బోడే తగ్గేదేలే.. సీటూ మనదే.. గెలుపూ మనదే!

కాగా 2009లో ఉయ్యూరు నియోజకవర్గం రదై్ద పెనమలూరు నియోజకవర్గం ఏర్పడింది.

Update: 2024-01-13 06:49 GMT

కృష్ణా జిల్లాలో కీలకమైన నియోజకవర్గాల్లో పెనమలూరు ఒకటి. టీడీపీకి గట్టి పట్టున్న నియోజకవర్గాల్లో ఇది కూడా ఒకటి. నియోజకవర్గంలో 60 శాతానికి పైగా కమ్మ సామాజికవర్గ ఓటర్లే ఉన్నారు. గత ఎన్నికల్లో ఇక్కడ నుంచి టీడీపీ ప్రధాన కార్యదర్శి, చంద్రబాబు కుమారుడు నారా లోకేశ్‌ పోటీ చేస్తారని వార్తలు వచ్చాయి. అయితే ఆయన మంగళగిరి నుంచి బరిలోకి దిగారు.

కాగా 2009లో ఉయ్యూరు నియోజకవర్గం రదై్ద పెనమలూరు నియోజకవర్గం ఏర్పడింది. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ తరఫున కొలుసు పార్థసారథి గెలుపొందారు. 2014లో టీడీపీ అభ్యర్థి బోడే ప్రసాద్‌ విజయం సాధించారు. 2019లో మళ్లీ కొలుసు పార్థసారధి వైసీపీ తరఫున బరిలో నిలిచి బోడే ప్రసాద్‌ పై గెలుపొందారు.

అయితే వచ్చే ఎన్నికల్లో సిట్టింగ్‌ ఎమ్మెల్యే అయిన కొలుసు పార్థసారధికి వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ సీటు నిరాకరించారు. ఈ సీటును గృహనిర్మాణ శాఖ మంత్రి, ప్రస్తుతం కృష్ణా జిల్లా పెడన ఎమ్మెల్యేగా ఉన్న జోగి రమేశ్‌ కు ఇచ్చారు. దీంతో కొలుసు పార్థసారధి టీడీపీలో చేరడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇప్పటికే ఆ పార్టీ అధినేత చంద్రబాబుతో టచ్‌ లో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది.

మరోవైపు ప్రస్తుతం పెనమలూరు టీడీపీ నియోజకవర్గ ఇంచార్జిగా ఉన్న బోడే ప్రసాద్‌ తనకే సీటు అని ధీమా వ్యక్తం చేస్తున్నారు. పోటీ చేసేది తానేనని, గెలుపొందేది తానేనని, తగ్గేదే లేదని కార్యకర్తలు, అనుచరుల సమావేశంలో బహిరంగ ప్రకటన చేశారు. ఇంకా అధిష్టానం నిర్ణయం తీసుకోలేదని.. కాబట్టి ఎవరూ ఆగ్రహావేశాలకు గురికావద్దని సూచించారు. అధినేత నిర్ణయం తీసుకోకుండా పార్టీ లైన్‌ దాటి మాట్లాడటం సరికాదన్నారు.

ఈ నేపథ్యంలో విజయవాడ తూర్పు టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌.. బోడే ప్రసాద్‌ ను కలిసి బుజ్జగిస్తున్నట్టు టాక్‌. బోడే రాజకీయ భవిష్యత్తుకు ఎలాంటి ప్రమాదం ఉండదని చంద్రబాబు మాటగా తాను చెబుతున్నానని బోడే ప్రసాద్‌ కు తెలిపారు. రాజకీయ సమీకరణాల్లో భాగంగా కొలుసు పార్థసారధికి ఈ సీటును కేటాయించాల్సి ఉంటుందని చెప్పినట్టు తెలుస్తోంది.

వాస్తవానికి కొలుసు పార్థసారధికి నూజివీడులో టీడీపీ టికెట్‌ ఇస్తారని ప్రచారం జరిగింది. నూజివీడు నియోజకవర్గంలో కొలుసు సామాజికవర్గమైన యాదవులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. ఈ నేపథ్యంలో నూజివీడు బరిలో కొలుసును బరిలోకి దించాలని అనుకున్నారు. అయితే ఆయన తాను పోటీ చేస్తే పెనమలూరు నుంచే పోటీ చేస్తానని మంకు పట్టు పట్టడంతో ఇక ఈ సీటును ఇవ్వక తప్పలేదని చెబుతున్నారు.

Tags:    

Similar News