తన వేలితో తన కన్ను.. ఆప్ విషయంలో బీజేపీ అత్యుత్సాహం!
ఆప్ రాజ్యసభ సభ్యురాలు.. స్వాతి మాలీవాల్. ఆమె ఒక పనిపై సీఎం కేజ్రీవాల్ కార్యాలయానికి వెళ్లారు.
తన వేలితో తన కన్నునే పొడుచుకునేలా చేయడం రాజకీయాల్లో ఇప్పుడు సరికొత్త విద్య. తమ చేతికి మట్టి అంటకుండా చేయడం.. ప్రత్యర్థి పార్టీని సాధ్యమైనంత మేరకు డైల్యూట్ చేయడం అనేది.. జాతీ య పార్టీ బీజేపీ చేస్తున్న ప్రయత్నం. ప్రస్తుతం పార్లమెంటు ఎన్నికలు జరుగుతున్నాయి. పైగా దేశరాజధాని ఢిల్లీలోని7 పార్లమెంటు స్థానాలు బీజేపీకి కీలకంగా మారాయి. ఈ నేపథ్యంలో తమకు బలమైన ప్రత్యర్థిగా ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీని ఎలాగైనా దెబ్బకొట్టాలనేది బీజేపీ వ్యూహం.
ఈ క్రమంలో ఏం జరిగిందో ఏమో.. కూడా తెలియని ఒక విషయాన్ని తాటికాయం పెద్దది చేసి.. ఆమ్ ఆద్మీ పార్టీ మహిళలను కించ పరుస్తోందని.. ఆ పార్టీకి మహిళలంటే లోకువని.. చెప్పడం ద్వారా.. ప్రచారం చేయడం ద్వారా ఆప్ ఓటు బ్యాంకును ఛిన్నాభిన్నం చేయాలనే దిశగా కమల నాథులు ప్రయత్నం చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ పరిణామాలను గమనిస్తున్నవారు.. ఇంత రాజకీయం అవసరమా? అని చర్చించుకుంటున్నారు.
ఏం జరిగింది?
ఆప్ రాజ్యసభ సభ్యురాలు.. స్వాతి మాలీవాల్. ఆమె ఒక పనిపై సీఎం కేజ్రీవాల్ కార్యాలయానికి వెళ్లారు. అయితే.. అక్కడ సీఎం వ్యక్తిగత సహాయకుడు బిభవ్ తనను కొట్టాడని.. తాను నెలసరి సమయంలో ఉన్నానని చెప్పినా వినకుండా చేయి చేసుకున్నాడని.. చెప్పుకోలేని చోట కాలితో తన్నాడన్నది ఆమె ఆరోపణ.
అయితే.. వాస్తవానికి దీనిపై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణ కూడాసాగుతోంది. కోర్టు జోక్యంతో బాధితురాలైన ఎంపీకి ఆరోగ్య పరీక్షలు కూడా చేశారు. ఇది పూర్తిగా ఆప్ వ్యక్తిగత వ్యవహారం. పైగా ఆ పార్టీ సభ్యురాలే కావడం గమనార్హం. పోనీ ఆమె పార్టీ మారిందా.. అంటేఅదీ లేదు.
కానీ.. ఎన్నికల వేళ కావడంతో బీజేపీ దీనిని తనకు అనుకూలంగా మార్చేసుకుంది. అనుకూల మీడియా లో పదే పదే ప్రచారం చేస్తూ.. కేంద్ర మంత్రుల నుంచి కీలక నేతల వరకు స్వాతి విషయాన్ని తెరమీదికి తెస్తున్నారు. ఆప్‌కు మహిళలంటే వాల్యూ లేదని.. సొంత ఎంపీనే కొట్టారంటూ ప్రచారం చేస్తున్నారు. అయితే.. వాస్తవానికి ఇది ఆప్ వ్యవహారం.. మహిళలపై నిజమైన ప్రేమ ఉంటే.. బాక్సర్లను వేధించిన బీజేపీ నాయకుడు బ్రిజ్‌భూషణ్‌పై ఇప్పటి వరకు ఎందుకు చర్యలు తీసుకోలేదు? అన్నది ప్రశ్న. అంతేకాదు.. మణిపూర్ ఘర్షణల్లో అబలలపై జరిగిన దాడుల విషయాన్ని ఎందుకు పట్టించుకోలేదన్నది మరో ప్రశ్న. ఏదేమైనా.. ఆప్‌విషయంలో తన చేతితో తన కన్నును పొడిపించే దిశగా బీజేపీ అడుగులు వేయడం గమనార్హం.