గెలుపుఓటములతో సంబంధం లేకుండా పలానా నేత ప్రత్యర్ధులకు ధీటైన పోరాటం చేయగలరు అనిపించేంత స్ధాయిలో ఎంతమంది నేతలున్నారు బీజేపీలో. ఇపుడిదే టాక్ ఆఫ్ ది స్టేట్ గా మారింది. ఎందుకంటే కొత్త అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి మాట్లాడుతు ప్రజలతో కలిసి నడిస్తేనే పార్టీకి ఆదరణన్నారు. అందరం కలిసి పోరాడి పార్టీని బలోపేతం చేయాలని పిలుపిచ్చారు. ఐదారునెలల్లోనే పార్టీని బలోపేతం చేసి ఎన్నికలకు వెళదామన్నారు. పొత్తుల గురించి ఎవరు మాట్లాడవద్దన్నారు. అందరు కలిసి పోరాటాలు చేయటం ద్వారా పార్టీని బలోపేతం చేయాలన్నారు.
అంతా బాగానే ఉంది కానీ పార్టీలో పోరాటాలు చేసేంత సీనున్న నేతలు ఎంతమందున్నారు ? అన్నదే అసలైన ప్రశ్న. ఎప్పుడో ఒకసారి కలెక్టరేట్ల ముందు కాసేపు కూర్చుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలిచ్చి, ఫొటోలు, వీడియోలు అయిపోగానే లేచి వెళ్ళిపోయే నేతలే ఎక్కువగా ఉన్నారు. అందుకనే బీజేపీలో కార్యకర్తలు తక్కువ నేతలు ఎక్కువని సెటైర్లు పేలుతుంటాయి.
నేతలు అనుకుంటున్న వాళ్ళలో ఎక్కువమంది టీవీ చానళ్ళల్లో డిబేట్లు, మీడియా సమావేశాలు, ఎయిర్ పోర్టుల్లో ప్రముఖుల రిసీవింగ్, సెండాఫ్ ఇచ్చేటపుడు మాత్రమే కనబడుతుంటారు.
తొమ్మిదేళ్ళుగా కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్నా ఏపీలో పార్టీ ఎందుకు బలపడలేదో పురందేశ్వరికి తెలీదా ? అంతెందుకు పార్టీ బలోపేతానికి పురందేశ్వరి చేసిన ప్రయత్నం ఏముంది ? మహిళా మోర్చా జాతీయ ఉపాధ్యక్షురాలి హోదాలో రాష్ట్రంలో రెండు సమావేశాలైనా నిర్వహించారా ? ప్రభుత్వానికి వ్యతిరేకంగా అమెంతట ఆమెగా మహిళా మోర్చా ఆధ్వర్యంలో ఏమైనా పోరాటాలు చేశారా ?
అధ్యక్షురాలయ్యారు కాబట్టి రాష్ట్ర పార్టీ గురించి మాట్లాడుతున్నారంతే. లేకపోతే ఎంతసేపు ఢిల్లీలో కూర్చునే వారంతే కదా. రాష్ట్రానికి ఎప్పుడు వచ్చినా పార్టీ మీటింగుల్లో పాల్గొనటం, మీడియా సమావేశాల్లో ప్రభుత్వంపై ఆరోపణలు, విమర్శలు చేసి వెళ్ళిపోయేవారంతే.
మీడియాతో మాట్లాడేస్తే పార్టీ బలోపేతమైపోతుందా ? ఎన్నికలకు ఐదారు నెలలే ఉందని చెబుతున్న పురందేశ్వరి పోరాటాలు పక్కన పెట్టి ముందు 175 నియోజకవర్గాల్లో పోటీ చేయగలిగిన అభ్యర్థులను గుర్తిస్తే అదే చాలా ఎక్కువ.