పిన్నెల్లిలో పోలీసుల సోదాలు.. నేతల ఇళ్లల్లో ఏమేం దొరికాయంటే?

పిన్నెల్లి గ్రామంలో పోలీసులు సోదాలు నిర్వహించిన సందర్భంలో అధికార వైసీపీ నేతల ఇళ్లల్లోనూ.. విపక్ష టీడీపీ నేతల ఇళ్లల్లోనూ సోదాలు చేపట్టారు.

Update: 2024-05-17 03:54 GMT

ఏపీలో ఎన్నికలు హోరాహోరీగా జరగటం తెలిసిందే. పోలింగ్ కు ప్రచార వేడితో వాతావరణం ఒకింత ఉద్రిక్తంగా మారటం తెలిసిందే. అయితే.. పోలింగ్ పూర్తి అయిన తర్వాత చోటు చేసుకున్న దాడులు ఎంతలా ఉన్నాయన్నది చూస్తున్నదే. అయితే.. ఈ దాడులకు ఆరంభం మాత్రం పల్నాడు జిల్లా (ఒకప్పుడు ఉమ్మడి గుంటూరు జిల్లా) మొదట ఉండటం తెలిసిందే.

పల్నాడు జిల్లాలోని మాచర్ల అసెంబ్లీ నియోజకవర్గంలో చోటు చేసుకున్న దాడులపై కేంద్ర ఎన్నికల సంఘంతో పాటు న్యాయస్థానాలు సైతం తీవ్రంగా స్పందించాయి. కఠిన చర్యలకు తెర తీయటం తెలిసిందే. పలువురు పోలీసు అధికారులు.. కలెక్టర్లపైనా శాఖాపరమైన చర్యలు తీసుకోవటం తెలిసిందే.

ఇదిలా ఉండగా తాజాగా పోలీసులు జరిపిన సోదాలు షాకింగ్ అంశాల్ని వెలుగు చూసేలా చేశాయి. పలువురు రాజకీయ నేతల ఇళ్లల్లో బయట పడిన పెట్రో బాంబులు.. కొడవళ్లు.. ఇతర మారణాయుధాల్ని చూస్తే.. విద్వంసానికి.. హింసకు ఎంత భారీగా ప్రిపేర్ అయ్యారన్నది ఇట్టే అర్థమవుతుంది. ఈ విషయంలో అధికార.. విపక్షపార్టీలు అన్న తేడా లేకుండా ఇరువర్గాలకు చెందిన నేతల ఇళ్లల్లో ఇలాంటివి బయటకు రావటం గమనార్హం.

పిన్నెల్లి గ్రామంలో పోలీసులు సోదాలు నిర్వహించిన సందర్భంలో అధికార వైసీపీ నేతల ఇళ్లల్లోనూ.. విపక్ష టీడీపీ నేతల ఇళ్లల్లోనూ సోదాలు చేపట్టారు. వైసీపీకి చెందిన మండలపరిషత్ ఉపాధ్యక్షుడు చింతపల్లి చిన మస్తాన్ వలి తో పాటు.. వైసీపికి చెందిన చింతపల్లి పెద సైదా.. అల్లాభక్లు ఇళ్లల్లో 51 పెట్రో బాంబులు.. వేట కొడవళ్లు.. గొడ్డళ్లు దొరికాయి. అదే సమయంలో టీడీపీ సానుభూతిపరులైన జానీ బాషా.. తండా పెద్ద నన్నే తదితరుల ఇళ్లపైన బీరు సీసాలు.. రాళ్లను గుర్తించారు.

పోలీసులు జరిపిన సోదాల్లో పెట్రో బాంబులు ఎవరు తయారు చేశారు? ఎక్కడి నుంచి తెచ్చారన్న దానిపై తమకు సమాచారం ఉందని.. త్వరలోనే వారిని అదుపులోకి తీసుకోనున్నట్లుగా జిల్లా ఎస్పీ బిందు మాధవ్ వెల్లడించారు. సోదాల సందర్భంగా ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. ఈ లెక్కన మాచర్ల నియోజకవర్గం మొత్తం నాకాబందీ చేయిస్తే.. మరెన్ని సంచలన అంశాలు వెలుగు చూస్తాయో?

Tags:    

Similar News