బీ అంటే బాబు, జే అంటే జగన్, పి అంటే పవన్ ... షర్మిల సెటైర్లు...!

బీజేపీకి ఏపీలో ఓట్లూ సీట్లూ లేకపోయినా మూడు ప్రధాన పార్టీలు బీజేపీ కొమ్ము కాస్తున్నాయని ఆమె గుంటూరు లో జరిగిన పార్టీ సమావేశంలో నిప్పులు చెరిగారు.

Update: 2024-01-26 16:40 GMT

ఏపీలో బీజేపీ బలంగా ఉందా అంటే ఉంది అంటున్నారు ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల. బీజేపీకి ఏపీలో ఓట్లూ సీట్లూ లేకపోయినా మూడు ప్రధాన పార్టీలు బీజేపీ కొమ్ము కాస్తున్నాయని ఆమె గుంటూరు లో జరిగిన పార్టీ సమావేశంలో నిప్పులు చెరిగారు.

బీ అంటే బాబు, జే అంటే జగన్, పి అంటే పవన్ అని ఆమె సరికొత్త అర్ధం చెప్పారు. అంటే అధికార వైసీపీతో పాటు ప్రతిపక్ష తెలుగుదేశం, జాన్సేన బీజేపీకి మద్దతుగా ఉంటున్నాయని షర్మిల ఆరోపించారు అన్న మాట. ఏపీని బీజేపీ ఈ విధంగా మూడు పార్టీల అండతో శాసిస్తోందని అని ఆమె అంటున్నారు.

బీజేపీ వల్ల ఏపీకి ఏమీ ఉపయోగం జరగలేదని, అయినా సరే ఆ పార్టీకి మద్దతు ఇస్తూ ప్రధాన పార్టీలు ఏపీ జనం ప్రయోజనాలను గాలికి వదిలేశాయని ఆమె నిందించారు. ఏపీలో జగనన్న పాలనలో వైఎసార్ మార్క్ ఎక్కడా లేదంటూ తన సోదరుడి మీద సెటైర్లు కురిపించారు.

హామీలు ఇచ్చి మోసం చేయడం వైస్సార్ కి అలవాటు లేదని, వైసీపీ నేతలకు మాత్రం అదే తెలుసు అంటూ చురకలు వేశారు. ఏపీలో తాము ఇచ్చిన హామీలను తొంబై తొమ్మిది శాతం అమలు చేశామని వైసీపీ చెప్పుకుంటూ ఉంటే ఒక్క హామీ కూడా తీర్చలేదని షర్మిల అంటున్నారు. అంతే కాదు గుంటూరుకి ఆమె కొత్త అర్ధం చెప్పారు.

ఇప్పటిదాకా ఏ ప్రతిపక్ష నాయకుడు కూడా చెప్పని తీరులో ఆమె గుంటూరుని గుంటలూరుగా చెప్పడమే విశేషం. అంటే ఏపీలో రోడ్ల పరిస్థితిని ముందుకు తెచ్చారన్న మాట. రోడ్లు ఏ మాత్రం బాగులేవు అని షర్మిల వేసిన మరో ఘాటైన సెటైర్ గా వీటిని చూడాలి.

గుంటలూరు గుంటూరు కావాలంటే కాంగ్రెస్ ఏపీలో అధికారంలోకి రావాల్సిందే అని షర్మిల నినదించారు. అంతే కాదు ఏపీకి ప్రత్యేక హోదా రావాలన్నా కూడా కాంగ్రెస్ కే పట్టం కట్టాలని ఆమె కోరుతున్నారు. మొత్తానికి షర్మిల సెటైర్లు ఎన్ని వేసినా అన్న గారి ప్రభుత్వం మీద బాణాలు మాత్రం పదునుగానే వేస్తున్నారు. ఎక్కడా తగ్గేది లేదు అనే అంటున్నారు. వైసీపీ నేతలకు మాత్రం ఆమె గట్టిగా పని చెప్పేట్లుగా ఉన్నారు. ఏదో అనాలని టీడీపీ జనసేనలౌ కలుపుతున్నా తలుపు చెక్కలతో మాత్రం వైసీపీ నే గట్టిగా కొడుతున్నారు.


Tags:    

Similar News