వలస నేతలే దిక్కా ?

రాబోయే ఎన్నికల్లో తెలంగాణాలో అధికారంలోకి వచ్చేస్తుందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చాలా గొప్పగా ప్రకటించారు

Update: 2023-08-28 05:24 GMT

రాబోయే ఎన్నికల్లో తెలంగాణాలో అధికారంలోకి వచ్చేస్తుందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చాలా గొప్పగా ప్రకటించారు. బహిరంగసభల్లో వంద మాట్లాడుతారు. కానీ అందులో ఎన్ని నిజాలుంటాయన్నదే అసలు పాయింట్. ఇపుడు అమిత్ షా కూడా ఖమ్మం బహిరంగసభలో చాలామాటలు మాట్లాడిన తర్వాత నేతలకు దిశానిర్దేశం చేశారు. ఇంతకీ ఆయన చెప్పిందేమంటే బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలకు గాలమేయమన్నారు. పై రెండుపార్టీల్లో బలంగా ఉన్నవాళ్ళతో టచ్ లోకి వెళ్ళాలట.

ఎలాగైనాసరే గట్టి నేతలు అనుకున్న వాళ్ళని బీజేపీలోకి లాక్కోవాలట. బీఆర్ఎస్, కాంగ్రెస్ అసంతృప్తనేతల మీద దృష్టి సారించమన్నారు. మజ్లిస్, కాంగ్రెస్ తో పాటు బీఆర్ఎస్ పార్టీల ఎత్తుగడలపైన నిరంతరం దృష్టిపెట్టమన్నారు. తెలంగాణా అభివృద్ధికి కేంద్రం ఇచ్చిన నిధుల విషయాన్ని చెప్పాలట. అలాగే తెలంగాణా అభివృద్ధి కాకపోవటానికి బీఆర్ఎస్ ఏ విధంగా కారణమో కూడా వివరించాలని చెప్పారు. హోలు మొత్తం మీద అమిత్ షా చెప్పింది ఏమిటయ్యా అంటే బీజేపీకి వలసనేతలే దిక్కని.

పార్టీలోని సీనియర్ నేతలు తమ మధ్య విభేదాలను పక్కనపెట్టి కేసీయార్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటాలు చేయాలన్నారు. సీనియర్లంతా ఏకతాటి పైకి చేరుకుని పార్టీని నడిపించాలని ఆదేశించారు. అంతా బాగానే ఉందికానీ ఖమ్మం బహిరంగసభలో అమిత్ షా మాట్లాడుతు రాబోయేది బీజేపీ ప్రభుత్వమే అని చెప్పటమే విచిత్రంగా ఉంది. ఒకవైపు వలస నేతలే దిక్కని చెబుతునే మరోవైపు రాబోయేది బీజేపీ ప్రభుత్వమే అని చెప్పటం ఏమిటో ?

ఇతర పార్టీల నుండి గట్టినేతలు బీజేపీలో చేరకపోతే 119 నియోజకవర్గాల్లో పోటీకి గట్టి నేతలు అన్నీచోట్లా దొరకరు. బీజేపీ ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్యిదే. అధికారంలోకి వచ్చేస్తామని ఒకటే ఊదరగొడుతున్న పార్టీకి అన్నీ నియోజకవర్గాల్లో గట్టి అభ్యర్ధులు లేరు. పోటీచేయటానికే గట్టి అభ్యర్ధులు లేని పార్టీ అధికారంలోకి ఎలా వచ్చేస్తుంది ? అమిత్ షా పైకి చెప్పకపోయినా మామూలు జనాలకు కూడా తెలుసు బీజేపీ క్షేత్రస్ధాయి బలమేమిటో. కాకపోతే స్వయంగా అమిత్ షా నే ఇతర పార్టీల్లోని బలమైన నేతలకు గాలమేయండి, లాక్కోండని చెప్పటమే ఆశ్చర్యంగా ఉంది.

Tags:    

Similar News