ఒకటికి నాలుగు పేర్లు.. అక్కడ సీఎం ఎవరో? ఎల్లుండే డెడ్ లైన్
ధర్మేంద్ర ప్రధాన్.. జుయల్ ఓరమ్.. సంబిత్ పాత్రా.. జయంత్ పాండా.. ఇంకా చెప్పుకొంటూ పోతే నాలుగైదు పేర్లు వినిపిస్తున్నాయి
ధర్మేంద్ర ప్రధాన్.. జుయల్ ఓరమ్.. సంబిత్ పాత్రా.. జయంత్ పాండా.. ఇంకా చెప్పుకొంటూ పోతే నాలుగైదు పేర్లు వినిపిస్తున్నాయి. కానీ, ఏదీ ఫైనల్ కాదు.. మరోవైపు డెడ్ లైన్ దగ్గరపడుతోంది. ఇప్పటికే కొత్త ప్రభుత్వ ఏర్పాటు ఓసారి వాయిదా పడింది. మరొక్క రెండు రోజులు కూడా సమయం లేదు. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్రంలో తొలిసారి ప్రభుత్వం నెలకొల్పనున్న పార్టీ నిర్ణయం ఏమిటో వెల్లడి కావడం లేదు.
తొలిసారి గెలుపు.. ఎంపిక కష్టం..
తూర్పు భారత దేశానికి తొలి మెట్టయిన ఒడిసాను 25 ఏళ్లు నిరంతరం పాలించారు బిజూ జనతాదళ్ అధినేత నవీన్ పట్నాయక్. 77 ఏళ్ల వయసులో ఇటీవలి ఎన్నికల్లో ఆయన పార్టీ పరాజయం పాలైంది. 147 సీట్లున్న ఒడిసాలో బీజేపీ 78 సీట్లలో నెగ్గింది. కనీస మెజారిటీకి ఇది నాలుగు సీట్లు ఎక్కువే. బీజేడీ 51 స్థానాలతో సరిపెట్టుకుంది.
వారమైనా తేల్చలేదు..
అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చి వారం అవుతున్నా.. ఇప్పటికీ ఒడిసాలో బీజేపీ తరఫున సీఎం అయ్యేది ఎవరో తేలలేదు. సీఎం, మంత్రుల ప్రమాణ స్వీకారోత్సవానికి తొలుత సోమవారమే ముహూర్తం పెట్టారు. కానీ, బుధవారానికి వాయిదా వేశారు. కేంద్రంలో మోదీ ప్రభుత్వం ఏర్పాటులో తీరకలేకుండా ఉండడంతో ఒడిశాలో ప్రమాణ స్వీకారాన్ని వాయిదా వేసినట్లు చెప్పారు. కాగా, మంగళవారం ఒడిశా బీజేపీ శాసనసభా పక్ష సమావేశం కానుంది. 12న కొత్త ప్రభుత్వం ప్రమాణం చేయాల్సి ఉంది.
పూరి దేవుడికి ‘పూజారి’
ఒడిసా సీఎంగా ధర్మేంద్ర ప్రధాన్ పేరు బాగా వినిపించింది. బీజేడీ ప్రభుత్వాన్ని కూలదోయడంలో ఆయనదే కీలక పాత్ర. కానీ, ప్రధాన్ ను మరోసారి కేంద్ర మంత్రి చేశారు. జుయల్ ఓరమ్ కూ పదవి దక్కింది. బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్రా కంటే కూండా సీనియర్ నాయకుడు, ఎమ్మెల్యేగా ఎన్నికైన సురేశ్ పూజారి ముందంజలో ఉన్నారు.
25 ఏళ్ల తర్వాత కొత్త సీఎం
1999 నుంచి ఒడిసా సీఎం అంటే.. నవీన్ పట్నాయక్ మాత్రమే. ఇప్పుడు మాత్రం కొత్త ముఖం కనిపించనుంది. కాగా, పూజారితో పాటు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు వైజయంత్ పండా, భువనేశ్వర్ ఎంపీ అపరాజిత సారంగి, బాలేశ్వర్ ఎంపీ ప్రతాప్ సారంగి, కాగ్ గిరీశ్ చంద్ర సీఎం రేసులో ఉన్నారు. ఛత్తీస్ గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ లో లాగే సీఎంగా బీజేపీ కొత్తవారిని ఎంపిక చేసే వీలుందనే ప్రచారం జరుగుతోంది. ఏదేమైనా, రేపటికల్లా నిర్ణయం రావాల్సిందే.