బీజేపీలో ఒంటరిగా మిగిలిపోతున్న ఈటల
బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చినప్పుడు ఈటల రాజేందర్ వెంట తుల ఉమ ఉన్నారు. ఈటలతో పాటు బీజేపీలో ఆమె చేరారు.
కేసీఆర్ పై కోపంతో బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చి బీజేపీలో చేరి.. ఉప ఎన్నికల్లో విజయం సాధించిన ఈటల రాజేందర్ ఇప్పుడు ఆ పార్టీలో ఒంటరిగా మిగిలిపోతున్నారా? అంటే రాజకీయ వర్గాల నుంచి అవుననే సమాధానాలే వినిపిస్తున్నాయి. పార్టీలో కీలక నేతగా ఉండాల్సిన ఈటలకు బీజేపీలో ప్రాధాన్యత లభించడం లేదనే చెప్పాలి. తాజాగా వేములవాడ టికెట్ ను తుల ఉమకు మొదట కేటాయించిన బీజేపీ.. అనంతరం ఆ సీటును చెన్నమనేని వికాస్ రావుకు ఇవ్వడమే అందుకు నిదర్శనమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చినప్పుడు ఈటల రాజేందర్ వెంట తుల ఉమ ఉన్నారు. ఈటలతో పాటు బీజేపీలో ఆమె చేరారు. ఆమెకు వేములవాడ టికెట్ ఇప్పిస్తానని ఈటల అప్పుడు హామీనిచ్చారు. కానీ మరోవైపు మాజీ గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్ రావు తనయుడు వికాస్ రావు బీజేపీలో చేరి వేములవాడ టికెట్ పై కన్నేశారు. కానీ అధిష్టానంతో మాట్లాడి వేములవాడ టికెట్ ను తుల ఉమకే వచ్చేలా ఈటల చేశారు. దీంతో ఈటల పంతం నెగ్గించుకున్నారనే వ్యాఖ్యలు వినిపించాయి.
కానీ నామినేషన్ల చివరి రోజు తుల ఉమను కాదని వికాస్ రావుకు బీజేపీ బీ ఫాం ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. బీజేపీ నుంచి వేములవాడ అసెంబ్లీ స్థానంలో వికాస్ రావు పోటీకి నిలిచారు. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి అండతోనే వికాస్ కు టికెట్ వచ్చిందనే చెప్పాలి. దీంతో ఈటల మాటకు పార్టీలో విలువ లేదన్నది మరో తేటతెల్లమైందనే రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇక బీఆర్ఎస్ నుంచి ఈటలతో కలిసి బీజేపీలో చేరిన ఏనుగు రవీందర్ రెడ్డి ఆ పార్టీలో తగిన గుర్తింపు లేదని కాంగ్రెస్ లో చేరిపోయారు. ఇప్పుడు బాన్సువాడ నుంచి ఆయన పోటీ చేస్తున్నారు. దీంతో ఒక్కొక్కరిగా తన సన్నిహితులు వెళ్లిపోతుండటంతో బీజేపీలో ఈటల ఒంటరిగా మిగిలారనే టాక్ వినిపిస్తోంది.