నాలుగో విడతలో బీజేపీ భవిత !
ఇక ఇప్పటిదాకా చూసుకుంటే కనుక మూడు విడతల్లో 280 సీట్లకు పోలింగ్ జరిగింది. నాలుగవ విడతను కలుపుకుటే 376 ఎంపీ సీట్లకు పోలింగ్ పూర్తి అయినట్లు అన్న మాట.
దేశంలో ఇప్పటిదాకా మూడు దశల పోలింగ్ ముగిసింది. నాలుగవ దశ మే 13న జరుగుతోంది. ఈ దశలో కేంద్రంలో ఎవరికి అధికారం దక్కుతుంది అన్నది సూచనాప్రాయంగా తేలిపోనుంది అని అంటున్నారు. నాలుగవ విడతలో 96 ఎంపీ సీట్లకు పోలింగ్ నిర్వహించనున్నారు.
ఇక ఇప్పటిదాకా చూసుకుంటే కనుక మూడు విడతల్లో 280 సీట్లకు పోలింగ్ జరిగింది. నాలుగవ విడతను కలుపుకుటే 376 ఎంపీ సీట్లకు పోలింగ్ పూర్తి అయినట్లు అన్న మాట. దేశంలో మొత్తం 543 స్థానాలలో ఈ నంబర్ తీసుకుంటే సగానికి పైగా అని లెక్క తేలుతోంది. దాంతో ఈ మెజారిటీ సీట్లలో ఎవరికి ఎక్కువ ఊపు ఉంది, ఎవరికి ఎక్కువ నంబర్ తో సీట్లు దక్కనున్నాయి అన్నది ఒక విశ్లేషణ గా ఉంది.
ఈసారి ఉత్తరాదిన బీజేపీకి ఊపు తగ్గిందని తాము ఎక్కువ సీట్లు గెలవబోతున్నామని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. అదే టైం లో ఇప్పటి వరకు ఎన్నికలు జరిగిన స్థానాల్లో తమకు 200 వస్తాయని బీజేపీ చెబుతోంది. కేంద్ర హోం మంత్రి అమిత్‌షా స్వయంగా మాట్లాడుతూ తమదే విజయం అని అంటున్నారు. మొత్తం సీట్లకు ఎన్నికలు పూర్తయితే బీజేపీకి 320 నుంచి 350 వరకు సీట్లు వస్తాయని కమలం పార్టీ భావిస్తోంది.
అయితే బీజేపీ సొంతంగా 370 ఎంపీ సీట్లు అని పెట్టుకున్న లక్ష్యానికి ఈ నంబర్ దూరంగా ఉంది. మరో వైపు పదేళ్ల పాటు దేశాన్ని పాలించిన బీజేపీ పట్ల జనంలో వ్యతిరేకత ఉంటుందని అంటున్నారు. యాంటీ ఇంకెంబెన్సీ వల్ల 2019లో బీజేపీకి వచ్చిన 306 సీట్లకు గానూ ఇంకా పదో ఇరవయ్యో లేకపోతే మరింత ఎక్కువగానో కోత పడతాయని కాంగ్రెస్ అంతోంది.
కానీ బీజేపీ ధీమా చూస్తే కనుక హ్యాట్రిక్ సక్సెస్ తమదేనని అంటోంది. ఈ ఎన్నికల్లో సొంతంగా బీజేపీకే 350 సీట్లు ఖాయమని లెక్కలు వేసుకుంటోంది. ఇండియా కూటమి పటిష్టమైన ప్రచారాన్ని చేయలేకపోతోంది అన్నది కమలనాధులకు ఉన్న ఆలోచన. కేవలం రాహుల్ గాంధీనే నమ్ముకుని ఆ కూటమి ఉందని భావిస్తోంది. దాంతో ఇండియా కూటమి జనాలకు చేరువ కాలేదని అంటోంది.
పైగా ఇండియా కూటమిలో పైకి ఉన్నంతగా పరిస్థితి లోపల లేదని బీజేపీ భావిస్తోంది. అక్కడ అంతా ప్రధాని అభ్యర్ధులే అంటోంది. ఇండియా కూటమి నుంచి పెద్ద తలకాయలుగా చెప్పుకునే తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతాబెనర్జీ, ఎన్‌సీపీ చీఫ్ శరద్‌పవార్ ప్రధాని పదవి రేసులో ఉన్నారు. అలాగే మరింత మంది కొత్త నేతలు పోటీ పడినా పడతారు అని అంటున్నారు. అందుకే ప్రధాని మోడీ ఏడాదికో ప్రధానిని చేస్తారా అసలు మీ కూటమి ప్రధాని అభ్యర్ధి ఎవరు అని కూడా ప్రశ్నిస్తున్నారు.
బీజేపీ విషయం చూసుకుంటే ఉత్తరాది పట్టు జారదని దానికి అదనంగా కేరళ, తమిళనాడులో కూడా సీట్లు వస్తాయని చెబుతున్నారు. పైగా పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. మరోసారి నమో మంత్రం ఫలిస్తుందని మోడీ ఇమేజ్ తోనే ఈసారి బంపర్ విక్టరీ కొడతామని బీజేపీ ధీమాగా చెబుతోంది. కమలం పార్టీ అంచనాలు ఏ మేరకు నిజం అవుతాయన్నది చూడాల్సిందే. అయితే ఆశలకు వాస్తవానికి తేడా ఏమైనా కనిపిస్తే మాత్రం తేడా పార్టీ అని చెప్పుకునే బీజేపీకి అసలైన ఇబ్బందులు ఎదురవుతాయని అంటున్నారు.
నాలుగవ విడత కమల వికాసమా లేక మరోటా అన్నది సూచనాప్రాయంగా తెలియచేస్తుంది అని అంటున్నారు. ఇక మరో మూడు విడతల ఎన్నికలు ఉన్నా 170 కంటే తక్కువ ఎంపీ సీట్లే ఉండడంతో మెజారిటీ ఎవరిది అన్నది మే 13తో ఎంతో కొంత తెలిసిపోతుంది అని అంటున్నారు.