.consent-eea { display:none; } .consent-ccpa{ display:none; } .amp-geo-group-eea .consent-eea { display:block; } .amp-geo-group-ccpa .consent-ccpa { display:block; }

ఇదేంది.. రాజధాని విషయంలో జనసేన కీలక నేత ట్విస్ట్‌!

ఈ నేపథ్యంలో జనసేన నేత బొలిశెట్టి సత్యనారాయణ ఢిల్లీ, ఉత్తరాఖండ్‌ వరదలను ఉటంకిస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి కీలక సూచనలు చేశారు.

Update: 2024-07-01 13:11 GMT

ఆంధ్రప్రదేశ్‌ లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. రాజధాని విషయంలోనూ కూటమి ప్రభుత్వం తమ స్టాండ్‌ ఏమిటో ఇప్పటికే చెప్పేసింది. అమరావతే ఆంధ్రప్రదేశ్‌ రాజధానిగా ఉంటుందని స్పష్టం చేసింది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక తన తొలి పర్యటనకు చంద్రబాబు పోలవరం ప్రాజెక్టును ఎంచుకోగా, రెండో పర్యటనకు అమరావతి రాజధాని ప్రాంతాన్ని ఎంపిక చేసుకున్నారు.

ఈ నేపథ్యంలో జనసేన పార్టీ కీలక నేతల్లో ఒకరు అయిన ఆ పార్టీ అధికార ప్రతినిధి బొలిశెట్టి సత్యనారాయణ ట్విస్ట్‌ ఇచ్చారు. తాజాగా ఢిల్లీలో, ఉత్తరాఖండ్‌ లో భారీ వర్షాలకు వరదలు సంభవించిన సంగతి తెలిసిందే. ఢిల్లీ, ఉత్తరాఖండ్‌ ఈ వరదలకు అతలాకుతలమయ్యాయి. పలు వాహనాలు, కార్లు ఆట వస్తువుల్లా వరద ప్రవాహానికి కొట్టుకుపోయాయి.

ఈ నేపథ్యంలో జనసేన నేత బొలిశెట్టి సత్యనారాయణ ఢిల్లీ, ఉత్తరాఖండ్‌ వరదలను ఉటంకిస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి కీలక సూచనలు చేశారు. రాజధాని నిర్మాణం విషయంలో జాగ్రత్తలు పాటించాలన్నారు. నదీ తీర ప్రాంతంలో రాజధాని నిర్మాణాలు ఉండకూడదన్నారు. గుంటూరు జిల్లాలోని నదీ తీరానికి ఎగువ ప్రాంతాల్లో రాజధాని నిర్మాణాలు ఉండాలన్నారు.

రాజధాని అమరావతి ప్రాంతంలోని నదీ తీర ప్రాంతంలోని భూములు ఇసుక తిన్నెలపై ఏర్పడ్డ ఒండ్రు మట్టి భూములని బొలిశెట్టి సత్య గుర్తు చేశారు. అవి జరీబు భూములని... వాటిని మూడు పంటలు పండే వ్యవసాయ భూములుగానే ఉంచాలని ప్రభుత్వానికి సత్య కీలక సూచన చేశారు. నదీ తీర ప్రాంతంలోని భూములను రాజధానికి తాగునీటి వసతులు కల్పించడానికి, వ్యవసాయానికే వినియోగించాలన్నారు.

Read more!

ఈ మేరకు బొలిశెట్టి సత్యనారాయణ సోషల్‌ మీడియా వేదికగా రాజధాని విషయంలో తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఆయనకు పర్యావరణవేత్తగా పేరుంది. పలు పర్యావరణ అంశాలపై ఎప్పటికప్పుడు స్పందిస్తుంటారు.

"మొన్ననే దేశ రాజధాని ఢిల్లీలో యమునా నది వరదల్లో కొట్టుకుపోతున్న వాహనాలను చూశాం. నిన్న ఉత్తరాఖండ్‌ లో గంగానది వరదల్లో వాహనాలు కొట్టుకుపోయాయి..

రేపు ఆంధ్రప్రదేశ్‌ లో కృష్ణా, గోదావరి నదులకు వరదలు వచ్చినప్పుడు మన రాజధానిలో ఈ పరిస్థితి రాకూడదు. అంటే.. మన రాజధాని ప్రాంతంలో ఉన్న నదీ పరీవాహక ప్రాంతాల్లో నిర్మాణాలు చేపట్టకూడదు. గుంటూరులోనే ఎగువ ప్రాంతాల్లో రాజధాని నిర్మాణం జరగాలి. జరీబు భూములు కేవలం మూడు పంటలు పండే ప్రాంతమే కాదు.. అవి ఇసుక తిన్నెలపై ఏర్పడ్డ ఒండ్రు మట్టి ప్రాంతం. దాన్ని పంటలకు, రాజధానికి నీరు అందించడానికి మాత్రమే వినియోగించాలి. అక్కడ సహజ రాజధాని నిర్మాణం జరగాలి. అప్పుడే ఆ అభివృద్ధి ప్రకృతి విలయాలకు తట్టుకుని నిలబడుతుంది. పర్యావరణాన్ని పరిరక్షించే అభివృద్ధి ప్రస్తానం జరగాలి" అని ఎక్స్‌ లో బొలిశెట్టి సత్యనారాయణ పోస్టు చేశారు.

ఈ పోస్టును ఆయన వాటర్‌ మేన్‌ ఆఫ్‌ ఇండియా, జనసేన పార్టీ, పవన్‌ కళ్యాణ్, మాజీ ఎడిటర్‌ ఎంవీఆర్‌ శాస్త్రి, జనసేన శతఘ్ని టీమ్, టీడీపీ, బీజేపీ ఎక్స్‌ ఖాతాలకు ట్యాగ్‌ చేశారు.

ఈ నేపథ్యంలో జనసేన నేత బొలిశెట్టి సత్య సూచనలపై ఏపీ ప్రభుత్వం ఎలా స్పందిస్తుదనేది ఆసక్తికరంగా మారింది. వాస్తవానికి గత వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానులకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా శాసన రాజధానిగా అమరావతి, న్యాయ రాజధానిగా కర్నూలు, కార్యనిర్వాహక రాజధానిగా విశాఖపట్నం ఉంటుందని స్పష్టం చేసింది. మూడు పంటలు పండే అమరావతి భూముల్లో రాజధాని నిర్మాణం సరికాదని శివరామకృష్ణన్‌ కమిటీ సూచించిందని వైసీపీ అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో జనసేన కీలక నేతల్లో ఒకరిగా ఉన్న సత్య చేసిన తాజా సూచనలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

Tags:    

Similar News