రెబెల్స్‌కు పదవులు... మోడీ ప్లాన్ వర్కవుట్ అయ్యేనా
తెలంగాణ రాష్ట్రంలో నేడో రేపో ఎన్నికల షెడ్యూల్ విడుదల అవుతుందనే రీతిలో ఇటు అధికార యంత్రాంగం అటు రాజకీయ పార్టీలు సన్నద్ధం అవుతున్న సంగతి తెలిసిందే.
తెలంగాణ రాష్ట్రంలో నేడో రేపో ఎన్నికల షెడ్యూల్ విడుదల అవుతుందనే రీతిలో ఇటు అధికార యంత్రాంగం అటు రాజకీయ పార్టీలు సన్నద్ధం అవుతున్న సంగతి తెలిసిందే. అన్ని పార్టీలు తమతమ ఎత్తుగడలతో సిద్ధమవుతున్నాయి. అయితే తెలంగాణలో సత్తా చాటుకోవాలని భావిస్తున్న బీజేపీని అసంతృప్తి నేతల కుంటటి బాధిస్తోంది. ఇలాంటి తరుణంలో బీజేపీ పెద్దలు కీలక నిర్ణయం తీసుకున్నారు. పార్టీ పట్ల నారాజ్ అయిన నేతలందరికీ దాదాపు ఏదో ఒక పదవి కట్టబెడుతూ నిర్ణయం తీసుకుంది. అయితే, ఈ చర్య ఫలితం ఎంతమేరకు ఇస్తుందని పలువురు చర్చించుకుంటున్నారు.
బీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరిన ఈటల రాజేందర్‌కు బీజేపీ పెద్దలు ప్రాధాన్యత ఇవ్వడం బీజేపీలోని కొందరు నేతలకు నచ్చట్లేదని అంటున్నారు. మాజీ ఎంపీలు కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, జి.వివేక్ వెంకటస్వామి, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, విజయశాంతి, జి.విజయరామారావుతో పాటు పలువురు నేతల పేర్లు ఈ జాబితాలో వినిపిస్తున్నాయి. అసంతృప్త నేతలంతా తరచూ రహస్య సమావేశాలు నిర్వహించడంతో బీజేపీ పెద్దలు కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. వారందరికీ తలా ఓ పదవి అప్పజెప్పారు. తద్వారా పార్టీ పనుల్లో బిజీ అయ్యేలా చేశారు.
బీజేపీ వ్యూహకర్త బీఎల్ సంతోష్ నేతృత్వంలో జరిగిన సమావేశంలో తాజాగా ఎన్నికల కమిటీలను నియమిస్తూ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. తెలంగాణను మొత్తం ఆరు జోన్లుగా విభజించుకొని మొత్తం పద్నాలుగు కమిటీలను బీజేపీ నియమించింది. ఒక్కో జోన్ కు ఒక్కో నేతను నియమించి పార్లమెంట్, శాసన సభ నియోజక వర్గాల వారీగా కీలక నేతలకు బాధ్యతలను అప్పగించారు. కీలకమైన మేనిఫేస్టో కమిటీ ఛైర్మన్ గా వివేక్ వెంకట స్వామి, కన్వీనర్ గా మహేశ్వర్ రెడ్డి, జాయింట్ కన్వీనర్ గా కొండా విశ్వేశ్వర్ రెడ్డిని నియమించింది. స్క్రీనింగ్ కమిటీ ఛైర్మన్ గా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, పబ్లిక్ మీటింగ్స్ కమిటీ ఛైర్మన్ గా బండి సంజయ్, నిరసనల కమిటీ ఛైర్మన్ గా విజయశాంతి, ఛార్జ్‌షీట్ కమిటీ ఛైర్మన్ గా మురళీధరరావుని నియమించింది.
త్వరలో జరగబోయే ఎన్నికల్లో ఎలాంటి వ్యూహాలు పన్నాలి, మేనిఫెస్టో రూపకల్పన, బహిరంగ సభల నిర్వహణ, పబ్లిసిటీ, నిరసనల వంటి కార్యక్రమాలను ఈ కమిటీలు చేపట్టనున్నాయి. అయితే, ఇందులో పదవులు దక్కిన నేతలు ఎంత మేరకు పార్టీకి సహకరిస్తారు? ఎంత మేరకు వారికి నిర్దేశించిన పనులను చేస్తారు అనేది తేలాలంటే... ఎదురుచూడాల్సిందే.