మేమూ రాస్తాం కాషాయ పుస్తకం.. బుక్ పాలిటిక్స్ లోకి ఈటల
కాకపోతే లోకేశ్ రెడ్ బుక్ అంటే తెలంగాణలోని లీడర్లు తమ పార్టీ రంగులతో పుస్తకాలు రాస్తామంటూ కార్యకర్తలకు పూనకాలు తెప్పిస్తున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో బుక్ పాలిటిక్స్ నడుస్తున్నట్లు కనిపిస్తోంది. ఏపీలో యువనేత లోకేశ్ రెడ్ బుక్ సూపర్ హిట్ అవడంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని దాదాపు అన్ని పార్టీల వారు ఆ పల్లవినే అందుకున్నారు. కాకపోతే లోకేశ్ రెడ్ బుక్ అంటే తెలంగాణలోని లీడర్లు తమ పార్టీ రంగులతో పుస్తకాలు రాస్తామంటూ కార్యకర్తలకు పూనకాలు తెప్పిస్తున్నారు. తమపై పోలీసు అధికారులు అక్రమంగా కేసులు నమోదు చేస్తున్నారని, తాము అధికారంలోకి వచ్చి అలాంటి వారి సంగతి తేలుస్తామని.. అంతవరకు కాషాయ బుక్ రాస్తామంటూ బీజేపీ నేత, ఎంపీ ఈటల హెచ్చరించడంతో బుక్ పాలిటిక్స్ పై మరోసారి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
ఏపీలో సూపర్ హిట్ అయిన బుక్ పాలిటిక్స్ తెలంగాణపై ఎక్కువగా ప్రభావం చూపుతున్నట్లు కనిపిస్తోందని అంటున్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూతురు ఎమ్మెల్సీ కవిత ఇటీవల పింక్ బుక్ రాస్తామంటూ ప్రకటించి గులాబీ శ్రేణుల్లో ధైర్యం నూరిపోసే ప్రయత్నం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోని ప్రభుత్వం బీఆర్ఎస్ శ్రేణులను అణచివేస్తోందని, సోషల్ మీడియాలో ఏ చిన్న పోస్టు పెట్టినా అరెస్టు చేస్తున్నారని, అలా అనైతికంగా వ్యవహరించే అధికారులు, నాయకులను వదిలిపెట్టమంటూ హెచ్చరించిన కవిత పింక్ బుక్ ప్రస్తావన తెచ్చారు. ఇక తాజాగా సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం బీజేపీ నేతలను టార్గెట్ చేసిందని ఆరోపిస్తూ ఎంపీ ఈటల ఆరెంజ్ బుక్ రాస్తామని ప్రకటించడం ఆసక్తికరంగా మారింది.
ఏపీలో ప్రస్తుత మంతి లోకేశ్ ప్రతిపక్షంలో ఉండగా పాదయాత్ర చేశారు. ఆ సమయంలో కార్యకర్తల నుంచి వచ్చిన ఫిర్యాదులపై స్పందించి రెడ్ బుక్ రాస్తానంటూ ప్రకటించారు. దాదాపు 90 బహిరంగ సభల్లో రెడ్ బుక్ కోసం ప్రచారం చేసిన లోకేశ్ అధికారంలోకి వచ్చిన నుంచి రెడ్ బుక్ లో పేర్లు ఉన్నవారి పనిపడుతున్నట్లు చెబుతున్నారు. ప్రతిపక్ష వైసీపీ కూడా ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలు అవుతోందని విమర్శిస్తోంది. అదేసమయంలో తమ కార్యకర్తలు కూడా రెడ్ బుక్ రాసుకోవాలని పిలుపునిచ్చింది. ఇక వైసీపీ అధినేత జగన్ అయితే రెడ్ బుక్ తీవ్రత తగ్గించేలా తాము గుడ్ బుక్ రాసుకుంటామని, పార్టీ కోసం పనిచేసే వారికి పెద్దపీట వేస్తామని చెప్పారు. ఇలా దాదాపు ప్రధాన పార్టీలు అన్నీ బుక్ జపం చేయడమే పొలిటికల్ గా ఆసక్తి పెంచుతోంది. మరోవైపు అధినేతలు, వారి వారసులు ప్రకటనలు ఇలా ఉండగా, మాజీ మంత్రి అంబటి రాంబాబు, బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వంటి వారు సైతం గ్రీన్ బుక్, బ్లాక్ బుక్ రాస్తున్నామంటూ ఆ మధ్య ప్రకటించారు. మరి ఈ పార్టీ పుస్తకాలు ఆయా నేతలను అధికారంలోకి తీసుకువస్తాయా? లేదో? చూడాల్సివుంది.