చిరు ఎఫెక్ట్.. బీజేపీ ప్లాన్ ఇదా..!
మెగా నటుడు చిరంజీవికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం భారత అత్యున్నత పౌర పురస్కారాల్లో రెండోదై న పద్మవిభూషణ్‌ను ప్రకటించింది
మెగా నటుడు చిరంజీవికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం భారత అత్యున్నత పౌర పురస్కారాల్లో రెండోదై న పద్మవిభూషణ్‌ను ప్రకటించింది. అయితే.. తొలుత ఈ విషయంలో అందరూ సంబర పడ్డారు. మంచి నటుడు.. సుదీర్ఘకాలంగా తెరపై ప్రేక్షకులను అలరిస్తున్న, స్వయం కృషితో పైకివచ్చిన హీరోకు సమున్నత గౌరవం లభించిందని అన్ని వర్గాలూ భావించాయి.అయితే.. రాను రాను.. ఈ విషయంలో బీజేపీ అసలు ఉద్దేశం బయటకు వచ్చిందని పరిశీలకులు చెబుతున్నారు.
తాజాగా కేంద్ర మంత్రి, బీజేపీ సీనియర్ నేత గంగాపురం కిషన్ రెడ్డి.. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ.. తెలంగాణకు కేంద్రం ఎంత ప్రాధాన్యం ఇస్తోందో.. ఈ అవార్డులు నిరూపిస్తున్నాయని చెప్పారు. ఈ వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకున్నాయి. తెలంగాణలో చిరు పద్మవిభూషణ్‌తో పాటు మరో ఇద్దరికి పద్మశ్రీ అవార్డులు వరించాయి. దీనివెనుక... వచ్చే పార్లమెంటు ఎన్నికలు ఉన్నాయనేది విశ్లేషకులు తాజాగా అంచనా వేస్తున్నారు.
పార్లమెంటు ఎన్నికలను ప్రభావితం చేస్తూ.. తెలంగాణ సమాజంలో బీజేపీని మరింత విస్తరించే వ్యూహం లో భాగమేదైనా ఉండి ఉంటుందని అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. మరోవైపు.. గత రెండు రోజుల నుంచి బీజేపీ కాబట్టి.. చిరును గుర్తించిందని, అదే కాంగ్రెస్ అయితే.. అవార్డులను అమ్ముకునేదని కూడా బీజేపీ నేతలు అంతర్గత చర్చల్లో అభిప్రాయపడుతున్నారు. గతంలో కాంగ్రెస్ కీలక నాయకురాలు ప్రియాంక గాంధీ ఓ పారిశ్రామిక వేత్తకు పద్మశ్రీ అవార్డును విక్రయించేందుకు సిద్ధపడిన వ్యవహారాన్ని వారు తెరమీదికి తెస్తున్నారు.
అంటే.. పార్లమెంటు ఎన్నికలకు ముందు.. చిరుకు పద్మవిభూషణ్ ప్రకటించడం ద్వారా.. తెలంగాణ సమాజంలో బీజేపీకి సానుకూల సంకేతాలు వెతుక్కుంటున్నారనే వాదనకు ఈ విమర్శలు బలాన్ని చేకూరుస్తున్నాయి. వాస్తవానికి, చిరు వంటి బలమైన నటుడికి పద్మవిభూషణ్ అవార్డును ఇవ్వడం సహజంగానే కేంద్రంపై సానుకూలత ఏర్పడేలా చేస్తుంది. దీనికి ఇప్పుడు రాజకీయ తొడుగు కూడా జోడించడం వెనుక పూర్తిస్థాయిలో దీనిని తమకు అనుకూలంగా మలుచుకునేందుకు బీజేపీ ప్రయత్నిస్తున్నదా? అనే సందేహాలకు కిషన్ రెడ్డి వ్యాఖ్యలు మరింత బలం చేకూరుస్తున్నాయని పరిశీలకులు చెబుతున్నారు.