గంటా సీటుకు బీజేపీ ఫిట్టింగ్...!?
అలాగే పార్టీ కూడా మారుస్తారు అని ఉన్నా 2019లో మాత్రం ఆయన పార్టీ మారకుండానే పోటీ చేసి గెలిచారు.
విశాఖ జిల్లాకు చెందిన మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుకు ఇపుడు సీటు సమస్య వచ్చి పడింది అని అంటున్నారు. ఆయన 2019 ఎన్నికల్లో విశాఖ ఉత్తరం నియోజకవర్గం నుంచి జగన్ వేవ్ లో సైతం గెలిచారు. అలా ఓటమి ఎరగని వీరుడు అనిపించుకున్నారు. అయితే గంటా రాజకీయ చరిత్రలో ప్రతీ సారి సీటు మార్చి పోటీ చేస్తారు అని పేరుంది. అలాగే పార్టీ కూడా మారుస్తారు అని ఉన్నా 2019లో మాత్రం ఆయన పార్టీ మారకుండానే పోటీ చేసి గెలిచారు.
ఇక ఈసారి సీటు కూడా మార్చకుండా విశాఖ ఉత్తరం నుంచి పోటీ చేయాల్సి వస్తోంది. అయితే దానికి కూడా కొన్ని కండిషన్లు అప్లై అవుతున్నాయి. గంటా సీటు పొత్తులో పోకుండా ఉంటేనే ఆయన పోటీ చేయగలుగుతారు. నిజానికి గంటా మనసు భీమునిపట్నం మీద ఉంది. అయితే ఆ సీటు జనసేనకు కన్ ఫర్మ్ అని తేలిపోతోంది. దాంతో గంటాకు సిట్టింగ్ సీటే మిగిలింది.
అయితే చివరి నిముషంలో బీజేపీతో కనుక పొత్తు ఉంటే విశాఖ ఉత్తరం ఆ పార్టీకి ఇవ్వాల్సి ఉంటుంది. అపుడు గంటాకు సీటే లేకుండా పోతుంది. ఇక గంటా సెకండ్ ఆప్షన్ కింద అనకాపల్లి కోరుకుంటున్నారు. కానీ అది గవర సామాజికవర్గానికి కేటాయించారు అని తెలుస్తోంది. పైగా అక్కడ మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద్, మాజీ ఎమ్మెల్సీ బుద్దా నాగ జగదీశ్వరరావుల మధ్య పోటీ నడుస్తోంది.
ఏ విధంగా చూసినా గంటాకు విశాఖ ఉత్తరం సీటు తప్ప మరోటి కనిపించడంలేదు. పొత్తుకు బీజేపీ నో అంటే మాత్రం గంటా అక్కడ నుంచే పోటీ చేయడం ఖాయం అని అంటున్నారు. ఇక బీజేపీతో పొత్తు కుదిరితే మాత్రం మాజీ ఎమ్మెల్యే బీజేపీ నేత విష్ణు కుమార్ రాజు పోటీ చేస్తారు అని అంటున్నారు. అపుడు గంటాను విశాఖ ఎంపీగా పోటీ చేయిస్తారు అని అంటున్నారు.
నిజానికి గంటాను 2019 ఎన్నికల్లోనే విశాఖ ఎంపీగా పోటీ చేయమని చంద్రబాబు కోరినట్లుగా ప్రచారం సాగింది. ఇపుడు అయినా అది జరగబోతోంది అని అంటున్నారు. దాని వల్ల గంటా విశాఖ పార్లమెంట్ పరిధిలోని అసెంబ్లీ సీట్లలో కూడా పార్టీ గెలుపునకు కృషి చేస్తారని, అంగబలం అర్ధబలం తోడు అవుతుందని టీడీపీ ఆలోచిస్తోంది.
రేపటి రోజున టీడీపీ జనసేన కూటమి అధికారంలోకి వస్తే జనసేనకు విశాఖ జిల్లా నుంచి మంత్రి వర్గంలో చాన్స్ ఇచ్చేందుకు కూడా అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు. మొత్తానికి గంటా రాజకీయ జాతకం బీజేపీ మీద ఆధారపడి ఉందని అంటున్నారు. మరో వైపు చూస్తే గంటాతో పాటుగా బాలయ్య చిన్నల్లుడు శ్రీభరత్ జాతకం కూడా ఆధారపడి ఉంది అని అంటున్నారు. బీజేపీ పొత్తు ఉంటే ఎంపీ ఆశలు రెండు విధాలుగానూ శ్రీభరత్ కి ఇబ్బంది అంటున్నారు. బీజేపీకి ఎంపీ సీటు పోవచ్చు. లేకపోతే గంటాకు ఇవ్వవచ్చు. సో ఎలా చూసుకున్నా శ్రీభరత్ కి కూడా బీజేపీయే ట్విస్ట్ ఇచ్చేలా ఉంది అని అంటున్నారు.