అన్నంటూ.. ఆశీర్వదించమంటూ.. సీనియర్ సీఎం టికెట్ తిప్పలు

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి రానున్న ఐదు రాష్ట్రాల ఎన్నికలు సెమీఫైనల్స్ వంటివి.

Update: 2023-10-08 12:35 GMT

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి రానున్న ఐదు రాష్ట్రాల ఎన్నికలు సెమీఫైనల్స్ వంటివి. అందులోనూ వచ్చే ఏడాది లోక్ సభ ఎన్నికల ముంగిట ఈ రాష్ట్రాల్లో పరాజయం పాలైతే ఇక అంతే.. కర్ణాటకలో అద్భుత విజయం సాధించి తెలంగాణలోనూ అధికారం దిశంగా దూకుడుగా వెళ్తూ.. ప్రతిపక్షాలను ఇండియా పేరిట కూటమి కింద తీసుకొస్తున్న కాంగ్రెస్ ను ఎదుర్కొంటూ అసెంబ్లీ ఎన్నికలను నెగ్గడం అంత ఈజీ కాదని బీజేపీ పెద్దలకు మరీ ముఖ్యంగా ప్రధాని మోదీ అవగతం అయినట్లుంది. అందుకే కాలికి బలపం కట్టుకుని ఎన్నికల రాష్ట్రాలను చుట్టేస్తున్నారు.

కనీసం రెండు నెగ్గితేనే..

తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ గఢ్, మిజోరం రాష్ట్రాలకు నేడో రోపో అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. దీనికితగ్గట్లుగా ఇప్పటికే కసరత్తు పూర్తయింది కూడా. పార్టీల పరంగా చూస్తే బీజేపీ మాత్రం ఈ రాష్ట్రాల్లో ముఖ్యంగా మధ్యప్రదేశ్, ఛత్తీస్ గడ్, రాజస్థాన్ లో ఎటువంటి చాన్స్ తీసుకునేందుకు ఇష్టపడడం లేదు. ప్రధాని మోదీనే నేరుగా రంగంలోకి దిగి పర్యవేక్షిస్తున్నారు.

ఆ సీనియర్ సీఎం కష్టాలు మామూలుగా లేవు

బీజేపీ సీఎంలలో అత్యంత సీనియర్ శివరాజ్ సింగ్ చౌహాన్. మధ్యలో కొంతకాలం తప్ప మధ్యప్రదేశ్ లో దాదాపు 15 ఏళ్లుగా ఆయనే ముఖ్యమంత్రిగా ఉన్నారు. 2018లో ఓటమి పాలైనప్పటికీ దొడ్డిదారిన అధికారం దక్కించుకున్న బీజేపీ.. శివరాజ్ పైనే విశ్వాసం ఉంచింది. కానీ, ఈ ఎన్నికల్లో రెండు జాబితాలు విడుదల చేసినప్పటికీ ఆయనకు టికెట్ మాత్రం ఇవ్వలేదు.

పోటీలో నిలపనట్టేనా?

పరిస్థితులు చూస్తుంటే శివరాజ్ ను బీజేపీ పోటీలో దించే ఆలోచనలో లేనట్లు కనిపిస్తోంది. మోదీనే నేరుగా రెండు సార్లు రాష్ట్ర పర్యటనకు వచ్చినా ఆయనకు పెద్దగా ప్రాధాన్యం ఇచ్చినట్లు కనిపించడం లేదు.

వేదన చెబుతూ.. వేడుకుంటూ..

బీజేపీలో అత్యంత సీనియర్ సీఎం అయిన శివరాజ్ కు పరిస్థితులు అర్థమైనట్లున్నాయి. దీంతో ఇటీవల ఆయన వ్యవహార శైలిలో మార్పు వచ్చింది. నేను మీ అన్నను.. ఈసారి నేను లేకుంటే మంచి అన్నను మిస్ అవుతారు అంటూ మహిళల వద్ద వ్యాఖ్యానించారు. సాధువుల దగ్గరికి వెళ్లి ఆశీర్వదించమని కోరారు. నేను మళ్లీ సీఎం అవుతానా? అంటూ ఓ సభలో ప్రజలను ప్రశ్నించారు. ఇది ఆయన ఉన్న స్థితికి అద్దం పడుతోందని విశ్లేషకులు పేర్కొంటున్నారు.

కొసమెరుపు: శివరాజ్ 2018కి ముందు పాలనా పరంగా మంచి మార్కులే దక్కించుకున్నారు. కానీ, ఈ విడతలో అంతా రివర్స్ అయింది. అత్యాచారాలు, దళితులపై దాడులు, పాలనా వైఫల్యాలతో శివరాజ్ సర్కారు అప్రదిష్ఠ పాలైంది. ఈ నేపథ్యంలోనే ఆయనను పక్కకు పెట్టినట్లు తెలుస్తోంది. మరి మూడో జాబితాలోనైనా శివరాజ్ కు టికెట్ దక్కుతుందా?

Tags:    

Similar News