యానిమల్ విలన్.. ఇది సరిపోదేమో..?

అన్ని అనుకున్నట్లు జరిగితే బాబీ డియోల్ మొదట హరిహర వీరమల్లు సినిమాలోనే కనిపించేవారు.

Update: 2025-01-17 00:30 GMT

అన్ని అనుకున్నట్లు జరిగితే బాబీ డియోల్ మొదట హరిహర వీరమల్లు సినిమాలోనే కనిపించేవారు. కానీ ఆ సినిమా వాయిదా కారణంగా మొదట తెలుగులో అతను డాకు మహరాజ్ లో దర్శనమిచ్చాడు. యానిమల్ తో వచ్చిన క్రేజ్ కారణంగా ఈ సినిమా క్యారెక్టర్ పై కూడా అతనిపై అంచనాలు పెరిగాయి. పాన్ ఇండియా స్థాయిలో మాస్ అప్పీల్ ఉన్న కథతో ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందనే ఆశలు పెట్టుకున్నారు.

ముఖ్యంగా ఇలాంటి అవకాశాల కోసం బాబీ బిజీ అవ్వాలని చాలా కాలం వేచి చూశాడు. ఒకప్పుడు హీరోగా చేసిన అతను పదేళ్ళ పాటు ఎలాంటి అవకాశాలు అందుకోలేదు. ఎన్నో సందర్భాల్లో పనిలేక బాధపడిన సందర్భాలు ఉన్నాయి. ఇక యానిమల్ తో ఒక్కసారిగా బౌన్స్ బ్యాక్ అయ్యాడు. ఆ ఒక్క సినిమా వల్లే బ్యాక్ టూ బ్యాక్ అవకాశాలు వచ్చాయి. అయితే ఆ సినిమా తరువాత చేసిన పాత్రలు మాత్రం అంతగా క్లిక్కవ్వలేదు.

డాకు మహరాజ్ లో ఆయన చేసిన పాత్ర ప్రేక్షకులపై ఆశించినంత ప్రభావం చూపలేకపోయినట్లు కామెంట్స్ వస్తున్నాయి. హై వోల్టేజ్ విలన్ పాత్రలో బాబీ డియోల్ మెరుస్తారని అనుకున్నారు. కానీ ఆయన నటన పరంగా ఒక మోస్తరు ప్రదర్శన ఇచ్చినప్పటికీ, పాత్రకు సరైన డెప్త్ లేకపోవడం పెద్ద లోటు. పాత్ర రొటీన్‌గా, ఒకే తీరుగా సాగడం ప్రేక్షకులను అలరించలేకపోయింది.

బాబీ తెరపై కనిపించడమే తప్ప, సినిమా కథకు, ప్రేక్షకుల ఎమోషనల్ కనెక్ట్‌కు ఆయన పాత్ర పెద్దగా తోడ్పడలేదు. బాబీ డియోల్ ఇటీవల సౌత్ సినిమాలపై దృష్టి పెట్టారు. యానిమల్ తర్వాత ఆయన కంగువా వంటి సినిమాలలో కనిపించారు. కానీ ఆ సినిమాలోనూ ఆయన నటనకు విమర్శలు ఎదురయ్యాయి. ఇప్పుడు డాకు మహారాజ్లోనూ అదే రొటీన్ విలన్ ఆర్క్‌ను కొనసాగించారు. ఇది ఆయన కెరీర్‌కి కొత్తదనాన్ని తీసుకురావడం లేనట్టు అనిపిస్తుంది.

ఈ సినిమాలో విలన్ పాత్రకు భిన్నమైన పవర్, ఘాటు పెంచే అవకాశం ఉన్నప్పటికీ, దర్శకుడు బాబీ కొల్లి పాత్రను మరింత బలంగా మలచడంలో విఫలమయ్యారనే కామెంట్స్ వచ్చాయి. కథలో డెప్త్ లేకపోవడం, పాత్రను ప్రేక్షకులకు గుర్తుండేలా తీర్చిదిద్దలేకపోవడం వల్ల ఈ పాత్ర పాతదే అనిపించింది. బాబీ డియోల్ పాత్రను మరింత ప్రభావవంతంగా రూపొందిస్తే, ఇది సినిమా మొత్తానికి కలిసివచ్చేది. ప్రస్తుతం బాబీ డియోల్ అల్ఫా, థలపతి 69 వంటి సినిమాల్లో నటిస్తున్నారు. వాటితో ఆయన కెరీర్‌కు బూస్ట్ లభిస్తుందేమో చూడాలి.

Tags:    

Similar News