిఫెస్టో ప్రకటించేందుకు కసరత్తులు చేస్తోంది. ఇక జనసేనతో పొత్తుతో ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు రాబట్టాలని చూస్తోంది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై బీజేపీ భారీ ఆశలు పెట్టుకుంది. అందుకే ఆయనకు బీజేపీ తెలంగాణ నేతలు ఎప్పుడూ ఇవ్వనంత మర్యాద, గౌరవం ఇస్తున్నారని తెలిసింది. కానీ పవన్ తెలంగాణలో అంత ప్రభావం చూపగలరా? అన్నదే ఇప్పుడు ప్రశ్న.
ఆంధ్రప్రదేశ్ లో బీజేపీతో జనసేన ఎప్పటి నుంచో పొత్తులో ఉంది. కానీ తెలంగాణలో మాత్రం రాబోయే ఎన్నికల్లో జనసేన ఒంటరిగా పోటీ చేయాలనుకుంది. ఆ దిశగా పోటీ చేసే 32 స్థానాలతో జాబితానూ ప్రకటించింది. కానీ బీజేపీ నేతలు జనసేనతో ఈ ఎన్నికల్లోనూ పొత్తు పెట్టుకోవాలని చూశారు. ఈ విషయంపై అధిష్టానంతో చర్చించడంతో గ్రీన్ సిగ్నల్ వచ్చింది. దీంతో పవన్ తో బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి, రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్ తదితరులు హాజరై పొత్తపై చర్చించారు. జనసేనకు 9 సీట్లు ఇచ్చేందుకు పచ్చజెండా ఊపారు. పవన్ కల్యాణ్ కూడా బీజేపీ విజయం కోసం పనిచేసేందుకు సిద్ధమయ్యారు.
ఈ నెల 7న హైదరాబాద్ లో జరిగే బీసీ ఆత్మగౌరవ సభలో ప్రధాని మోదీతో కలిసి పవన్ పాల్గనబోతున్నారు. బీసీ రాగం ఎత్తుకున్న బీజేపీ ఈ ఎన్నికల్లో గెలవాలని చూస్తోంది. మరోవైపు అభిమానులతో పాటు మున్నూరు కాపుల్లోనూ పవన్ కు మంచి ఫాలోయింగ్ ఉందని, పవన్ చెబితే ఈ ఓట్లన్నీ బీజేపీకి పడతాయనే ఆశతో ఉంది. కానీ సినిమాల్లో పవన్ వేరు. రాజకీయాల్లో పవన్ వేరు. ఈ విషయం ఇప్పటికే ఏపీలో స్పష్టమైంది. దీంతో తెలంగాణలో ప్రజలు పవన్ చెబితే వింటారా? అనే ప్రశ్నలు రేకెత్తుతున్నాయి. మహా అయితే బీఆర్ఎస్ కు వచ్చే ఓట్లు చీల్చడంలో పవన్ పాత్ర ఉండే అవకాశముందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కానీ బీజేపీ గెలిపించేంత ఓటర్ల సంఖ్య తెలంగాణలో లేదు. మరి ఈ విషయాన్ని బీజేపీ అర్థం చేసుకుంటుందో లేదో చూడాలి.