కల్కి కాంప్లెక్స్ కు మించి...ఏపీలో 60 వేల కోట్లతో పెట్రో ‘కాంప్లెక్స్’

ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు జాతీయ, అంతర్జాతీయ పరిశ్రమలు ముందుకు వస్తున్నాయి.

Update: 2024-07-11 04:08 GMT

సీఎం జగన్ హయాంలో ఏపీలో పెట్టుబడులు పెట్టాలంటే ఛోటామోటా కంపెనీ మొదలు ప్రపంచ స్థాయి పరిశ్రమల వరకు వెనకడుగు వేసిన సంగతి తెలిసిందే. జగన్ విధ్వంసకర పాలనను చూసి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు కంపెనీలు ముందుకు రాకపోగా ఆల్రెడీ భారీగా పెట్టుబడులు పెట్టి విస్తరణకు సిద్ధమైన అమర రాజా బ్యాటరీస్ వంటి కంపెనీలు కూడా పొరుగు రాష్ట్రాలకు తరలిపోయిన వైనం తెలిసిందే. అయితే, ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టిన వెంటనే రాష్ట్రానికి పరిశ్రమలు క్యూ కడుతున్నాయి. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు జాతీయ, అంతర్జాతీయ పరిశ్రమలు ముందుకు వస్తున్నాయి.

ఈ నేపథ్యంలోనే తాజాగా సీఎం చంద్రబాబుతో భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ ప్రతినిధి బృందం భేటీ అయింది. ఆ సమావేశ వివరాలను చంద్రబాబు తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు. దేశంలోని తూర్పు తీరంలో ఏపీ వ్యూహాత్మక స్థానంలో ఉందని, గణనీయమైన పెట్రో కెమికల్ సామర్ధ్యాలను కలిగి ఉందని చంద్రబాబు అన్నారు. బీపీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కృష్ణకుమార్ నాయకత్వంలోని బీపీసీఎల్ ప్రతినిధుల బృందంతో ఈ రోజు సమావేశమయ్యానని చెప్పారు. సుమారు 60 నుంచి 70 వేల కోట్ల రూపాయల పెట్టుబడితో ఏపీలో చమురు శుద్ధి కర్మాగారం, పెట్రో కెమికల్ కాంప్లెక్స్ ఏర్పాటు చేయడంపై చర్చించామని చంద్రబాబు వెల్లడించారు.

అంతేకాదు, ఈ వ్యవహారంపై 90 రోజుల్లో వివరణాత్మక నివేదికను, సాధ్యాసాధ్యాలపై నివేదికను అందించాలని కోరినట్లు చంద్రబాబు వెల్లడించారు. ఈ ప్రాజెక్టు కోసం 5 వేల ఎకరాల భూమి అవసరం అవుతుందని, ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆ పరిశ్రమ స్థాపనకు అవసరమైన సదుపాయాలు కల్పించేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధంగా ఉందని చంద్రబాబు చెప్పారు.

మరోవైపు, వియత్నాంకు చెందిన ఎలక్ట్రిక్ వాహనాల తయారీ కంపెనీ విన్ ఫాస్ట్ సీఈవో ఫార్మ్ సాన్ తో భేటీ అయ్యానని చంద్రబాబు వెల్లడించారు. ఆటోమొబైల్ రంగంలో వియత్నాంకు చెందిన విన్ఫాస్ట్ కంపెనీ అగ్రగామిగా ఉందని, ఏపీలో ఎలక్ట్రిక్ వెహికల్స్, బ్యాటరీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పెట్టేందుకు ఆ కంపెనీ ఉత్సాహం చూపుతోందని చంద్రబాబు చెప్పారు.

ఇటీవల ఢిల్లీ వెళ్లిన చంద్రబాబు...కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరిని కలిసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా మచిలీపట్నంలో పెట్రో రిఫైనరీ ఏర్పాటు చేసే ఆలోచనను ఆయన ముందు చంద్రబాబు ఉంచారు. ఈ క్రమంలోనే ఏపీకి బీపీసీఎల్ ప్రతినిధులు వచ్చి సీఎం చంద్రబాబుతో భేటీ అయ్యారు.

Tags:    

Similar News