కామ్రేడ్స్ మాటలు కూడా పెడ చెవిన పెట్టి... బీజేపీ ఉంటే గెలుపేనా బాబూ...?
ఏపీలో కామ్రేడ్స్ ఇంకా తెలుగుదేశం జనసేన వైపు ఆశగా చూస్తున్నారు. ఎప్పటికైనా బాబు తన దారిలోకి వస్తారని వారి ఆలోచన. ఏపీలో పొత్తులు ఎలా ఉండాలో కూడా వారే చెబుతున్నారు.
ఏపీలో కామ్రేడ్స్ ఇంకా తెలుగుదేశం జనసేన వైపు ఆశగా చూస్తున్నారు. ఎప్పటికైనా బాబు తన దారిలోకి వస్తారని వారి ఆలోచన. ఏపీలో పొత్తులు ఎలా ఉండాలో కూడా వారే చెబుతున్నారు. పొత్తులు హిట్ ఎలా అవుతాయో కూడా ఫార్ములా చెప్పేస్తున్నారు. బీజేపీ ఉంటే పొత్తు చిత్తే అని కూడా భయపెడుతున్నారు. హెచ్చరిస్తున్నారు. ఇలా సీపీఐ రామక్రిష్ణ చెప్పి గంటలు గడవలేదు, చంద్రబాబు ఢిల్లీ వెళ్లి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో భేటీ అయ్యారు.
ఏదో విధంగా బీజేపీతో పొత్తు కుదుర్చుకోవాలని బాగు తాపత్రయపడుతున్నట్లుగా కనిపిస్తోంది. ఒక వైపు సొంత మామ వారి పేరున వెండి నాణెం ఆవిష్కరణ జరుగుతూంటే ఆయన మాత్రం ఆ సమావేశానికి హాజరై అక్కడా జేపీ నడ్డా తో మంతనాలు సాగించారు అంటే బీజేపీ పట్ల ఆయనకు ఎంత మోజు ఉందో అని వైసీపీ నేతలు అంటున్నారు.
ఎంపీ విజయసాయిరెడ్డి అయితే ఈ విషయంలో బాబుని ఘాటుగానే విమర్శించారు. ఇదిలా ఉంటే బాబు అంతలా బీజేపీ వెంట పడడానికి కారణాలు ఏంటి, ఏపీలో బీజేపీకి ఏముంది అన్న ప్రశ్న రాక మానదు, ఇక బీజేపీకి 2019 ఎన్నికల్లో నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చాయి. ఆ తరువాత గడచిన నాలుగేళ్ల కాలంలో జరిగిన ఉప ఎన్నికలు, లోకల్ బాడీ ఎన్నికల్లో కూడా బీజేపీ ఎత్తిగిల్లింది లేదు.
రేపటి ఎన్నికల్లో కూడా బీజేపీ గ్రాఫ్ పెరిగి ఓట్లు పొత్తు పార్టీలకు కలుస్తాయని కూడా లేదు. మరి బీజేపీ అంటే ఎందుకు అంతలా బాగు తపన పడుతున్నారు అంటే అక్కడే ఉంది మ్యాజిక్ అంటున్నారు అంతా. బీజేపీని జగన్ నుంచి బయటకు తెస్తే జగన్ బెయిల్ రద్దు చేయించవచ్చు, ఆయన్ని తిరిగి జైలుకు పంపించవచ్చు. అసలు రాజకీయ క్షేత్రంలో ఉండకూడా చేయవచ్చు ఇలాంటి ప్లాన్స్ చాలానే ఉన్నాయని అంటున్నారు.
ఇవేమీ ప్రజలతో సంబంధం లేనివి, ఇవేమీ ఓట్లు రాల్చనివే. ఇవేమీ కూడా ఏపీకి మేలు చేయనివే. పూర్తిగా రాజకీయ లక్ష్యంతోనే బీజేపీ చెలిమిని టీడీపీ కోరుకుంటోంది అని అంటున్నారు. ఇక బీజేపీ ఆద్వర్యంలోని కేంద్రం సాయం లేకుండా చేస్తే ఎన్నికల వేళకు వైసీపీ ఉత్త చేతులతో నిలబడుతుంది. అపుడు టీడీపీ రాజకీయ క్షేత్రంలో స్వైర విహారం చేయవచ్చు. ఇదే ఆలోచనతో బీజేపీకి దగ్గర కావడానికి బాబు చూస్తున్నారు అని అంటున్నారు.
అయితే కామ్రేడ్స్ చెప్పినట్లుగా రెండవ వైపు కూడా ఆలోచించాలి కదా అన్న సూచనలు వస్తున్నాయి. బీజేపీ మీద ఉన్న కోపం వ్యతిరేకత చంద్రబాబు మీద ఆయన పార్టీ మీద పడితే మరోసారి జగన్ గెలిచే చాన్స్ కూడా ఉందన్న కామ్రేడ్స్ మాటలు కూడా సత్యం అవుతాయని అంటున్నారు.
అలాగే జగన్ మీద కేసులు పెట్టడానికో జైలుకు పంపడానికో అలాగే ఆయన్ని ఇబ్బందిల పాలు చేయడానికో టీడీపీకి ఇంటరెస్ట్ ఉండవచ్చు కానీ బీజేపీకి ఏమి పని అన్న వారూ లేకపోలేదు. ఎందుకంటే ఏపీలో ఏమీ లేని బీజేపీకి వైసీపీ అయినా టీడీపీ అయినా ఒక్కటే. ఇంకా చెప్పాలంటే ఇలా రెండు పార్టీలు సీన్ లో ఉండి పోటీ పడుతూంటేనే తమ వద్దకు వస్తాయన్న మరో గొప్ప థాట్ కూడా బీజేపీకి ఉండకుండా ఉంటుందా అంటున్నారు.
సో బీజేపీ ఎవరినీ ఏపీ పొలిటికల్ సీన్ లేకుండా ఎలిమినేట్ చేయదు, అలాగే తన రాజకీయం కోసమే బీజేపీ చూస్తుంది. అందువల్ల చంద్రబాబు ప్రజా కోణంలో ఆలోచించి పోరాటాలు చేస్తే రేపటి రోజున అలాంటి పొత్తులే సక్సెస్ అవుతాయని అంటున్నారు. మరి కామ్రేడ్స్ చెప్పిన మాటలను పెడ చెవిన పెడుతూ బీజేపీ నేతలతో బాబు మంతనాలు జరపడం ఏ రకమైన సంకేతం అని అంటున్నారు.